Burning Topic: ప్రపంచంలో మొట్ట మొదటి ట్రిలియనీర్‌గా మస్క్

Burning Topic: ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా ఎలా నిలిచారు? స్పేస్ఎక్స్ ఐపీఓ సక్సెస్‌తో ఆయన సంపద ఏ స్థాయికి చేరింది?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Jun 2026 7:03 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచంలో మొట్ట మొదటి ట్రిలియనీర్‌గా మస్క్

Burning Topic: వన్ ట్రిలియన్.. అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు.. ఇవి అచ్చంగా డాలర్లు.. భారత కరెన్సీలో 95 లక్షల కోట్ల రూపాయలు.. ఇది ప్రపంచంలోని అత్యంత ధనికుడైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద.. తన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు 23 శాతం ఎగబాకడంతో ఈ ఘనతను సాధించారు. ఫోర్బ్స్ ప్రకారం మస్క్ నికర ఆస్తి విలువ ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. మస్క్ సంపదలో అత్యధిక భాగం స్పేస్‌ఎక్స్‌, టెస్లా, ఎక్స్‌ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఆయనకున్న వాటాల రూపంలోనే ఉంది. స్టాక్ మార్కెట్లో స్పేస్‌ఎక్స్ అడుగుపెట్టడంతో ఆయన సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది. వాల్‌స్ట్రీట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా స్పేస్‌ఎక్స్ షేర్లు నిలవడంతో ఎలాన్ మస్క్ ఈ రికార్డును నెలకొల్పారు.

స్పేస్‌ ఎక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద ప్రారంభ షేర్ల విక్రయం ద్వారా 75 బిలియన్ డాలర్లను సమీకరించింది. సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కో షేరుకు 135 డాలర్ల ఐపీఓ ధర వద్ద 555.6 మిలియన్ల స్పేస్‌ఎక్స్ షేర్లను కొనుగోలు చేశారు. స్పేస్‌ఎక్స్‌ షేరు 150 డాలర్ల వద్ద లిస్టయ్యింది. పబ్లిక్‌ ఇష్యూ ధర 135 డాలర్లతో పోలిస్తే ఇది 11శాతం అధికంగా ఉంది. ఇది 2019లో సౌదీ అరామ్కో నెలకొల్పిన మునుపటి ఐపీఓ రికార్డును అధిగమించింది. అంతకుముందు దక్షిణ టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ కేంద్రమైన స్టార్‌బేస్ నుంచి జరిగిన ఒక లాంఛనప్రాయ నాస్‌డాక్ గంట మోగించే కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. అక్కడే కంపెనీ షేర్లు 'SPCX' అనే టిక్కర్ సింబల్ కింద ట్రేడింగ్ ప్రారంభించాయి. కాగా, స్పేస్‌ఎక్స్ గణనీయమైన నష్టాలను నివేదించినప్పటికీ, కంపెనీ విలువ విపరీతంగా పెరగడంతో మస్క్ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతారని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు.

అంతరిక్షంలో ఉపగ్రహాలు, డేటా సెంటర్లను మోహరించడం, చివరికి అంగారక గ్రహంపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడం వంటి తమ దీర్ఘకాలిక ప్రణాళికల కోసం నిధులు సమీకరించేందుకే స్పేస్‌ఎక్స్ పబ్లిక్‌గా మారుతోందని ఎలాన్ మస్క్ చెప్పారు. మానవ జీవితాన్ని బహుళ గ్రహాలకు విస్తరించడమే స్పేస్‌ఎక్స్ లక్ష్యమని అన్నారు. కేవలం కొద్దిమంది వ్యోమగాములు మాత్రమే కాదు, అందర్నీ చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లాలని స్పేస్‌ఎక్స్ కోరుకుంటోందని వెల్లడించారు.పది లక్షల మందితో అంగారక గ్రహ కాలనీని ఏర్పాటు చేయాలనే మస్క్ ప్రణాళికలతో పాటు, అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు, కక్ష్యలో తిరిగే డేటా సెంటర్లను ప్రారంభించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలతో పోటీ పడటం వంటి లక్ష్యాలను స్పేస్‌ఎక్స్ పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యాలను సాధించడానికి స్పేఎస్ఎక్స్‌కు గణనీయమైన నిధులు అవసరమవుతాయి.

