Burning Topic: భారత్‌పై నోరు పారేసుకున్న ఎలాన్ మస్క్!

Burning Topic: భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేయగా, యూఎస్ రాజకీయాల్లో ఆయన నిధుల వ్యయంపై బెర్నీ సాండర్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Oct 2026 10:42 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్‌పై నోరు పారేసుకున్న ఎలాన్ మస్క్!

Burning Topic: భారత్‌లో తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలకు అనుమతుల జాప్యంపై అమెరికాకు చెందిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడం తెలిసిందే. స్టార్‌లింక్‌ భారత్‌లో అడుగుపెట్టకుండా టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కొందరు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

ఇది భారత ప్రజలపై చేస్తున్న నేరమని ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖేష్ అంబానీని ఉద్దేశించి "డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారత్‌కు అసలైన బాస్ మీరేనని తెలుసుకోలేకపోయినందుకు క్షమించండి" అంటూ మస్క్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

అయితే భారత్‌లో ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించబోమని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అన్ని నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతే లైసెన్సులు జారీ అవుతాయని తెలిపారు.

కాగా ఇప్పుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ కోసం పెడుతున్న భారీ ఖర్చు చర్చనీయాంశంగా మారింది. నవంబర్‌ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ పట్టును కొనసాగించేందుకు మస్క్‌ సుమారు 36.6 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇందులో జూలై నుంచి అందించిన విరాళాలే కనీసం 27.6 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థులకు మద్దతిచ్చే సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌కు 15.8 కోట్ల డాలర్లు, తన రాజకీయ కమిటీ అమెరికా పీఏసీకి 7.6 కోట్ల డాలర్లు అందించినట్లు నివేదికలు తెలిపాయి. ఇతర రిపబ్లికన్‌ అనుకూల రాజకీయ కమిటీలకు కూడా నిధులు సమకూర్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా కూడా ఎలాన్ మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీనిపై మీద అమెరికా అగ్ర రాజకీయ నాయకుడు, డెమొక్రాట్ పార్టీకి చెందిన సీనియర్ సెనెటర్ బెర్నీ సాండర్స్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్శించాయి.

2024లో ట్రంప్‌ గెలుపు కోసం మస్క్‌ సుమారు 29 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని బెర్నీ సాండర్స్‌ గుర్తు చేశారు. ఆ ఖర్చుకు ఫలితం లభించింది. ఆ తర్వాత ఆయన సంపద రూ.66 లక్షల కోట్లు పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారారు’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగేందుకు మరో 36.6 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు సాండర్స్. సంపన్నులు తమ ఆర్థిక శక్తితో రాజకీయ వ్యవస్థపై అసాధారణ ప్రభావం చూపుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంపదను రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి కొద్దిమంది బిలియనీర్లు భారీగా నిధులు సమకూర్చే పరిస్థితి పెరిగితే.. సామాన్య ప్రజల సమస్యల కంటే సంపన్నుల ప్రయోజనాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని శాండర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ వ్యవస్థ కొద్దిమంది ధనవంతుల గుప్పిట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని బెర్నీ సాండర్స్ పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్‌ను ఆపండి.. ఒలిగార్కీ ముగింపు పలకండి అని వ్యాఖ్యానించారు. కాగా ఒలిగార్క్ అనే పదాన్ని ఎలాన్ మస్క్ భారత్ మీద విమర్శలు చేసే క్రమంలో వాడారు. రష్యన్ భాషలో ‘ఒలిగార్క్‌’ అంటే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై అసాధారణ ప్రభావం చూపగల కొద్దిమంది సంపన్నులు లేదంటే శక్తిమంతుల సమూహం.

భారత్‌లో అలాంటి వ్యాపారవేత్తలే పోటీని అడ్డుకుంటున్నారన్నది ఆరోపించారు. కాగా మస్క్‌ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తన వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై మస్క్ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది నిబంధనలు, భద్రతా ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప, వ్యాపారవేత్తల మధ్య ఆరోపణలతో తేల్చకూడదని పలువురు పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్‌‌ తన ఆస్తులతో ప్రపంచానికి తొలి ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్‌ లాంటి ఎన్నో కంపెనీలకు అధినేతగా ఉన్నారు. ఆయనకు ప్రపంచంలోనే అత్యధికంగా 241 మిలియన్ల మంది ఎక్స్‌ ఫాలోవర్లు ఉన్నారు. కాగా మస్క్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొన్న దేశాధినేతలనే తూలనాడిన చరిత్ర ఆయనకు ఉంది.

