Jordar Varthalu: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు
Jordar Varthalu: తెలంగాణలో రైతుల కన్నీరు! ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరగక, అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Jordar Varthalu: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు
Jordar Varthalu: అన్నా రైతన్నా అన్నా కూలన్నా.. ఆనాటి నవ్వులు ఏవన్నా అన్నట్టే అంత ఆగమాగమున్నదుల్ల తెలంగాణల రైతన్నల హాలత్. ఐకేపీ వడ్లు పోశి దినాలు గడుస్తున్న, కాంటైతలెవ్వు, వడ్లు పోతలెవ్వు.. అడ్వి జంతువులు, అద్దుమ రాత్రి దంచి కొడ్తున్న వానలు శెయ్యంగ అన్నదాతల గోస శిన్నగలేదు పాపం. సర్కారొల్ల అశ్రద్ద శెయ్యంగ ఒక్కో జిల్లాల ఒక్కో తిప్పలున్నది. మెదక్ జిల్లాలనయితె ఐకేపీల వడ్లువోశి రొన్నెల్లయినా ఎక్కడి వడ్లు అక్కన్నే ఉన్నయ.ట హమాలీల కొర్త శెయ్యంగ, లారీల కొర్త శెయ్యంగ వడ్లు పోతలెవ్వట. కలెక్టర్కు ఫోన్జేశినా పట్టిచ్చుకోకపొయ్యేటాళ‌్లకు ఇయ్యళ్ల కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకు కూసున్నరు రైతులు.
ఇగ కొన్ని జాగల్ల ఇట్లుంటె ఇంకొన్ని జగాల్ల రైతన్నల ఆరుగాలం కష్టం ఆనల పాలైతాంది ఐకేపీల పోశిన వడ్లు టయ్యానికి పోక. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం బేస్తారం అద్దుమరాత్రి కొట్టిన ఆన శెయ్యంగ గల గల ఎండిన వడ్లు, తడ్శి ముద్దయినయి. టయ్యానికి బార్దాన్ సంచులు ఇచ్చి, కాంటవెడ్తె ఇసోంటి గోస పట్టకపోవని రైతన్నలు మస్తు బాధ పడవట్టిర్రు పాపం.
ఒక్క వడ్లే గాదు.. కొన్ని జాగల్ల మక్క పంటేశిన రైతుది గుడ శిన్న గోస గాదు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలున్న ఐకేపీల పోశిన వడ్లు, మక్కలు నిన్న రాత్రి ఆనకు తడ్శేటాల్లకు నిరసనకు దిగిర్రు రైతన్నలు. ముచ్చట తెల్శి జాయింట్ కలెక్టర్ చంద్రయ్య సారు ఐకేపీ కాడికత్తె జాయింటు కలెక్టరు కాళ‌్లు పట్టుకోని కన్నీళ్లు పెట్టుకున్నడు ఓ రైతన్నయితె.
పొద్దిర్గుడు పెట్టిన రైతులు గోస సుతం గింతే ఉన్నది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎవుసం మార్కెట్ల నెల రోజుల వట్టి తెచ్చింది తెచ్చినట్టే ఉన్నది పొద్దుతిరుగుడు, మొక్కజొన్న.
మక్కల కొనుగోళ‌్లకు సర్కారొల్లు యాపుల పేరిట కొత్త రూల్సు పెట్టి రైతులకు లేని తిప్పలు మోపు జేత్తరర్రని ఎగస్ పార్టొల్లు మస్తు కోపానికత్తార్రు.
అటు ఆదిలాబాదు జిల్లాలనయితె కంటి మీద కునుకు కరువైంది అన్నదాతలకు. ఐకేపీల ఓపెనింగైతె బొమ్మానంగ జేత్తార్రు గని, వడ్లు పోవుడైతె లేదు.
ఇగ పంట కోశి ఐకేపీల ధాన్యం పోశిన రైతుల తిప్పలు ఇట్లుంటె, సత్తువ లేని కల్తీ విత్తనాలు పెట్టిన రోజులది ఇంకో గోస. పల్నాడు జిల్లా ఈపూరు మండల అగ్నిగుండాల ఊరు రైతులు ఈల్లంత. మంచిగ పంటత్తదని శెప్తె అజిత అనేటి బ్రాండుతోటి అమ్మిన వరి పంటేశిర్రు. వంద ఎకురాలల్ల సాగు జేశిర్రట. ఎక్రానికి పది, పదిహేను బత్తాలు గుడ దిగుబడి రాకపొయ్యేటాల్లకు దిగాలు పడ్తున్నరిప్పుడు. మొత్తానికి ఏ దేశ చరిత్ర సూశినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు.. ఏడ సూశినా రైతుల తిప్పలు శిన్నగలెవ్వు. మరిగ సూస్తున్నరు గదా లీడర్లు.. మీదే భారం. ఏం జేత్తరో మీ ఇష్టం ఇగ. ఆ..




