Burning Topic: వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్.. మరణాల శాతం 50కి పైనే!
Burning Topic: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన 'బుండిబుగ్యో' ఎబోలా రకం విజృంభణ.
Burning Topic: వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్.. మరణాల శాతం 50కి పైనే!
Burning Topic: కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ అంతటి ఆందోళనకు గురి చేస్తోంది ఎబోలా వైరస్. మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ ప్రమాకర వైరస్ ధాటికి నిలువునా వణికిపోతోంది. గతంలో సంభవించిన ఎబోలా వ్యాప్తికి భిన్నంగా, ప్రస్తుతం వణికిస్తున్న అరుదైన 'బుండిబుగ్యో' వైరస్ రకానికి ఎలాంటి వ్యాక్సిన్లు, ఆమోదించబడిన ప్రత్యేక చికిత్సలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ఎబోలా వైరస్ ధాటికి ఇప్పటి వరకూ 2,011 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంగో వ్యాప్తంగా మొత్తం 4,381 ఎబోలా కేసులు నిర్ధారణ అయ్యాయి. 704 మంది బాధితులు అక్రడి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తొలి 1000 మరణాలు నమోదు కావడానికి దాదాపు 9 వారాల సమయం పట్టింది, కానీ మరో 3 వారాల్లో రెట్టింపై మరో 1000 కిపైగా మరణాలు సంభవించాయి ఇక్కడ వైరస్ ఎంత రికార్డు స్థాయిలో వ్యాపిస్తుందో ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగో చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఎబోలా విజృంభణగా నిలిచింది. ఈ ఏడాది మే 15న ఎబోలా ప్రబలిందని కాంగో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఫిబ్రవరి నుంచే ఇది వ్యాప్తి చెందుతోందని జెనెటిక్ సీక్వెన్సింగ్ పరిశోధనలు చెబుతున్నాయి. 2014-16 సమయంలో పశ్చిమ ఆఫ్రికాలో ప్రబలిన ఎబోలా తొలి స్థానంలో ఉంది.
దీనినే ఇప్పటివరకు అత్యంత ప్రాణాంతకమైనదిగా పరిగణిస్తారు. అప్పట్లో దీని వల్ల ఏకంగా 28 వేలకుపైగా కేసులు నమోదవగా, 11 వేల మందికిపైగా మరణించారు. తాజాగా మరోసారి విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగోలో ఈసారి వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ మీద సాధారణంగా వాడే ఎబోలా టీకాలు లేదా మందులు దీనిపై ఏ మాత్రం ప్రభావం చూపలేవు. ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి వేగంగా పెరుగుతున్నప్పటికీ, దాన్ని గుర్తించడం, నియంత్రించడం, బాధితులకు సకాలంలో వైద్యం అందించడం అధికారులకు సవాల్ విసురుతోంది.
ప్రస్తుతం తూర్పు కాంగోలో ఎబోలా వైరస్ కేంద్ర బిందువు ఇతురి ప్రాంతంలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. వ్యాక్సిన్, చికిత్సా విధానాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వ్యాధి లక్షణాలు కాస్త ఆలస్యంగా బయటపడటం, చికిత్స ఆలస్యం కావడం వల్ల ఈ ఎబోలా రకం వ్యాప్తి వల్ల వల్ల మరణాల రేటు 45.9 శాతానికి చేరుకుంది.
మొదట్లో దీని లక్షణాల్ని మలేరియా, టైఫాయిడ్‌గా భావించి వేరే చికిత్స అందించడం కూడా నష్ట తీవ్రతను, మరణాల రేటును పెంచింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇవి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పరిణామాలని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పొరుగున ఉన్న దేశాల వారు కాంగోకు పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
1976లో కాంగోలోని ఎబోలా నది సమీపంలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించగా, ఆ దేశంలో విజృంభించడం ఇది రికార్డు స్థాయిలో 17వ సారి. అయితే ఇంత తీవ్రమైన పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. కాంగోలోని సుదూర అటవీ ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని, సకాలంలో సహాయక చర్యలు అందకే మరణాలు పెరుగుతున్నాయి. వైద్య బృందాలు వ్యాధి నియంత్రణకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా విస్తరణ వేగం పెరగడం కలకలం రేపుతోంది.
తూర్పు ప్రాంతాల్లో తిరుగుబాటు దారుల ఘర్షణల వల్ల ఆరోగ్య సిబ్బంది మారుమూల ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు పనికి తగ్గ వేతనాలు అందడం లేదని చాలా మంది ఆరోగ్య సిబ్బంది నిరసనలు, సమ్మెలు చేస్తున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం, సమాచార వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల కూడా వ్యాధిగ్రస్తుల్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. ఎబోలా వ్యాప్తిని అడ్డుకునేందుకు తూర్పు కాంగో అధికారులు బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించారు.
ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధులలో ఎబోలా ఒకటి. తీవ్రమైన రక్తస్రావ జ్వరానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. దీని మరణాల రేటు సగటున 50 శాతం వరకు ఉంటుంది. ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి మనషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాణాంతకమైన వైరస్ 21 రోజులపాటు రోగిలో సజీవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు, ఇంకా మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ, వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది.




