Burning Topic: దేశం విడిచి పారిపోయిన బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్!
Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ఫ్లేవియో బొల్సొనారో అమెరికాకు పారిపోవడం, పాస్‌పోర్టుల రద్దు మరియు లులా ప్రభుత్వంతో రాజకీయ ఉద్రిక్తతలు.
Burning Topic: దేశం విడిచి పారిపోయిన బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్!
Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫ్లేవియో బొల్సొనారో దేశం విడిచి అమెరికా పారిపోయారు. మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కుమారుడైన ఫ్లేవియో తాజా అధ్యక్ష ఎన్నికల్లో లిబరల్ పార్టీ అభ్మర్థిగా పోటీ చేయడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మరోసారి ఘన విజయం సాధించడం తెలిసింది.
ఆయనకు 51.8 శాతం ఓట్లు రాగా ఫ్లేవియో బొల్సొనారోకు 48.2 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాల మధ్య ఆయన కుటుంబంతో సహా బ్రెజిల్‌ను వదిలేసి అమెరికా పారిపోయారు. ఈ చర్యను అధ్యక్షుడు లులా డ సిల్వా తప్పుపట్టారు. ఓటమి అనంతరం విదేశాలకు పారిపోవడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. దేశం నుంచి రహస్యంగా బయటకు వెళ్లి ఏదో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్లేవియో బొల్సొనారో మీద బెట్టింగ్ కంపెనీలు, ఇతర వనరుల ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్‌తో పాటు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణ ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టు దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో ఫ్లేవియో. ఆయన దేశం విడిచి పారిపోయే ప్రమాదముందని భావించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ పాస్‌పోర్టులను అప్పగించాలని ఆదేశించారు.
దీంతో ఎప్పుడైనా అరెస్టు కావచ్చని ఫ్లేవియో ఆందోళనకు గురయ్యారు. తన కుటుంబంతో ప్రైవేటు విమానంలో కలిసి బ్రెజిల్ సరిహద్దు దాటి అర్జెంటీనా మీదుగా అమెరికాకు పారిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్లెవియో తన కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ ఫ్లోరిడాలో ఉన్నట్లు సమాచారం. గడువులోగా పాస్‌పోర్టు అప్పగించకపోవడంతో బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో సహా అన్ని పత్రాలను రద్దు చేశారు.
ఫ్లేవియో బొల్సొనారో, ఆయన కుటుంబం రాజకీయ ఆశ్రయం కోసం అమెరికాను ఆశ్రయించారు. ఇప్పటికే వారి పాస్‌పోర్టులు రద్దయినప్పటికీ అమెరికా విదేశాంగశాఖ వెంటనే వీసాలు మంజూరు చేయడం గమనార్హం.బొల్సొనారో కుటుంబంతో అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్లేవియో బోల్సొనారో అమెరికా పర్యటనకు రావడంపై ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. ఫ్లావియో, ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, వారు ఎంతో మంచి వారని పేర్కొంటూ వారి పర్యటనకు మద్దతు తెలిపారు.
బ్రెజిల్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల సరళిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కడ జరిగిన సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ, బోల్సొనారో కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
బ్రెజిల్లో లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంతో పాటు, అక్కడ నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఫ్లావియో బోల్సొనారో అమెరికా ప్రయాణాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పదవీకాలం ముగిసిన సమయంలో అమెరికాకు పారిపోయారు.
ఆ తర్వాత బ్రెజిల్ తిరిగి వచ్చిన ఆయనకు తిరుగుబాటు కుట్ర కేసులో 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన గృహ నిర్భందంలో ఉన్నారు. ఇప్పుడు జైర్ తనయుడు ఫ్లేవియో కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం బ్రెజిల్ రాజకీయంలోనూ, అమెరికా విదేశాంగ విధానంలోనూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ వ్యవహారంపై బ్రెజిల్ ప్రభుత్వం, అక్కడి న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ఇప్పటికే బ్రెజిల్, అమెరికాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపధ్యంలో తాజా పరిణామాలు మరింత ఆజ్యం పోసినట్లయింది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత ఓడిపోయిన ఫ్లావియో బోల్సోనారో తీవ్ర ఆరోపణలు చేశారు. లూలా డ సిల్వా ప్రచారం రాజకీయ, ఆర్థిక అధికారాలను దుర్వినియోగం చేసిందని, పోటీ న్యాయంగా జరగలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలు అర్థం లేనివని అభివర్ణించారు. ఎన్నికల రోజున సుప్రీంకోర్టు పోలింగ్ సమయాన్ని చివరి నిమిషంలో రెండు గంటల పాటు పొడిగించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనివల్ల "ఆట మధ్యలో నియమాలను మార్చేశారని" ఆరోపించారు.
లూలా విజయాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తూ, ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలు వచ్చిన వెంటనే తన పాస్‌పోర్టులను అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ఖండించారు. తనను భయభ్రాంతులకు గురిచేసేందుకే న్యాయవ్యవస్థను వాడుకుంటూ ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే ఎన్నికల అక్రమాల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు.
కాగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా డిసిల్వా విజయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మింగుడు పడటం లేదు. లాటిన్ అమెరికా ప్రాంతంలో చైనా ప్రభావం పెరగకుండా చూసేందుకు ఆయన బోల్సోనారో కుటుంబానికి మద్దతుగా నిలిచారు. జైర్ బోల్సోనారోను జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ యంత్రాంగం బ్రెజిల్‌పై ఆర్థిక సుంకాలు విధించడానికి కూడా వెనుకాడలేదు. వామపక్ష వర్కర్స్ పార్టీని ఓడించడానికి బోల్సోనారో కుటుంబమే సరైన ప్రత్యామ్నాయమని ట్రంప్ బృందం భావించింది.
లులూ అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అయితే ఎన్నికల ఫలితాన్ని విమర్శించినప్పటికీ, లూలాపై వ్యక్తిగతంగా సానుకూల వ్యాఖ్యలు చేశారు. "నాకు లూలా అంటే ఇష్టం, ఆయనతో నా సంబంధాలు చాలా బాగున్నాయి" అని పేర్కొన్నారు. తాను ఈ ఎన్నికల్లో ఏ పక్షాన నిలబడలేదని మరియు ఎవరికీ అధికారికంగా మద్దతు ఇవ్వలేదని ట్రంప్ స్పష్టం చేశారు
లూలా డా సిల్వా తాజా ఎన్నికల విజయం తర్వాత అమెరికా-బ్రెజిల్ సంబంధాలు రాజకీయ విభేదాలు, వ్యూహాత్మక స్వతంత్రత, ఆర్థిక ప్రయోజనాల సమ్మేళనంగా ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గెలుపు అనంతరం "బ్రెజిల్ ఎవరి దొడ్లోనూ పడి ఉండే దేశం కాదు" అని లూలా స్పష్టం చేయడం రాబోయే కాలంలో అమెరికా పట్ల ఆయన అనుసరించబోయే స్వతంత్ర వైఖరిని సూచిస్తోంది.
బ్రెజిల్ ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను గతంలోనే తీవ్రంగా విమర్శించారు. దీనిపై రెండు దేశాల మధ్య చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఫ్లావియో బోల్సోనారో అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలను ఆశించగా, వామపక్ష నేత లూలా మాత్రం అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా ప్రాంతీయంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. లూలా బ్రెజిల్ స్వతంత్ర విదేశాంగ విధానానికి, చైనా సహా గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో ఫ్లేవియోకు అమెరికా మద్దతుపై చర్చ మొదలైంది.




