Off The Record: తిరుపతిలో మేయర్ వార్!
Off The Record: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసం ఎన్డీయే కూటమి అభ్యర్థి జేబీ శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థి వాసు యాదవ్ మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతోంది.
Off The Record: తిరుపతిలో మేయర్ వార్!
Off The Record: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఇక్కడ జరిగే నగరపాలక సంస్థ ఎన్నికలు.. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నామినేషన్ల దాఖలుకు మరో అవకాశం రావడంతో వైసీపీ 18 డివిజన్లలో అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇప్పటికే పోటీలో ఉన్న 45 డివిజన్లకు అదనంగా ఈ స్థానాల్లోనూ అభ్యర్థులు బరిలోకి దిగడంతో మొత్తం 63 డివిజన్లలో కూటమి, వైసీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. దీంతో నగరంలోని ప్రతి డివిజన్ రాజకీయ లెక్కలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా రెండు పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కూటమి తరఫున మన్యం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్, వైసీపీ తరఫున వాసు యాదవ్ మేయర్ అభ్యర్థులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్పొరేటర్ అభ్యర్థులు కూడా తమతమ డివిజన్లలో ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరి ప్రచారం ఎంత హోరెత్తింది అన్నదానికంటే.. ఎవరు ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలరు అన్నదే కీలకంగా మారుతోంది.
ఎన్డీయే కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్‌కు అవకాశం దక్కడంతో తిరుపతిలో కొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా మేయర్ అభ్యర్థిత్వం దక్కించుకున్న ఆయనకు.. ఇప్పుడు ఆ అవకాశాన్ని విజయంగా మలచుకోవాల్సిన బాధ్యత ఎదురైంది. కేవలం తన ప్రచారంతోనే సరిపెట్టుకోకుండా.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. యూత్‌లో జేబీ శ్రీనివాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరంలో ఏ వార్డులో ప్రచారానికి వెళ్లినా అక్కడ సైకిల్ పార్టీ సందడి వాతావరణం నెలకొంటోంది.
కూటమి జెండాలను పట్టుకొని యువత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత వారం రోజులుగా సాగుతున్న ప్రచారంలో జేబీ శ్రీనివాస్ నగరంలోని ప్రముఖులను కలవడం, కుల సంఘాల సమావేశాలకు హాజరవడం, డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతోపాటు కూటమి ముఖ్య నాయకులను కలుపుకొని ఉమ్మడి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీలిస్తూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న ఎదురవుతోంది. మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్‌కు పార్టీ అవకాశం కల్పించింది. మరి టికెట్ ఆశించిన ఇతర నాయకులు ఆయనకు ఎంతవరకు అండగా నిలుస్తారు..? జనసేన, బీజేపీ మిత్రపక్షాల కేడర్ క్షేత్రస్థాయిలో ఎంత సమన్వయంతో పనిచేస్తుంది..? ప్రచారాల్లో కనిపించే ఐక్యత ఓట్ల దగ్గర కూడా కొనసాగుతుందా..? ఈ ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.
తిరుపతి నగర ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం కుల సంఘాల సమావేశాలు. ఇక్కడ బలిజ, యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. కూటమి, వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జేబీ శ్రీనివాస్‌తోపాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు అన్ని వర్గాల నేతలను కలుస్తుంటే.. వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ కూడా తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారట.
డివిజన్ల వారీగా స్థానిక నాయకుల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. అయితే కుల సంఘాల సమావేశాల్లో లభించే మద్దతు ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుందన్నదే అసలు లెక్క. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా స్థానిక అభ్యర్థి పనితీరు, పార్టీ విధానాలు, వ్యక్తిగత సంబంధాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అందుకే ప్రతి డివిజన్‌లోనూ ఒకే వ్యూహం పనిచేస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎక్కడ స్థానిక సమస్యలు ప్రభావం చూపిస్తాయి..? ఎక్కడ క్యాస్ట్ కీలకమవుతుంది..? ఎక్కడ అభ్యర్థి వ్యక్తిగత బలం పైచేయి సాధిస్తుంది..? అన్నది క్షేత్రస్థాయి ప్రచారమే నిర్ణయించనుంది.
