Burining Topic: పైలట్‌పైనే కోపైలట్ దాడి.. ఫ్లై దుబాయ్‌లో ఏం జరిగింది? |

Burining Topic: ఫ్లైదుబాయ్ కో-పైలట్ దాడి ఒమన్ జాతీయుడైన నిందితుడు తీవ్రవాద భావజాలంతో విమానాన్ని కూల్చేందుకు యత్నించగా భారతీయ కెప్టెన్ స్మిత్ సాహసంతో ప్రాణాలు కాపాడారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2026 8:56 AM IST
Flydubai
X

Flydubai: ఫ్లై దుబాయ్ ఘటన విమానయాన భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు!

Burining Topic: ఆకాశయాన ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలేనా? ఫ్లై దుబాయ్‌ ఘటనతో మరోసారి అంతర్జాతీయంగా వ్యక్తవుతున్న ఆందోళనలు ఇవి.. 2001 సెప్టెంబర్ 11 నాడు అమెరికాలో నాలుగు విమానాల్ని దారి మళ్లించి కూల్చివేసి, వేలాదిమంది మరణానికి కారణమైన ఉగ్రవాద ఘటన నుంచి ప్రపంచ దేశాలింకా సరైన గుణపాఠం నేర్చుకోలేదని ఈ హైజాక్‌ యత్నం రుజువు చేసింది.

నాటి ఉగ్రదాడి ఘటన తర్వాత కాక్‌పిట్‌ తలుపు తెరుచుకోకుండా విమానాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయటినుంచి తెరిచే ప్రయత్నాన్ని నివారించేందుకు ఈ సాంకేతికత తెచ్చారు. హైజాక్‌ యత్నం, బెదిరింపులు వంటివి క్యాబిన్‌లో మాత్రమే జరుగుతాయనీ, కాక్‌పిట్‌ సురక్షితంగా ఉండేలా చూస్తే సరిపోతుందనీ భావించారు.

పైలెట్‌ లేదా కో పైలెట్‌ కోరుకుంటే తప్ప కాక్‌పిట్‌ తలుపు తెరుచుకోకుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదం క్యాబిన్‌లో కాకుండా, కాక్‌పిట్‌లోనే పొంచివుండటం ఆందోళనకరం. తాజా ఘటనలో దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలోకి అసలు కో పైలెట్‌ మారణాయుధంతో విధులకు ఎలా రాగలిగాడు?

పైలట్ మీద ఎలా దాడి చేయగలిగాడు? భద్రత విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగాయా అనే అనుమానాలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరుగా ఉంది. దాడి చేసేందుకు బయటి నుంచి తెచ్చిన ఎలాంటి ఆయుధం తేలేదని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. దాడికి కత్తి ఉపయోగించలేదని, కాక్‌పిట్‌లో ఉండే క్రాష్‌ యాక్స్‌ను వాడి ఉంటాడని చెబుతున్నారు.

అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం ఈ పరికరాన్ని విమాన తయారీ సమయంలో ఫ్యాక్టరీలోనే అమర్చుతారు. అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఉపయోగిస్తారు. క్రాష్‌ యాక్స్‌ గతంలో క్యాబిన్‌లోనే ఉంచేవారు. కానీ 9/11 ఉగ్రదాడి తర్వాత నుంచి ప్రయాణీకుల నుంచి మప్పును నివారించేందుకు భద్రతా కారణాల దృష్ట్యా కాక్‌పిట్‌లోకి మార్చారు.

ఫ్లై దుబాయ్ విమానంలో దాడికి పాల్పడిన కోపెలట్ విషయంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ అధికారుల ప్రకారం అతడు ఒమన్‌ జాతీయుడు. అతడి పూర్తి పేరును మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఘటన తర్వాత సౌదీ అరేబియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లైదుబాయ్‌ సంస్థలో చేరి ఏడాది కూడా కాలేదని తెలుస్తోంది. ఏ ఉద్దేశంతో దాడి చేశాడన్నది కూడా తెలియరాలేదు. అసలు కారణాలపై దర్యాప్తు జరుగుతున్నందున కో-పైలట్‌ ఉద్దేశం గురించి ముందస్తు ఊహాగానాలు చేయొద్దని ఫ్లైదుబాయ్‌ సంస్థ హెచ్చరించింది. కాగా గతంలో అతనితో పని చేసిన మరో పైలట్ చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు తీవ్రమైన మతాచారాలు పాటించే ఛాందసవాది.

రోజులో అధిక సమయం ప్రార్థనల్లో గడిపేవాడని, మహిళలతో కరచాలనం చేయడానికి కూడా తిరస్కరించేవాడని పేర్కొన్నారు.ఫ్లైదుబాయ్‌ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న దాడి వెనుక ఇరాన్‌ ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమికంగా తనకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశాలున్నాయన్నారు. ఇదే నిజమని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విలేఖరుల ప్రశ్నకు ట్రంప్‌ స్పందిస్తూ.. ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తామని హెచ్చరించారు.

కాగా ఇరాన్ హస్తం ఉందని చెప్పడం తొందర పాటు అవుతుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. అయితే దాడికి పాల్పడిన కోపైలట్‌.. ఉగ్రవాద భావజాలానికి లోనయ్యాడని, అతడు ఆ భావజాలం వైపు మళ్లడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే విషయం మాత్రం తమకు తెలియదన్నారు. కాగా దీని వెనక ఇరాన్‌ హస్తమున్నదని బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ ఆరోపిస్తున్నారు.

