off the record: విధులకు హాజరు.. పనికి డుమ్మా!
off the record: సింగరేణిలో డిపెండెంట్ వారసత్వ ఉద్యోగాలు పొందిన కొందరు విధులకు హాజరై బయట తిరుగుతున్నారనే ఆరోపణలు. అధికారులను మేనేజ్ చేస్తున్నారంటూ కార్మికుల ఆగ్రహం.
off the record: విధులకు హాజరు.. పనికి డుమ్మా!
off the record: సింగరేణిలో డిపెండెంట్ వారసత్వ ఉద్యోగాలు పొందిన కార్మికులపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఉద్యోగులు విధుల్లో హాజరు వేయించుకుని.. ఆ తర్వాత బయట తిరుగుతున్నారనే ఆరోపణలు కార్మికుల నుంచి వినిపిస్తున్నాయి. పని చేయాల్సిన సమయంలో విధులకు దూరంగా ఉంటూ.. హాజరు మాత్రం నమోదవుతోందని ఆరోపిస్తున్నారు.
పనిచేసే ప్రాంతంలోని కొందరు అధికారులను మేనేజ్ చేసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విందులు, మందు, ఇతర తాయిలాలతో అధికారులను ప్రసన్నం చేసుకుని తమకు అనుకూలంగా వ్యవహరించేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అటెండెన్స్ నమోదు చేసుకుని.. పని చేయకపోతే.. ఆ హాజరుకు బాధ్యత ఎవరిది..? మస్టర్ వేసిన అధికారి ఎవరు..? పర్యవేక్షణ వ్యవస్థ ఏం చేస్తోంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ముందున్నాయి.
ఒకవైపు రిటైర్మెంట్‌కు చేరువైన కార్మికులు.. మోకాళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. అండర్‌గ్రౌండ్ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగమే ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వారు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొందరు.. విధులకు హాజరై బయట తిరుగుతూ పని నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో ఒకరు పని చేయకపోయినా.. ఆ పని భారం మాత్రం మరో కార్మికుడిపై పడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సంస్థలో ఒకరు ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలో శ్రమిస్తుంటే.. మరొకరు పైరవీలతో పని నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కార్మికుల్లో చర్చగా మారింది.
విధులకు హాజరై బయట తిరుగుతూ పని నుంచి తప్పించుకుంటే ఇది కేవలం ఉద్యోగి బాధ్యతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. సంస్థ పనితీరు, ఉత్పత్తి, కార్మికులపై పని భారానికి సంబంధించిన అంశంగా మారుతుంది. హాజరు నమోదులో అక్రమాలు ..? విధులకు హాజరైనట్లు చూపించడం? మస్టర్లు వేసే అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టి.. హాజరు నుంచి పని ప్రదేశం వరకు తనిఖీలు చేపట్టాలని, విధులకు హాజరై పని తప్పించుకునే సంస్కృతికి చెక్ పెట్టకపోతే.. దాని ప్రభావం చివరికి పనిచేస్తున్న కార్మికులపై, సంస్థ ఉత్పత్తిపైనా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి.. దొంగ హాజరు వేసుకుని పనికి డుమ్మా కొడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటారా..? లేదో..? చూడాలి.




