Burning Topic: ఇజ్రాయెల్‌లో మళ్ళీ ఎన్నికలు తప్పవా ?
Burning Topic: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. నెతన్యాహు కూటమికి 53, ఐసెన్‌కోట్ కూటమికి 48 స్థానాలు దక్కగా, 19 సీట్లతో అరబ్ పార్టీలు కీలకంగా మారాయి.
Burning Topic: ఇజ్రాయెల్‌లో మళ్ళీ ఎన్నికలు తప్పవా ?
Burning Topic: ఇజ్రాయెల్ అంతర్గత, బాహ్య భద్రత అత్యంత క్లిష్ట దశలో ఉన్న సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు దేశంలో తీవ్రమైన రాజకీయ చీలికను స్పష్టం చేశాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మలుపు ఇది. ఓటర్లు ప్రతీకారాన్ని కాకుండా అనిశ్చితిని ఎంచుకున్నారు. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు కూటమికి, మాజీ సైన్యాధిపతి గాడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష కూటమికి మధ్య జరిగిన పోరులో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా 'హంగ్' తీర్పునిచ్చారు.
61 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో రెండు ప్రధాన శక్తులూ విఫలం కావడంతో, మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ఇజ్రాయెల్ మరో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితిలోకి జారుకుంది. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెలీ పార్లమెంటు నెసెట్‌లో నెతన్యాహూ కూటమికి 53, గాడి ఐసన్కోట్ కూటమికి 48 సీట్లు మాత్రమే దక్కాయి. అరబ్ పార్టీల కూటమికి 19 స్థానాలు దక్కాయి.
అపజయాల అంచుల్లో నిలబడి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బెంజమిన్ నెతన్యాహు దిట్ట. కానీ, ఈసారి ఆయన ఎదుర్కొంటున్న సవాలు అంత సులువైనది కాదు. అక్టోబర్ 7 దాడి తదనంతర యుద్ధ పరిణామాల తర్వాత జరిగిన ఈ చారిత్రక ఎన్నికలలో, నెతన్యాహు తన పూర్తి మెజారిటీని కోల్పోయారు. ఆయన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలగం ఆయనకు దూరమైంది.
అరబ్ పార్టీలు ఇప్పుడు ఇజ్రాయెల్ తదుపరి ప్రధాని ఎవరో తేల్చే కీలక స్థానానికి చేరుకున్నాయి. శత్రువులు, మిత్రుల మధ్య సందిగ్ధంలో పడ్డ ఇజ్రాయెల్ రాజకీయ యవనికపై ఇప్పుడు సరికొత్త వ్యూహ ప్రతివ్యూహాల పర్వం మొదలైంది. ప్రత్యర్థులు ఆయనను గద్దె దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా, కేర్‌టేకర్ ప్రధానిగా ఉంటూనే తన రాజకీయ మనుగడ కోసం నెతన్యాహు వేయబోయే తదుపరి అడుగు ఏమిటన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ దక్కని నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం చేసే సంక్లిష్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెతన్యాహు ప్రభుత్వం తిరిగి రాకుండా అడ్డుకునేందుకు ఐసెన్‌కోట్ కూటమికి అరబ్ పార్టీలు రాఆమ్, జాయింట్ లిస్ట్ మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే వాటితో చేతులు కలిపేందుకు కూటమిలోని యూదు పార్టీలు అంగీకరించే ప్రసక్తి లేదు. ఒకవేళ బయటి నుంచి అరబ్ పార్టీలు మద్దతు ఇచ్చినా సమస్యలు ఎదుర్కోక తప్పదు.
అరబ్ పార్టీకి ఓటు వేసిన వారంతా పాలస్తీనా మద్దతుదారులు. వివాదాస్పద గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని వారితోనూ వీరికి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా యూదులు వీరిని అనుమానాస్పదంగానే చూస్తున్నారు. గతంలో ఒక్కసారి అరబ్ పార్టీలు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వం కాస్తా 18 నెలల్లో కూలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరబ్ పార్టీలతో జట్టు కట్టవద్దరి నెతన్యాహూ ఇప్పటికే ఇతర కూటములను హెచ్చరించారు.
నెతన్యాహుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఐసన్కోట్ కూటమిని కలుపుకోవడం ఒ పరిష్కారం. అప్పుడు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే ఇది కూడా సాధ్యం కాదని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల్లో నెతన్యాహూను ఓడించే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఏకతాటిగా పని చేశాయి. నెతన్యాహుకు మెజారిటీ దక్కనందున ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఐసెన్‌కోట్ డిమాండ్ చేశారు.
2023 అక్టోబర్ నాటి హమాస్ దాడికి నెతన్యాహూ బాధ్యతారాహిత్యమే కారణమని విపక్ష కూటమి ఆరోపించింది. ఈ కారణంగా ఆయనతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని ఇప్పటికే తేల్చి చెప్పారు. కాగా ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ రాజకీయ పార్టీలు తమ వైరుద్ధ్యాలను పక్కనబెట్టి చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఎంత వరకూ సాధ్యమో చెప్పలేం.
నెతన్యాహు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 8 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇందు కోసం విపక్ష పార్టీలతో చేతులు కలపడం కంటే.. ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో తన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నఫ్తాలీ బెనెట్, అవిగ్దోర్ లైబర్మెన్ను తనవైపునకు తిప్పుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ వెస్ట్‌బ్యాంకులో సెటిల్మెంట్ల విస్తరణ వంటి విధానాలకు మద్దతు కూడా ఇచ్చారు. సాంప్రదాయ యూదులకు మిలటరీ సేవల మినహాయింపును బెనెట్, లైబర్మాన్లు వ్యతిరేకించారు.
ఏ కూటమి కూడా అధికారానికి కావాల్సిన 61 స్థానాలను కూడగట్టుకోలేకపోతే మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటి దాకా నెతన్యాహూనే ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా కొనసాగుతారు. ఇదే విషయంలో ఆయన ప్రత్యర్థులు ఆందోళనతో ఉన్నారు. మళ్లీ ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలు కూడా కష్టమే. ఈలోగా నెతన్యాహు తన బలం పెంచుకునే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ ముందు ఇరాన్‌తో ఉద్రిక్తతలు, గాజా భవిష్యత్తు, వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితులు లాంటి అనేక సమస్యలు ఉన్నాయి.కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇరాన్, హమాస్ విషయంలో ఇజ్రాయెల్ కఠిన వైఖరిలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజాలో హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహు, ఐసెన్కాట్ ఇద్దరూ ఒకే వైఖరితో ఉన్నారు. కాగా ఇజ్రాయెల్‌తో భారత్‌కు రక్షణ, సాంకేతిక రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి.
డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైబర్ భద్రత, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. అయితే ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగితే భారత్‌కు ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలు, గల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇజ్రాయెల్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే అరబ్ దేశాలు, ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించడం భారత్‌కు కీలకంగా మారనుంది.




