Burning topic: మస్క్ జీవితంలో మరో ట్విస్ట్.. శివోన్ జిలిస్‌తో బ్రేకప్!

Burning topic: టెస్లా అధినేత ఎలన్ మస్క్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ లతో బ్రేకప్. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విడిపోయినట్లు వెల్లడించిన జిలిస్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Oct 2026 7:32 AM IST
Burning topic
X

Burning topic: మస్క్ జీవితంలో మరో ట్విస్ట్.. శివోన్ జిలిస్‌తో బ్రేకప్!

Burning topic: ఎలన్ మస్క్ ..పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా కంపెనీ అధినేతగా ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.ఇందుకు కారణం ప్రస్తుత జీవిత భాగస్వామి శివోన్ జిలిస్ తో బ్రేకప్ కావడమే. కాగా శివోన్ జిలిస్ తో ఎలన్ మస్క్ చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నాడు. కారణాలు తెలియదు కానీ అకస్మాత్తుగా శివోన్ జిలిస్ కు ఎలన్ మస్క్ బ్రేకప్ చెప్పేశాడు.

కాగా ఎలన్ మస్క్ తనకు బ్రేకప్ చెప్పడం చాలా బాధగా ఉందని శివోన్ జిలిస్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ లోని ప్రతి అక్షరంలోనూ శివోన్ జిలిస్ ఆవేదన కనిపించింది. ముందుగా ఎటువంటి చర్చ లేకుండానే అకస్మాత్తుగా ఎలన్ మస్క్ తనతో విడిపోయారని శివోన్ జిలిస్ వెల్లడించింది.

అయితే ఎలన్ మస్క్ అంటే తనకు చాలా ఇష్టమని మరోసారి మనస్సు విప్పింది. ఎన్నో జన్మలకు సరిపడ నాలెడ్జ్ ను ఎలన్ మస్క్ తనకు అందించారని శివోన్ జిలిస్ ప్రశంసలు కురిపించింది. ఎలన్ మస్క్ తో విడిపోవడం తనకు తీరని లోటని ఆమె పేర్కొంది.అయితే భవిష్యత్తులో ఎలన్ మస్క్ తానూ మంచి స్నేహితుల్లాగా ఉంటామని సదరు పోస్టులో శివోన్ జిలిస్ వెల్లడించింది.

కాగా శివోన్ జిలిస్ ఉన్నత విద్యావంతురాలు.యేల్ యూనివర్శిటీలో ఆమె చదువుకున్నారు. ఓపెన్ ఏఐ లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఎలన్ మస్క్ తో పరిచయం కలిగింది. ఆ తరువాత వీరిద్దరూ సహజీవనం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నడిచే న్యూరాలింక్ ప్రాజెక్టు లో ఆమె చేరారు. న్యూరాలింక్ ప్రాజెక్టు లో శివోన్ జిలిస్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు.

ఇదిలాఉంటే శివోన్ జిలిస్ కు భారతీయ మూలాలున్నాయి. శివోన్ జిలిస్ తల్లి పంజాబీ. అయితే శివోన్ జిలిస్ కెనడాలో పెరిగారు. కాగా ఎలన్ మస్క్, శివోన్ జిలిస్ కు నలుగురు పిల్లలున్నారు. వీరిలో ఒక కుమారుడి పేరులో శేఖర్ అనే పదం ఉంటుంది. ప్రముఖ ఇండో అమెరికన్ సైంటిస్టు సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం కుమారుడికి శేఖర్ అని పేరు పెట్టారు.ఈ విషయం ఎలన్ మస్క్ స్వయంగా వెల్లడించారు.

ఎలన్ మస్క్ నూటికి నూరు శాతం ఓ భిన్నమైన వ్యక్తి. సమాజంలో చాలామంది లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు. అతికొద్దిమంది మాత్రం లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలన్‌ మస్క్‌ రెండో జాబితాలోకి వస్తారు. ఎలన్ మస్క్ జీవితం పూలపాన్పు కాదు. ఆయనది ఎత్తుపల్లాల జీవితం. అపజయాల పునాదిపై ఎదిగొచ్చిన కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్. ఆయన జీవితంలో ఒకటి కాదు. రెండు కాదు. అనేక పరాజయాలున్నాయి. ఒక విజయం సాధించగానే, దాని వెంట మరో ఓటమి. ఇలా పరాజయాలు, విజయాలతో పెనవేసుకుపోయింది ఎలన్ మస్క్ జీవితం.

వాస్తవానికి జీవితపు తొలిరోజుల్లో ఆయన ఒక ఫెయిల్యూర్. ఒకదాని వెంట మరొకటిగా పరాజయాలు ఎలన్ జీవితంలో తరుముకుంటూ వచ్చాయి. అయినా, ఎలన్ మస్క్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించుకుంటూ జీవితంలో దూసుకువెళ్లాడు.

టెస్లా ఈ పేరు వినగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది ఎలన్ మస్కే. టెస్లా కంపెనీ తరఫున విద్యుత్ కార్లను తయారు చేయడం కోసం మస్క్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. 2006లో టెస్లా రోడ్‌స్టర్ కారు బయటకు వచ్చింది. అప్పట్లో ఆదో సంచలనం. మార్కెట్ లో ఉన్న అనేక కార్లకు టెస్లా రోడ్‌స్టర్ గట్టి పోటీ ఇచ్చింది .టెస్లా రోడ్‌స్టర్‌కు మంచి హిట్ టాక్ వచ్చింది. దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీమీద ఎలన్ మస్క్‌కు పట్టు దొరికింది. ఆ తర్వాత, ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇదిలా ఉంటే ఒక దశలో అమెరికా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఎలన్ మస్క్‌ ప్రయత్నించారు.ది అమెరికన్ పార్టీ అంటూ పేరు కూడా ఖరారు చేశారు. పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.అంతేకాదు అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఘాటు విమర్శలు చేశారు.

అమెరికా ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికే..తాను రాజకీయ పార్టీ పెట్టినట్లు ఎలెన్ మస్క్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఎలన్ మస్క్ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మరోసారి మస్క్ కు సయోధ్య కుదిరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్