Big Story: 2027లో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!
Big Story: వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఈసీ. జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో నవంబర్ 20 తర్వాత పర్యటనలు.
Big Story: 2027లో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!
Big Story: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయి బృందం పర్యటించే అవకాశాలున్నాయి.నవంబర్ 20 తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కావొచ్చని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే పూర్తి స్థాయి బృందంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు ఉంటారు.
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించనుంది. కాగా ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ శాసన సభ పదవీ కాలం మే 22న ముగియనుంది. పంజాబ్‌లో 120 స్థానాలు ఉండగా మార్చి 16న అసెంబ్లీ గడువు ముగుస్తుంది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా మార్చి 14న, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలు ఉండగా, దీని గడువు మార్చి 28న ముగియనుంది. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా మార్చి 13న ఈ శాసన సభ గడువు ముగుస్తుంది.
కాగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.ఉత్తరప్రదేశ్, గోవా,ఉత్తరాఖండ్, మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. కాగా ఒక్క పంజాబ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది.కాగా ఈసారి కూడా మొత్తం ఐదు రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.
ఇదిలా ఉంటే, పూర్తి స్థాయి బృందం పర్యటనకు ముందుగా ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సహా సీనియర్ అధికారుల బృందం ఇప్పటికే ఉత్తరాఖండ్, మణిపూర్‌లో పర్యటించింది. ఉత్తరాఖండ్‌లో అక్టోబర్ 12- 13 తేదీల్లో, మణిపూర్‌లో అక్టోబర్ 22-23 తేదీల్లో రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ బృందం పంజాబ్‌లో పర్యటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ తొలి వారంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు, దీపావళి తర్వాత గోవాకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ పర్యటనల్లో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్లు , సీనియర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసులు సహా ఇతర సంస్థల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలు, భద్రతా ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధత తదితర అంశాలు సమీక్షిస్తారు. ప్రతి రాష్ట్రంలో పర్యటన పూర్తయిన తర్వాత సీనియర్ అధికారుల బృందం తమ రిపోర్టును ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి బృందం పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాగా ఈ ఐదు రాష్ట్రాలతో పాటు మరో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఇక్కడ ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబర్ 12 నుంచి ఓటరు పేర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర అభ్యంతరాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 11 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. క్లెయిమ్స్, అభ్యంతరాలను డిసెంబర్ 28లోగా పరిష్కరించి, జనవరి 4న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లు అంతా జాబితాలో ఉన్నారో లేదో నిర్ధరించడంతో పాటు ఓటర్ల వివరాలను సరిచేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.