కాగా ఈ ఘటన ఇజ్రాయెల్, యూఏఈ మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది. ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేని ఒమన్ దేశ పౌరుడిని ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానం నడిపేందుకు ఎలా అనుమతిస్తారని ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి మిరీ రెగెవ్ ప్రశ్నించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న విమానయాన ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆరోపించారు.

ఉగ్రవాదం నుంచి మానసిక సమస్యల వరకు ప్రస్తుతానికి దేన్నీ కొట్టిపారేయడం లేదని అంటున్నారు. దర్యాప్తులో యూఏఈ, అమెరికా, ఒమన్ కూడా పాలుపంచుకుంటాయని వెల్లడించారు. మరోవైపు విచారణ నిమిత్తం ఆ పైలట్‌ను తమకు అప్పగించాలని సౌదీకి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు యూఏఈ కూడా సొంత దర్యాప్తు ప్రారంభించింది.

ఆ విమానం తమ దేశంలో రిజిస్టర్ అయి ఉందని, అందులో జరిగే నేరాలకు తమ చట్టం వర్తిస్తుందని పేర్కొంది.దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడిలో గాయపడి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణమైన సంకల్ప బలాన్ని ప్రదర్శిండంతో 170 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే విమానయాన చరిత్రలో ఉద్దేశపూర్వక దాడులు, విషాదాలు ఇదే మొదటిసారి కాదు. గతంలో పైలట్లు, సిబ్బంది మానసిక సమస్యలు, వ్యక్తిగత కక్షలు, తీవ్ర నిరాశ నిస్పృహల కారణంగా విమానాలను కూల్చివేసిన భయానక సందర్భాలున్నాయి. అంతర్జాతీయ విమానయాన రంగంలో అత్యంత ఆందోళనకరమైన అంశం.

అత్యంత సురక్షితమైన ప్రయాణ సాధనంగా భావించే విమానాల్లో, పైలట్లే స్వయంగా విమానాలను కూల్చివేడం దారుణం. తీవ్ర భావజాలాలు, కుటుంబ, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక నష్టాలు పైలట్లను తీవ్ర నిరాశలోకి నెట్టవచ్చు. మానసిక సమస్యలు ఉన్నాయని బయటకు చెబితే తమ లైసెన్స్ రద్దవుతుందనే భయంతో చాలామంది పైలట్లు తమ సమస్యలను దాచిపెడతారు.

1994 ఏప్రిల్ 4న అమెరికాలోని ఫెడెక్స్ ఫ్లైట్ 705లో ఆబర్న్ కాలోవే అనే వ్యక్తి సుత్తి లాంటి మారణాయుధాన్ని రహస్యంగా తీసుకువెళ్లి కాక్‌పిట్‌లోకి బలవంతంగా చొరబడ్డాడు. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్, ఫ్లైట్ ఇంజనీర్లపై దాడి చేశాడు. సిబ్బంది ప్రతిఘటన, సాహసం వల్ల ఆ విమానం కూలిపోకుండా తృటిలో తప్పించుకుంది.

ఆబర్న్ కాలోవేను ఉద్యోగం నుంచి తీసేవాలని ఫెడెక్స్ సంస్థ నిర్ణయించడంతో కక్ష పెంచుకున్నాడని దర్యాప్తులో తేలింది. తన కుటుంబం కోసం భారీ బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే దురుద్దేశంతో విమానం ఎక్కాడు. ( FedEx Flight April 4 1994)

2015 మార్చి 24న జర్మన్‌వింగ్స్ ఫ్లైట్ 9525 ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో కుప్పకూలి 150 మంది ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ కాస్త టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో తీవ్రమైన మానసిక కుంగుబాటుతో ఉన్న కో-పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేశాడని దర్యాప్తులో వెలుగు చూసింది.

1997 డిసెంబర్ 19న ఇండోనేషియా నుండి సింగపూర్‌కు బయలుదేరిన సిల్క్‌ఎయిర్ విమానం అనూహ్యంగా కూలి 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తులో తేలిన సమాచారం ప్రకారం, తీవ్రమైన ఆర్థిక నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ విమాన కెప్టెన్ ఉద్దేశపూర్వకంగానే ఫ్లైట్ రికార్డర్లను ఆపేశాడు. కో-పైలట్ కాక్‌పిట్ బయట ఉన్న సమయంలో తలుపులు లాక్ చేసి, విమానాన్ని అతివేగంగా నదిలోకి ముంచేశాడు. ( Silk Air Flight Accident)

1999 అక్టోబర్ 31న న్యూయార్క్ నుండి కైరోకు వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి 217 మంది ప్రాణాలు కోల్పోయారు.కెప్టెన్ విశ్రాంతి కోసం కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లినప్పుడు కో-పైలట్ గమిల్ అల్-బటౌటి ఆటోపైలట్‌ను నిలిపివేసి, విమానాన్ని నిటారుగా సముద్రంలోకి దూసుకుపోయేలా చేశాడు. కెప్టెన్ తిరిగి వచ్చి నువ్వేం చేశావు? అని నిలదీసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్