Burning topic: యూరోప్‌ను వణికిస్తున్న వేడి గాలులు..అత్యధిక ఉష్ణోగ్రతలు!
Burning topic: యూరప్ ఖండంలో భానుడి భగభగలు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు వడదెబ్బతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన.
Burning topic: యూరోప్‌ను వణికిస్తున్న వేడి గాలులు..అత్యధిక ఉష్ణోగ్రతలు!
Burning topic: యూరోప్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి చల్లని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడి చాలా దేశాల్లో శీతాకాలాలు సుదీర్ఘంగా, తీవ్రమైన మంచుతో ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది వచ్చిన వేసవి యూరప్ దేశాల ప్రజలకు గతంలో ఎన్నడూ లేనన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ ఖండంలోని అనేక దేశాలు భానుడి భగభగలతో తల్లడిల్లుతున్నాయి.
అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల అక్కడి ప్రజలను భయపెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలలో ఉష్ణోగ్రతలు 37°C నుండి 40°C పైగా నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే 12°C నుండి 16°C వరకు ఎక్కువ అని చెబుతున్నారు అక్కడి అధికారులు. గతంలో ఎన్నడూ ఇలాంటి భయంకరమైన ఉష్ణోగ్రతలను తాము చూడలేదంటున్నారు ఈ దేశాల ప్రజలు.
ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడి దేశాల ప్రాణాలకు ముప్పుగా మారాయి. వడగాలుల తీవ్రత కారణంగా ఒక్క వారం రోజుల్లో ఏకంగా 16 వేల మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మరణాలు జూన్ 22 నుండి జూన్ 28 మధ్య కాలంలో నమోదు అయ్యాయని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్‌వర్క్ అధికారులు తెలిపారు.. యూరోప్ వాతావరణ చరిత్రలోనే అత్యంత ఘోరమైన వేడి తరంగాలు జూన్, జూలై నెలల్లో సంభవించాయి.
కాగా వడగాలుల తీవ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ మంది మరణించారు. జర్మనీలో అత్యధికంగా 11,900 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 5,762 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 3,001 మంది వడదెబ్బకు గురై చనిపోయారు. బ్రిటన్‌లో 2,877 మంది మరణించినట్లు రికార్డు అయింది. ఇక ఇటలీలో 2,700 మంది, బెల్జియంలో 2,000 మంది మరణించారు.
యూరప్‌లో ప్రజలు వేసవి ఎండలను తట్టుకోలేకపోవడానికి అక్కడి వాతావరణం. సాధారణంగా భారత్‌లాంటి ఉష్ణమండల దేశాలలో 40°C ఉష్ణోగ్రత సర్వ సాధారణం.. అయితే యూరప్ దేశాల్లో 35°C దాటితే జనం ఉక్కిరిబిక్కిరి అవుతారు. గతంలో అక్కడ వేసవి కాలం సుమారు 16°C నుండి 20°C మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దాంతో ఏసీల అవసరం ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 35°C దాటుతుండటంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం యూరోప్‌లోని అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటేసింది.
చల్లటి వాతావరణంలో బతికే యూరోపియన్ల శరీరాలు తీవ్రమైన వేడికి అలవాటు పడలేదు. ఈ కారణంగానే మరణాల సంఖ్య పెరుగుతొందని చెబుతున్నారు.యూరప్‌లో వృద్ధుల జనాభా ఎక్కువ. వారి శరీరాలు వేడి వల్ల వచ్చే శారీరక ఒత్తిడిని తట్టుకోలేవు. గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
గతంలో 2003లో వచ్చిన భయంకరమైన వేడి గాలులతో 70,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఆధునిక యూరోప్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన సహజ విపత్తులలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 2022 జూలై నెలలో కూడా ఇదే పరిస్థితి రావడంతో 16,000 మందికి పైగా చనిపోయారుయూరప్ నగరాల్లో రాళ్ళు, కాంక్రీట్ కట్టడాలు ఎక్కువ. ఇవి పగటిపూట వేడిని పీల్చుకుని, రాత్రి పూట కూడా ఆ వేడిని బయటకు విడుదల చేస్తాయి.
దీనివల్ల రాత్రి వేళల్లో కూడా వాతావరణం చల్లబడదు. ఉత్తర ఐరోపాలోని ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల, ప్రజలు ఇళ్లలోనే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇది ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రాజకీయ అంశంగా కూడా మారింది. దీనికి భిన్నంగా, శతాబ్దాలుగా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న దక్షిణ ఐరోపా దేశాలు మాత్రం ఈ వేడిని తట్టుకునేందుకు కొన్ని సాంప్రదాయ మార్గాలను కలిగి ఉండటంతో అక్కడ ప్రాణనష్టం కొంత మేర తగ్గిందని తెలిపింది.
ఈ ఏడాది అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులు యూరప్‌లోకి ప్రవేశించకుండా, వాతావరణంలో అధిక పీడనం ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. దీనివల్ల వర్షాలు పడక, వాతావరణం అంతా వేడిగా మారిపోయింది. దీంతో అనేక దేశాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో అల్లాడిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, యూరప్ ఖండం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఈ ఆకస్మిక మార్పునకు అక్కడి ప్రజలు ఇంకా అలవాటు పడలేదు.
చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించినప్పటికీ, భూతాపం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన రోజులను చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు అలాగే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది మంది మరణానికి కారణమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో ఈ వారంలోనే తీవ్రమైన హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.




