Burning Topic: ఫుట్ బాల్ వరల్డ్ కప్‌కు మాఫియా ముప్పు
Burning Topic: మెక్సికోలో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే డ్రగ్ మాఫియా ముఠాలు సృష్టించిన హింస అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
Burning Topic: ఫుట్ బాల్ వరల్డ్ కప్‌కు మాఫియా ముప్పు
Burning Topic: మెక్సికోలో తాజాగా జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్యూబ్లా స్టేట్ తెహ్‌విట్జింగోలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. హుయిట్జింగో నగరంలోని ఒక నివాస గృహంలో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఒక మైనర్‌తో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక మైనర్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ధృవీకరించింది. సాయుధులైన కొందరు దుండగులు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తుపాకీ శబ్దాలు విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఈ కాల్పుల వెనక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత, ప్యూబ్లా రాజధానిలో ఓ వాహనంపై కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు.
ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన తరుణంలో మెక్సికోలో శాంతిభద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది. జూన్ 11 నుండి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మెక్సికోలోని మెక్సికో సిటీ, మోంటెర్రే, గ్వాడలజారా నగరాల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి సంయంలో మెక్సికో సిటీకి దాదాపు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహుయిట్జింగో నగర జనాభా సుమారు 11,300 కాగా, ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయి హింస జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజా ఘటనలో హంతకుల కోసం నేషనల్ గార్డ్, రాష్ట్ర, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి గాలిస్తున్నాయి.
ఉత్తర అమెరికా ఖండం దక్షిణ భాగంలో ఉండే దేశం మెక్సికో. ఉత్తరాన అమెరికాతో పాటు గ్వాటెమాల, బెలిజ్ దేశాలు, కరీబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. మెక్సికో రాజధాని పేరు మెక్సికో సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటి. మెక్సికో ప్రస్తుతం మాదకద్రవ్యాల ముఠాల హింస, వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ అస్థిరత, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వ్యాపారం కోసం ముఠాలు మధ్య పోరాటం, వీరిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ముఠాల పోరాటం కారణంగా హింస నిత్యకృత్యంగా మారిందిఅనేక ప్రాంతాలలో కిడ్నాప్‌లు, దోపిడీలు, విచక్షణారహిత కాల్పులు సాధారణమయ్యాయి. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం దేశ ఆర్థిక పురోగతికి పెద్ద అవరోధంగా మారాయి. ఈ దేశంతో ప్రభుత్వానికి సమాంతరంగా సాయుధ ముఠాలు పెత్తనం చేస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కార్టెల్, ప్రపంచ దేశాలను వణికించిన మాఫియా డాన్ ఎల్ మెంచో మెక్సికో మిలిటరీ నిర్వహించిన భారీ సీక్రెట్ ఆపరేషన్‌లో హతమయ్యాడు. జలిస్కో స్టేల్, తపాల్పా పట్టణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎల్ మెంచో తల మీద 15 మిలియన్ డాలర్ల రివార్డును గతంలోనే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుని మరణ వార్త తెలియడంతో ఎల్ మెంచో అనుచరులు దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. పలు చోట్ల రహదారులను దిగ్బంధించారు. ఎక్కడికక్కడ వాహనాలను తగలబెట్టారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులను కూడా వదలకుండా నిప్పంటించారు. ఈ హింసత్మక ఘటనల్లో కనీసం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 25 మంది నేషనల్ గార్డ్ బలగాలు, 30 మందికి పైగా కార్టెల్ ముఠా సభ్యులు, ఇతర భద్రతా అధికారులు, ఒక పౌరుడు ఉన్నారు.
ఎల్ మెంచో విషయానికి వస్తే అతనిది మొదటి నుంచీ రక్త చరిత్రే.. తమ డ్రగ్ దందాను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి ధీటుగా ప్రయివేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ మెంచోను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీపడుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..‘‘అన్నింటా మేమే గెలుస్తున్నాం. ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు’ అంటూ సరదాగా పోస్ట్ చేశారు. ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికోకు అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందన్నారు. అయితే ఈ వార్తలను మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. మెక్సికో ప్రత్యేక దళాలు ఈ దాడికి ప్లాన్ చేశాయని.. అమెరికా సమాచారం కొంత సమాచారం మాత్రమే అందించిందని వెల్లడించింది. మెక్సికోలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. స్థానిక ప్రజల్లో భయాందోళనలు పెరిగి అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో మెక్సికోలో శాంతిభద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ భద్రతను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా నేషనల్ గార్డ్స్, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో కలిపి దాదాపు 1,00,000 మంది భద్రత చేపట్టనున్నారు. మెక్సికోలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తమ జాతీయ భద్రత కోసం అవసరమైతే ఏకపక్షంగానైనా చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే దీనిని మెక్సికో సార్వభౌమాధికార ఉల్లంఘనగా పరిగణిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా హెచ్చరించారు. ఇన్సైట్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025లో మెక్సికోలో క్రైమ్ రేటు 19.8 శాతం తగ్గినప్పటికీ, పెరుగుతున్న కిడ్నాప్ కేసులు ఇక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.




