Burning Topic: మరణ మృదంగం మోగిస్తున్న ఎబోలా వైరస్...భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

Burning Topic: ఈ వైరస్ ప్రధానంగా సోకిన కోతులు, చింపాంజీలు, ముఖ్యంగా గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2026 6:53 AM IST
Burning Topic
X

Burning Topic: మరణ మృదంగం మోగిస్తున్న ఎబోలా వైరస్...భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

Burning Topic: ఎబోలా వైరస్ విషయంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి, ముఖ్యంగా ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయణీకులకు అడ్వైజరీ జారీ చేసింది. జ్వరం, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని హెచ్చరించింది. కాంగో, ఉగాండా, సూడాన్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్ట్ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఎబోలా వైరస్​నేపథ్యంలో వచ్చే వారం ఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్​- ఆఫ్రికా ఫోరమ్ సదస్సును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఎబోలా వైరస్.. కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద ఉపద్రవంగా మారింది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మరణ మృదంగం మోగిస్తోంది ఈ వైరస్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పటివరకు 139 మంది మృతి చెందారు. దాదాపు 600 అనుమానిత కేసులను గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుఎంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. కాంగోతో పాటు ఉగాంగాను కూడా ఎబోలా తీవ్రంగా వణికిస్తోంది. దీంతో గత వారం డబ్ల్యూహెచ్​ఓ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఎబోలా వైరస్ తొలిసారిగా 1976లో కాంగోలో వెలుగు చూసింది. ఎబోలా నది సమీపంలోని యంబుకు అనే గ్రామంలో తొలి కేసు నమోదైంది. దీంతో ఈ నది పేరు మీదుగానే ఈ వైరస్‌కు "ఎబోలా" అని పేరు పెట్టారు. అప్పటి నుంచీ కాంగోలో ఈ వైరస్ వ్యాపించడం 17వ సారి. పేద దేశమైన కాంగోకు ఎబోలా సమస్యగా మారింది. వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తమకు మరింత సామగ్రి, సిబ్బంది కొరత ఉంది. ఐసొలేషన్ గదుల కొరత కారణంగా వైద్యులు సాధారణ వార్డుల్లోనే ఎబోలా అనుమానిత రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్‌తో ఒక్క కాంగోలోనే 88మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఎబోలా కారణంగా ఓ ప్రముఖుడు మరణించారు. సురక్షిత ఖననం కోసం డాక్టర్లు సూచించగా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యతిరేకించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఐసోలేషన్ క్యాంప్‌కు నిప్పుపెట్టారు. పోలీసులు ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఎబోలా వైరస్‌కు ప్రత్యేకంగా చికిత్సలు, వ్యాక్సిన్‌లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం అసాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని కోరింది. అలాగే, సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు జ్వరం, తీవ్ర అలసట, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి, శరీరంలో అనూహ్య రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఎయిర్‌పోర్ట్ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఎబోలా అనుమానితులతో సంబంధం కలిగిన ప్రయాణికులు కూడా వెంటనే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని డీజీహెచ్‌ఎస్‌ పేర్కొంది.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చి ప్రయాణీకుల్లో 21 రోజుల లోపు ఎవరైనా ఎబోలా లక్షణాలతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రందించాలని, తమ ప్రయాణ చరిత్రను వెల్లడించాలని కేంద్ర వైద్యశాఖ సూచించింది. ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు ప్రకారం స్క్రీనింగ్‌, ఆరోగ్య పరీక్షలు, ప్రజారోగ్య చర్యలకు సహకరించాలని కోరింది. కాగా దేశంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు ఏమీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌, క్వారంటైన్‌ విధానాలు, నమూనాల పరీక్షలు, రోగుల చికిత్స వంటి పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక కార్యచరణ విధానాలను ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు.

మరోవైపు ఎబోలా వైరస్ తీవ్రంత నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం ఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్​- ఆఫ్రికా ఫోరమ్​​ సదస్సును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సదస్సుకు ఆఫ్రికా నుంచి కీలక నేతలు, అధికారులు రావలసి ఉంది. అయితే, వైరస్​ వ్యాప్తి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే సదస్సును వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సదస్సు వాయిదా పడినప్పటికీ, ఎబోలాను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా దేశాలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భారత్ ప్రకటించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాంగో, ఉగాండాలో వైరస్​ వ్యాప్తిపై 'గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ' ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అయితే ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియేసస్ స్పష్టం చేశారు.

ఎబోలా వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు, ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, ముఖ్యంగా గబ్బిలాల ద్వారా ఇది మనుషులకు ప్రబలుతుంది. వీటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల కూడా సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తి శరీరం నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.

తీవ్రమైన జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పులు, తల నొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు ఎబోలా వైరస్ లక్షణాలు.. వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతినడం, అంతర్గత, బాహ్య రక్తస్రావం, చిగుళ్ల నుంచి, మూత్రం ద్వారా, మల విసర్జనలో రక్తస్రావం కావచ్చు. ఇది అత్యంత ప్రమాదకర స్థితి.లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా ఎబోలా వైరస్‌ను నిర్ధారిస్తారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story