Burning Topic: భారీగా పెరుగుతున్న చెక్కర ధరలు!
Burning Topic: దేశంలో చక్కెర ధరలు గత నెల రోజుల్లో భారీగా పెరిగాయి. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో కిలో చక్కెర ధర రూ 55 60కి చేరడంతో సామాన్యులపై భారం పడుతోంది
Burning Topic: భారీగా పెరుగుతున్న చెక్కర ధరలు!
Burning Topic: దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. గత నెల రోజుల్లోనే కిలో చక్కెర ధర 48 రూపాయల 18 పైసల దగ్గర నుంచి 55 రూపాయల 70 పైసలకు పెరిగింది.
కొన్ని నగరాల్లో ఇది కిలో 60 రూపాయలు కూడా దాటింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర రూ.52.30గా నమోదైంది. 2023 తొలినాళ్లలో రూ.40–45గా ఉన్న రేటు నిరుడు ఆగస్టు నాటికి రూ.46.30కి, ఇప్పుడు ఏకంగా రూ.52 పైకి చేరిపోయింది.
సామాన్యుల నిత్యావసరాల్లో ఒకటిగా ఉన్న చక్కెర ధరలు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పుడు పండుగల సీజర్ ప్రారంభమవుతోంది. వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి, ఓనం, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి అనేక ప్రధాన పండుగలు ఘనంగా జరుపుకుంటారు.
ఇలాంటి సమయంలో ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది. మన దేశంలోప్రధాన చక్కెర వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హోల్‌సేల్ చక్కెర ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి దాదాపు 20 % ఎగబాకి క్వింటాల్‌కు ఏకంగా రూ.5,400 కి చేరాయి.
పంజాబ్ రిటైల్ మార్కెట్లలో అత్యధికంగా కిలో ధర రూ.65 పలుకుతున్నది. ముంబై, భోపాల్, ఇతర నగరాల్లో నాణ్యతను బట్టి కిలో రూ.58 నుంచి రూ.63 మధ్య విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఫ్యాక్టరీ గేటు వద్ద ఎమ్ -గ్రేడ్ చక్కెర ధర క్వింటాల్‌కు రూ. 5,400కి చేరింది.
ఢిల్లీలో స్పాట్ మార్కెట్ ధరలు క్వింటాల్‌కు రూ. 5,775కు, ముజఫర్‌నగర్‌లో క్వింటాల్‌కు రూ. 5,754కు చేరుకున్నాయి. సాధారణంగా దేశంలో 60 లక్షల టన్నుల వరకు బఫర్ నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం అది 32 లక్షల టన్నులకు పడిపోవడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.
సాధారణంగా ఏటా 28 నుంచి 29 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం ఉంటుంది. అక్టోబరులో కొత్త చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
కాగా ప్రస్తుత సీజన్‌లో చెరకు పండించే రాష్ట్రాల్లో దాదాపు 34.3 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని కేంద్రం అంచనా వేసింది. అయితే పంటలకు పట్టిన రెడ్ రాట్, టాప్ బోరర్ వ్యాధులు ఇంకా వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి 30.6 మిలియన్ టన్నులకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
పండగల సీజన్‌లో ఇబ్బంది లేకుండా, సరఫరాను మరింత పెంచేందుకు రాష్ట్రాలు, చక్కెర మిల్లులు అక్టోబర్ 15 నుంచే క్రషింగ్ ప్రారంభించాలని కేంద్రం సూచించింది. దీని వల్ల అక్టోబరులో సాధారణంగా ఉత్పత్తి అయ్యే 3-4 లక్షల టన్నులతో పోలిస్తే 10 లక్షలటన్నుల పైగా చక్కెర ఉత్పత్తి కావొచ్చని అంచనా వేస్తోంది.
దీంతో పండగల సమయంలో మార్కెట్లో సరఫరా పెరిగి, ధరలపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇక అంతర్జాతీయంగా కూడా చక్కెర లభ్యత తగ్గి, టన్ను ధర 474 డాలర్ల నుంచి 552 డాలర్లకు పెరగడం కూడా దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమైందని వివరించింది. ఇది దాదాపు 16 శాతం పెరగడం గమనార్హం.
ఇదిలా ఉంటే కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ20 కార్యక్రమమే చక్కెర కొరతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలనే గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా లక్షలాది టన్నుల చక్కెర సమానమైన చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి.
గత ఏడాది సుమారు 27 లక్షల టన్నుల పంచదారను ఇథనాల్ తయారీకి మళ్లించారు. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 1,822 కోట్ల లీటర్లకు చేరుకుంది.
ఇందులో దాదాపు 30 నుంచి 35 శాతం ఫీడ్‌స్టాక్ నేరుగా చెరుకు నుంచే వస్తోంది భారీగా చెరుకు రసాన్ని డిస్టిలరీల వైపు మళ్లించడంతో పంచదార ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2025-26 సీజన్ ఆరంభంలో ఉత్పత్తి సమృద్ధిగా ఉందనే అంచనాతో ప్రభుత్వం సుమారు 8 లక్షల టన్నుల ఎగుమతులకు అనుమతి ఇవ్వడం దేశీయ నిల్వలను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇథనాల్ తయారీ కోసం చెరకు ఎక్కువగా మళ్లించడం వల్లే మార్కెట్లో ధరలు పెరిగాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానంగా వర్షాలు, పంట వ్యాధుల వల్ల చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, పండగల సీజన్ ముందు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, కొందరు వ్యాపారులు నిల్వల్ని పెంచుకోవడం వంటివి చేయడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొంది.
మార్కెట్లో పెరుగుతున్న ధరల్ని అదుపు చేసి, సరిపడా చక్కెర నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం నిల్వలపై ఆంక్షలు విధించడంతో పాటు, సుంకాల్లేని దిగుమతులకు అనుమతి ఇచ్చింది.
పెరిగిన చక్కెర ధరల విషయంలో ఈ ధరల పెరుగుదలపై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడొంతులు ధాన్యాల నుంచే వస్తుందని, కాబట్టి చక్కెర కొరతకు ఇథనాల్ కారణం కాదని వివరించింది.
దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టారిఫ్ రేట్ కోటా విధానంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముడి చక్కెర దిగుమతి విధానాన్ని సవరించింది. ప్రస్తుతం ముడి చక్కెరపై ఉన్న సాధారణ దిగుమతి సుంకం 100 % కాగా, ఈ ప్రత్యేక కోటా కింద మాత్రం సుంకం లేకుండా దిగుమతులు చేసుకోవచ్చు.
ఈ సౌకర్యం ముడి చక్కెరకు మాత్రమే వర్తిస్తుంది. తెల్ల చక్కెర లేదా శుద్ధి చేసిన చక్కెరకు సాధారణ సుంక విధానం కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర వినియోగదారుగా, రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ప్రస్తుతం తీవ్రమైన చక్కెర సంక్షోభం ఎదుర్కొంటోంది.
దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలకు చక్కెరను ఎగుమతి చేసిన మన దేశం, ఇప్పుడు మళ్లీ దిగుమతిదారుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడం ఆందోళన తీవ్రతకు అద్దం పడుతోంది.