తనకు అడ్డొచ్చిన న్యాయమూర్తులను నియంతలుగా చిత్రీకరించారు. 2024 జులైలో బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వాన్ని ‘నిరంకుశ పాలన’గా అభివర్ణించారు. కొత్తగా తెచ్చిన న్యూ ఫామ్‌ ఇన్‌హెరిటెన్స్‌ పన్ను విషయంలో అక్కడి ప్రధాని స్టాలిన్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు బ్రెజిల్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న కొన్ని ఖాతాలను బ్లాక్‌ చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డిమోరెస్‌ ‘ఎక్స్‌’ను ఆదేశించారు. అయితే వాక్‌ స్వాతంత్ర్యం పేరు చెప్పి ఆ ఖాతాలను బ్యాన్‌ చేసేందుకు ఎలాన్ మస్క్‌ నిరాకరించారు. దీంతో ‘ఎక్స్‌’ సిబ్బందిని అరెస్టు చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడంతో.. బ్రెజిల్‌ నుంచి తమ సిబ్బందిని మస్క్‌ తొలగించారు.

ఆ తర్వాత 2024 ఆగస్టులో ‘ఎక్స్‌’ను బ్రెజిల్‌ నిషేధించింది. వీపీఎన్‌తో ఆ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను వినియోగిస్తే జరిమానాలు వేస్తామని నాడు కోర్టు హెచ్చరించింది. స్టార్‌లింక్‌ బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. దీంతో 2.2 కోట్ల వినియోగదారులున్న బ్రెజిల్‌ మార్కెట్‌ చేజారిపోతుందని ఎలాన్ మస్క్‌ గ్రహించారు. చివరకు తగ్గి.. ఆ దేశంలో తమ సిబ్బందిని తిరిగి నియమించారు.కోర్టు విధించిన భారీ జరిమానాలనూ చెల్లించారు.

2025 జర్మనీ ఎన్నికల్లో ‘ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ’ పార్టీకి ఎలాన్ మస్క్‌ మద్దతు ప్రకటించారు. ఆ పార్టీకి మద్దతుగా పత్రికల్లో వ్యాసం కూడా రాశారు. ఈ చర్యలతో తమ దేశ ఎన్నికల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం మండిపడింది. జర్మనీలో భారీగా పెట్టుబడులు పెట్టడంతో అక్కడి రాజకీయాలపై మాట్లాడే హక్కు మస్క్‌కు ఉందని నాడు ఆయన ప్రతినిధి సమర్ధించుకున్నారు. కెనడాలో పాడ్‌కాస్ట్‌లు, ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లు రిజిస్టర్‌ చేసుకోవాలని నాటి ప్రధాని ట్రుడో ప్రభుత్వం చట్టం తెచ్చింది.

అయితే వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటున్నారని మస్క్ విమర్శించారు. తాజాగా కెనడా నుంచి క్యూబెక్‌, అల్బెర్టా, సస్కట్చేవాన్‌ విడిపోవాలంటూ మస్క్‌ ఉచిత సలహా ఇచ్చారు. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. ఆ విషయాన్ని కెనడా ప్రజలు నిర్ణయించుకొంటారని ప్రధాని కార్నీ గట్టిగా బదులిచ్చారు. ఉక్రెయిన్‌ మిలిటరీకి స్టార్‌లింక్ సేవలను ఇచ్చిన మస్క్‌.. రష్యా కీలక నౌకాదళ స్థావరంపై దాడి సమయంలో కట్‌ చేశారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది.

2024 ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ఎలాన్ మస్క్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ - డోజ్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు డొనాల్డ్ ట్రంప్. కాగా ట్రంప్‌ ప్రవేశపెట్టిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ యాక్ట్‌’ను విమర్శిస్తూ డోజ్‌ నుంచి వైదొలిగారు మస్క్. తాను లేకపోతే ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయే వారని వ్యాఖ్యానించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీలను తొలగిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందంటూ తీవ్రమైన దాడికి దిగారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. మస్క్‌కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. ఒక దశలో మస్క్‌ సంస్థల కాంట్రాక్టులు రద్దు చేస్తే.. అతడు దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. చివరకు జేడీ వాన్స్‌, ట్రంప్‌ జూనియర్‌ రాయబారంతో ఎలాన్ మస్క్‌ క్షమాపణలు చెప్పి.. ట్రంప్‌ వ్యతిరేక పోస్టులు డిలీట్‌ చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్