మేయర్ పీఠంపై కన్నేసిన కూటమికి ఇప్పుడు అంతర్గత అసంతృప్తులు సవాల్‌గా మారుతున్నాయట. టికెట్లు ఆశించి నిరాశ చెందిన జనసేన, బీజేపీ, టీడీపీ సీనియర్ నాయకులు కొందరి డివిజన్లలో కూటమి ఓట్లను చీల్చే ప్రమాదం ఉందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తోందట. అసంతృప్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోలేదన్న చర్చ సాగుతోంది.
దీంతో జేబీ శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి ముఖ్య నాయకులు అసంతృప్తులను సమన్వయం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే మేయర్ అభ్యర్థి ప్రచారం ఒకవైపు సాగుతుంటే.. డివిజన్లలో రెబల్స్ పోటీ మరోవైపు అధికారిక అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక్కో డివిజన్లో స్వల్ప ఓట్ల తేడా కూడా ఫలితాన్ని మార్చగల పరిస్థితుల్లో ఈ అసంతృప్తుల వ్యవహారం కూటమికి కీలకంగా మారింది.
మరోవైపు వైసీపీ కూడా తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల ప్రక్రియలో మరో అవకాశం రావడంతో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 18 డివిజన్లకు అభ్యర్థులను రంగంలోకి దించారు. మేయర్ అభ్యర్థి వాసు యాదవ్‌తో కలిసి నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
స్థానిక సమస్యలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకత్వం తన శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, ప్రతి డివిజన్లో పోటీని కొనసాగించడంపై దృష్టి సారిస్తోంది. అయితే వైసీపీకి కూడా సవాళ్లు లేకపోలేదు. ప్రచారంలో కనిపించే ఉత్సాహాన్ని ఓట్లుగా మార్చుకోవడం, అభ్యర్థుల మధ్య సమన్వయం, స్థానిక నాయకుల బలాన్ని సమర్థంగా వినియోగించుకోవడం కీలకంగా మారనున్నాయి. కూటమి అంతర్గత విభేదాలు తమకు ఎంతవరకు అనుకూలిస్తాయన్నది కూడా వైసీపీ రాజకీయ లెక్కల్లో ఒక ముఖ్యమైన అంశం.
తిరుపతి ఎన్నికల్లో ఇప్పుడు జేబీ శ్రీనివాస్ పాత్ర కీలకంగా మారుతోంది. మేయర్ అభ్యర్థిగా ఆయన ముందున్న సవాల్ ఒక్క మేయర్ స్థానానికి మాత్రమే పరిమితం కాలేదు. కూటమిపార్టీల మధ్య సమన్వయం, అసంతృప్తుల బుజ్జగింపు, కుల సంఘాల మద్దతు, కార్పొరేటర్ అభ్యర్థులతో సమన్వయం.. ఇలా అనేక అంశాలు ఆయన రాజకీయ వ్యూహానికి పరీక్షగా నిలుస్తున్నాయి.
మేయర్ అభ్యర్థి చుట్టూ కూటమి నాయకులంతా ఒక్కతాటిపైకి వస్తే ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అదే సమయంలో డివిజన్ల స్థాయిలో అంతర్గత విభేదాలు కొనసాగితే వాటి ప్రభావం ఫలితాలపై పడే ప్రమాదం ఉంది. అందుకే జేబీ శ్రీనివాస్‌కు ఈ ఎన్నికలు రాజకీయంగా తన సమన్వయ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా మారాయి.
ఇక వైసీపీ మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి నాయకత్వంలో తన శ్రేణులను సమీకరిస్తూ పోటీని ఉత్కంఠభరితంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో తిరుపతిలో పోటీ కేవలం రెండు మేయర్ అభ్యర్థుల మధ్యే కాకుండా.. రెండు పార్టీల రాజకీయ వ్యూహాలు, కేడర్ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం మధ్య జరుగుతున్న సమరంగా మారింది.