స్పేస్‌ఎక్స్‌ కెప్టెన్ ఎలాన్‌ మస్క్ .. సంపద విలువ కూడా స్పేస్‌ షిప్‌లా దూసుకుపోయింది. గూగుల్ సహ వ్యవస్థాపకులైన లారీ పేజ్, సెర్గే బ్రిన్, ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో సహా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో చాలా మంది సంయుక్త సంపదను కూడా ఎలాన్ మస్క్ దాటేశారు. ఎలాన్ మస్క్ ఆస్తి 10 మంది ముకేశ్‌ అంబానీలతో సమానం. భారత్‌లో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా.. వారి మొత్తం సంపద అంతా కలిపినా ఎలాన్‌ ముందు దిగదుడుపే..మస్క్ వ్యక్తిగత సంపద తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల స్థూల జాతీయోత్పత్తిని కూడా మించిపోయింది.ప్రపంచంలో 1 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ గల దేశాల సంఖ్య సుమారు 20. అంటే 170 దేశాకు పైగా జీడీపీల కంటే ఒక్క మస్క్‌ సంపదే ఎక్కువ! తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్‌ వంటి దేశాల జీడీపీలను మించిపోయాడు.

ఒక ట్రిలియన్ డాలర్ల విలువ 1 బిలియన్ డాలర్ల కంటే వెయ్యి రెట్లు పెద్దది. అదే పది లక్షల డాలర్లతో పోల్చి చూస్తే.. ఇది పది లక్షల రెట్లు ఎక్కువ. ఇంతటి భారీ సంపదకు ఎలాన్‌ మస్క్ ఒక్కడే అధిపతి అమెరికా సెన్సస్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 820 కోట్ల జనాభా ఉంది. ఒకవేళ మస్క్ ఆస్తినంతా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా పంచిపెడితే, తలా దాదాపు 122 అమెరికన్ డాలర్లు లభిస్తాయి. అంటే భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 10,300 కు సమానం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే ఈ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటగలిగాయి.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ గణాంకాల ప్రకారం.. అమెరికాలో విక్రయించే ఒక సగటు ఇల్లు లేదా విల్లా ధర సుమారు 403,200 డాలర్లు ఉంటుంది. ఈ లెక్కన మస్క్ 25 లక్షల విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయవచ్చు.

కాగా తన తదనంతరం ఈ ఆస్తులను నేరుగా తన పిల్లలకు ఇవ్వబోనని ఎలాన్ మస్క్ చెప్పేశారు. తన కంపెనీల్లో వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా నాయకత్వ బదిలీ జరగాలని చెప్పారు. సంపద, నాయకత్వం అనేది కుటుంబసంబంధాల ఆధారంగా బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఆసక్తి, నైపుణ్యాలు లేనప్పుడు బాధ్యతలు, ఆస్తులను అప్పగించకూడదని తేల్చి చెప్పారు. వారసత్వం కంటే వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా కంపెనీల బాధ్యతలను తదుపరి తరాలకు అప్పగించాలని ఎలాన్ మస్క్ గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తను లేనప్పుడు కూడా కంపెనీలను సమర్థవంతంగా నిర్వహించే వారికే తన కంపెనీల బాధ్యతలు అప్పగిస్తానని మస్క్ చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే తన దృష్టిలో కొందరు ఉన్నారని చెప్పినప్పటికీ వారి పేర్లను మాత్రం ఆయన ఎన్నడూ బయటపెట్టలేదు. మస్క్‌కు 13 మంది సంతానం ఉన్న విషయం తెలిసిందే. వారికి ఆస్తిని ఇచ్చే విషయమై మస్క్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story