Jordar Varthalu: బ్యాంకులో రైతుల జోర్దార్ డ్యాన్సులు.. దెబ్బకు సెట్టైన బ్యాంకు అధికారులు
Jordar Varthalu: బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న నిరసన! అప్పు తీర్చినా NOC ఇవ్వకుండా తిప్పిన అధికారులకు బుద్ధి చెప్పేలా బ్యాంకులోనే డ్యాన్స్ చేసిన రైతు.
Jordar Varthalu: బ్యాంకులో రైతుల జోర్దార్ డ్యాన్సులు.. దెబ్బకు సెట్టైన బ్యాంకు అధికారులు
Jordar Varthalu: వారెవ్వా.. జోరు స్టెప్పులేస్తున్నరు గదా. అయినా., నిరసనల ముచ్చటన్నరు. గీళ్లేమో.. స్టెప్పులేస్తున్నరేందని పర్శాన్ గాకుర్రుల్లా. పుండెక్కన్నో మందు అక్కన్నే రాయాలె, పోయ్నకాన్నే ఎంకులాడాలనే శాత్రాన్ని బరాబార్ ఫాలో అయితున్నడు గీ రైతన్న. పట్టిచ్చుకోనోల్లతోనే పన్జేపిచ్చే పని ముంగటేసుకున్నడు మధ్యప్రదేశ్ చంద్వాడా కాడుండే విజయ్ పటీదార్ అనే గీ రైతన్న. అటు దిక్కున్న ఐడీఎఫ్ సీ ఫస్టు బ్యాంకుల,శానొద్దుల కింద కిసాన్ క్రెడిట్ కార్డుతోని 13 లక్షల బాకీ తీసుకున్నడట. ఇగ వాటిని ఈ నడ్మ మిత్తితోని సహా కట్టిండట. పైస సుతం బాకీలేకుంట జేశిండట. ఇగ బ్యాంకోల్లను బాకీలేదని రాశియ్యుమంటె.. ఇయ్యాల.. రేపు అని నెల రోజుల సుంధి తిప్పిచ్చుకుంటున్నరట. ఎన్ వోసీ ఇయ్యుమంటె అస్సల్కే పట్టిచ్చుకుంటలేరట. ఉత్త గిదీనికే శెప్పులర్గెతట్టు తిప్పుతరా అని రైతన్న.. దోస్తులను, సుట్టాలను పట్టుకొని బ్యాంకుకు పోయిండు. అది గూడ ఉత్తుత్తగ గాదుల్లో.. సుట్టుముట్టు గల్లీలకే కాదు, దున్యాంత ఇనెవడెతట్టు డప్పుసప్పుల్లతోని బ్యాంకుకు పోయిండు.
ఇగ బ్యాంకులనే తీన్మార్ కొట్టిపిచ్చి జోర్దార్ స్టెప్పులేశిండు. గిదేందని ఆడున్నోల్లంత పర్శానైర్రు. మేనేజర్ సాబ్ ఎంబటే కుర్ఛీలకెల్లి లేశచ్చి, నీ తిప్పలేందో జెప్పని గప్పుడు ఇన్నడట. ఎంబటే.. జేపిత్తం కని, గీ సప్పుడు జెయ్యకుర్రని ఒక్క తీర్గ బతిలాడిండట. ఇగ అప్పటికే వీడియోలు తీశి ఇంటర్నెట్ల ఎక్కిచ్చెటాలకు, బ్యాంకోల్ల పతార గోదాట్ల కల్శిపోయింది. రైతన్నను తిప్పలు వెడ్తరా అని ఇన్నోల్లు, ఆడ కండ్లార సూశ్నోల్లు సొట్లువెట్టిర్రు. ఆఫర్ల పేర్మీద అప్పులిచ్చి, అడ్డగోలు వడ్డీలు గుంజెతందుకున్న సొయ్యి, ఎన్వోసీ ఇచ్చెతందుకు ఉండదా అని మస్తు గరానికస్తున్నరు ఈ వార్తను ఫోన్లల్ల సూశ్న జనాలు. పబ్లికూ.. సూశిర్రు గదా, ఎవలన్న మిమ్ముల గిట్లనే సతాయిస్తె ఉత్తగనే ఊకోకుర్రి. తక్లీఫ్ ఏందో పదిమందికి తెల్శెతట్టు జేశి, సత్తాయించెటోల్లకు బుద్దచ్చెతట్టు జెయ్యుర్రి సరేనా.




