Off The Record: అంబటి అరెస్ట్ సీక్వెల్!
Off The Record: మద్యం రవాణా కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు. విచారణకు హాజరుకావాలని అధికారుల ఆదేశాలు. రాజకీయంగా సంచలనం.
Off The Record: అంబటి అరెస్ట్ సీక్వెల్!
Off The Record: అంబటి రాంబాబు. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ సన్నిహిత నేతగా ముద్ర పడి.. జగన్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి మూడుసార్లు పోటీ చేసి ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్‌లో ఇరిగేషన్ మంత్రిగానూ పని చేసారు. మంత్రిగా ఉన్న సమయంలో రాంబాబుపై అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. తన శాఖ కంటే.. అవసరం లేని వ్యవహారాల్లో వివాదాస్పదంగా మారారన్న అభియోగాలు ఉన్నాయి.
సంక్రాంతి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భోగి మంటల వేళ ఆయన వేసే డాన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భోగిమంటలే కాదూ లేటెస్ట్ పాటల తీన్ మార్ దరువుకు డ్యాన్స్ కూడా చేయడం ఆయన నైజం. ఎంతలా అంటే సంబరాల రాంబాబు డ్యాన్స్‌కు సెపరేటుగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పలుసార్లు రాంబాబు డ్యాన్సులు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇలా డ్యాన్సులు చేయడం ఆయన హాబీ. అయితే తన ఇలాఖాలో పలు సవాళ్లు చేసిన రాంబాబు.. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. తనకు తిరుగు లేదని చెప్పుకున్న చోట నుంచి తప్పుకుని గుంటూరులో పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.
అంబటి రాంబాబుకు మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించటం కోసం ప్రాసలు.. పంచ్ డైలాగ్‌లతో రాంబాబు.. టీడీపీ నేతలపై విరుచుకుపడటం అలవాటుగా మారింది. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌పై మండిపడిన అంబటి.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాగా..ఇప్పుడు అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబటి రాంబాబుపై పోలీసులు వరుస కేసులు నమోదు చేసినా పెద్దగా లెక్కచెయ్యడం లేదట. ఇప్పుడు ఏకంగా విచారణకోసం ఈడీ రావాలని నోటీసులు ఇవ్వడంతో అరెస్ట్ తప్పదంటున్నారు. గతంలోనూ అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదు అయ్యాయి. విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చింది కూడా అంబటే అన్నది అందరికీ తెలిసిందే. సాయికృష్ణను పోలీసులు హత్య చేశారని చేసిన ఆరోపణలు, కేసు వ్యవహారం ఇప్పటికీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది.
గత ఏడాది వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన నేపధ్యంలో పోలీసులతో అంబటి దురుసుగా ప్రవర్తిచడంతో మొదలైన కేసుల పరంపర కొనసాగుతునే ఉంది. గుంటూరులోని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వివాదం.. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద అంబటి హల్చల్.. అంబటిపై ఇలా వరుసగా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై దాడి చెయ్యడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కేసులు నమోదు చేసారు. చంద్రబాబు కేసులో 18రోజులు జైలు జీవితం గడిపారు. తన సోషల్ మీడియా ఖాతాలో కేంద్రమంత్రి పెమ్మసానికి బేడీలు వేసి అరెస్ట్ చేసినట్లు ఏఐ వీడియో పోస్టు చెయ్యడం మరో వివాదానికి దారితీసింది. అంబటి పోస్టింగ్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంబటిపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్రమంత్రిపై ఏఐ వీడియో కేసులో అంబటిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మద్యం రవాణా స్కాంలో మాజీ మంత్రి అంబటిని విచారణలు రావాలని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చెయ్యడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈనెల 11న విచారణకు రావాలంటూ అంబటికి ఈనెల 8నే ఈడీ నోటీసులు పోస్టల్ ద్వారా పంపించింది. అంబటి విచారణకు రాకపోవడంతో మరోసారి ఈనెల 17న ఈడీ అధికారులు అంబటికి ఫోన్ చేశారు. అయితే తనకు నోటీసులు అందలేదని ఈడీకి అంబటి సమాధానమిచ్చారట. దీంతో ఈనెల 24న విచారణకు హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే 24న ఈడి విచారణకు రాంబాబు హాజరయ్యారా లేదా గోప్యంగా ఉంచారు మాజీ మంత్రి అనుచరులు. ఇప్పటికే మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావును ఈడీ అరెస్ట్ చేసింది.
మద్యం రవాణా స్కాంలో అంబటి రాంబాబు పాత్రపై ఇప్పటికే ఈడీ ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంబటికి సన్నిహితుడైన సత్తెనపల్లికి చెందిన వైసీపీ నేత సుబ్బారెడ్డి మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు ఈడీ గుర్తించింది. సుబ్బారెడ్డితోపాటు సత్తెనపల్లి వైసీపీ అధ్యక్షుడు పురుషోత్తంను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈ ఇద్దరు నేతలను విచారించిన తర్వాతే అంబటిని ఈడీ అధికారులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
అంబటి డీటైల్స్, ఏదైనా కంపెనీలు ఉంటే వాటి వివరాలు, అంబటి పాన్, ఆధార్, పాస్ పోర్ట్ విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని ఈడీ సూచించినట్లు సమాచారం. అయితే, అంబటి 24న కూడా విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో సమయం కోరారు. 25న తప్పక హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. అయితే, అంబటి మాత్రం తాను ఇప్పుడు హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాలు చూపుతున్నారు.
ఇప్పుడు ఈడీ ఈ కేసులోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పని చేసిన వారిని అరెస్ట్ చేసింది. వారిలో కొందరికి తాజాగా బెయిల్ వచ్చింది. ఇప్పుడు అంబటి విషయంలోనూ అరెస్ట్ తప్పదనే ప్రచారం సాగుతోంది. దీంతో అంబటి ఈడీ ముందుకు ఎప్పుడు వెళ్తారు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.




