Burning Topic: ముంచుకొస్తున్న ముప్పు.. వినాశనం తప్పదా?

Burning Topic: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎందుకు పెరుగుతోంది? ఎల్ నినో (El Nino) అంటే ఏమిటి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 April 2026 7:04 AM IST
Burning Topic
X

Burning Topic: ముంచుకొస్తున్న ముప్పు.. వినాశనం తప్పదా?

Burning Topic: ఎల్‌నినో.. భారత్‌లో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడానికి, వర్షపాతం తగ్గడానికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఈ ఎల్‌నినో ఏర్పడుతుందట. ఎల్‌నినో వల్ల ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాల ఆచ్ఛాదన తగ్గడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుతుంది. దీని ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎల్‌నినో వల్ల పసిఫిక్ నుంచి భారత్ వైపు వీచే రుతుపవన గాలులు బలహీనపడతాయి. దీనివల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కాకుండా, వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో బలంగా ఉన్న ఏళ్లలో దేశంలోని మధ్య, వాయువ్య ప్రాంతాల్లో కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గత గణాంకాలను పరిశీలిస్తే.. 1950 నుంచి వచ్చిన 16 ఎల్‌నినో సంవత్సరాల్లో సుమారు 7 ఏళ్లు భారత్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు తగ్గడం వల్ల పంట దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏడాదిలో తరముకొస్తున్న ఎల్‌నినో చక్రం అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్‌నినోగా మారవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీని ఫలితంగా ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని కొన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అలర్ట్ జారీ చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలు పెరిగినా అది వర్షాలపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఎల్‌నినో కండిషన్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతలు సాధారణంగా 2 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగితే సూపర్ ఎల్‌నినో ఏర్పడినట్టు చెబుతారు. జులైలో భారత్‌లో ఎల్‌నినో ఏర్పడి.. వర్షాకాలంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం గత ఏడాదితో పోల్చితే 92 శాతం మాత్రమేనేనట. గత ఏడాది 110శాతం వర్షపాతం నమోదైయ్యింది.

భారత్‌లో సర్వసాధరణంగా ఎండాకాలంలో బయటికి వెళ్లాలంటే భయం. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. ఎండల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రత, సాయంత్రం వేడిగాల్పులకు తోడు పొల్యూషన్. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎండవేడికి వడదెబ్బతో అల్లాడుతున్నారు. నడినెత్తిన ఎండ, రోడ్డుపై నుంచి వస్తున్న సెగతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లో ఆగినప్పుడు మరింత నరకం చూస్తున్నారు. పాదచారులదీ ఇదే దుస్థితి. ఇళ్లకే పరిమితమైనా.. గాలి ఆడక ఉక్కపోతకు మలమల మాడిపోతున్నారు. ఉక్కపోత ఎక్కువైంది. దీనికితోడు విద్యుత్ కష్టాలు లేకపోలేదు. ఏమాత్రం కాస్త కరెంటు పోయినా ఇంట్లో కూడా ఉండలేని సిట్యుయేషన్. ఎండటైములో ట్యాప్‌ నీళ్లు ఆన్ చేస్తే సలసల కాగుతున్న వేడివేడి నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రభావం ఉదయం ఆరు వరకు కూడా ఉంటుందంటే ఎండల తీవ్రత ఎంతగా ఉందో అంచనా వేయవచ్చు.

ఈ పరిస్థితి మరో రెండు నెలలపాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్ నెలల్లో సూర్యుని తీవ్రత మరింత పెరుగుతుందట. అంటే ఈ ఏడాది ఎండాకాలం సుదీర్ఘంగా కొనసాగుతుందన్న మాట. వాతావరణ మార్పుల కారణంగా వర్షం లేకుండా ఈ వేడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఏపీలోని 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలో అయితే ఏకంగా 45 డిగ్రీలకు అటూఇటూగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ , కొమురంభీమ్, పెద్దపల్లి జిల్లాల్లో నమోదవుతున్నాయి. తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాతోపాటు రాయలసీమను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే రికార్డవుతున్నాయి. మిగతా తెలంగాణ జిల్లాల్లో వీటికంటే 2 లేదా 3 డిగ్రీలు తక్కువగానే ఉంటున్నాయి. అయితే ఈ ఏడాది అత్యధిక ఉష్ణగ్రతలు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో నమోదైయ్యయి. ఇలా ఉండగా.. మే నాటికి సాధారణంకంటే 3 లేదా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి.

అయితే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది ఇప్పుడు ఒకేసారి వచ్చిన మార్పు కాదంటున్నారు నిపుణులు. 20 ఏళ్లుగా కొంచెంకొంచెంగా ఉష్ణోగ్రతల ప్రభావం పెరుగుతోందట. సముద్రమట్టం నుంచి హైదరాబాద్ 500 మీటర్ల ఎత్తులో ఉండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు గ్రహించి, తిరిగి రాత్రిపూట వేడి గాలులను విడుదల చేస్తాయట. ఫలితంగా హైదరాబాద్ మహానగరంలో రాత్రి పూట కూడా వేడి తీవ్రత తగ్గడంలేదట. బహుళ అంతస్థుల భవనాలు, హైరైజ్ అపార్ట్‌మెంట్ల ప్రభావంతో కూడా గాలి తక్కువగా వీస్తుంది. ఫలితంగా రీ రేడియేషన్ ఎఫెక్ట్, ఉక్కపోతలకు కారణమవుతోందట. దీనికితోడు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో కాలుష్యం కూడా అంతే స్థాయిలో రెట్టింపవుతోంది.

సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినపుడు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఎండలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్నారు నిపుణులు. ఒక వేళ ఆ సమయంలో బయటకు వెళ్లాల్సివస్తే.. తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు చేస్తున్నారు. బయటకు వెళ్లినపుడు తల భాగం కప్పిఉంచేలా టోపీ పెట్టుకోవాలి. లేదంటే కండువా లాంటి కాటన్ దుస్తులు చుట్టుకోవాలి. లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. గంటకోసారి మంచి నీళ్లు తాగాలి. అంతేకాకుండా ఎండలో తిరుగుతున్నపుడు గంటకోసారి నీడకు వచ్చి కనీసం 15నిమిషాలపాటు రెస్ట్ తీసుకోవాలి. బటర్ మిల్క్, లస్సీ, నిమ్మరసం, చెరుకు రసం వంటి జూస్‌లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ సమయాల్లో ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. మరోవైపు విపత్తుల నివారణ శాఖ హెచ్చరికల దృష్ట్యా.. తెలుగు రాష్ట్రాల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story