Off The Record: జీవన్ రెడ్డి దెబ్బ.. రేవంత్ కు బిగ్ షాక్.. పక్కచూపు చూస్తున్నారా?
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు భారీ షాక్. పార్టీలో సరైన గుర్తింపు లేక, తిరిగి గులాబీ గూటికి చేరుతున్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు.
Off The Record: జీవన్ రెడ్డి దెబ్బ.. రేవంత్ కు బిగ్ షాక్.. పక్కచూపు చూస్తున్నారా?
Off The Record: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించి.. పార్టీ ఓడిపోవడంతో అధికార పార్టీలోకి జంపై పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన మాజీలు కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రాథోడ్ బాపూరావు, రేఖా నాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప హస్తం గూటికి వెళ్లారు. కాగా.. కోనేరు కోనప్ప మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకో.. ఆశించిన ప్రాధాన్యత దక్కకో.. కారణం ఏదైనా తిరిగి కారు ఎక్కేశారు. ఇలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన మాజీలంతా ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయులుగా చెలామణి అవుతున్నారట. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఉన్నామంటే ఉన్నామని తప్ప.. ఎక్కడా చురుగ్గా పాల్గొనలేదన్న టాక్ బలంగానే వినిపిస్తోంది.
అయితే.. కాంగ్రెస్ పార్టీలో తమకు తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని, సీనియర్ల అన్న కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఈ వలస నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారట. అధికారపార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని, ఇక తాడోపేడో తేల్చుకోవలాన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ఎజెండాతో వీరంతా ఇటీవలే రహస్యంగా ఒక చోట సమావేశం అయినట్లుగా జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గత జనవరి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. అయితే ఈ నేతలకు సరైన సమాచారం లేకపోవడమే కాదూ.. పార్టీ పెద్దలు కనీసం తమను పట్టించుకోకపోవడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇంతేకాక నామినేటేడ్ పోస్టుల భర్తీలో సైతం ప్రాధాన్యత లేకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరిన మాజీలంతా అంతర్మథనంలో పడ్డారట. వీరిలో ఒకరిద్దరు వెంటనే పార్టీ మారేందుకు సిద్దంగా కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు కొంత కాలం వేచిచూద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఆశించిన ప్రాధాన్యత లేకపోగా.. రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతోందనే టెన్షన్ మొదలైందట. ఈ క్రమంలో పార్టీ మార్పుపై మద్దతుదారులు, సన్నిహితులు ఈ మాజీలపై ఒత్తిడి పెంచుతున్నారన్న టాక్ బలంగా వినపడుతోంది.
ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరిన మాజీమంత్రి జీవన్ రెడ్డి మధ్యవర్తిగా ఈ నేతలతో మంతనాటు సాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు మిగితా నేతలు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్న సంకేతాలు బీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి వస్తున్నాయట. అయితే ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మాత్రం తిరిగి చేర్చుకోబోమని బీఆర్‌ఎస్ హైకమాండ్ తేల్చిచెప్పినట్టు చెబుతున్నారు. ఇలా ఉండగా.. విఠల్ రెడ్డితోపాటు ఈ వలస నాయకులంతా కలిసికట్టుగా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
అదేవిధంగా ముధోల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ప్రభుత్వ ఉదోగ్యాన్ని సైతం వదులుకుని గత అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ పార్టీలో కొనసాగిన భైంసా మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు.. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ముధోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటెల్‌కు రాజేష్ బాబు కుడిభుజంగా పేరుంది. ఈ క్రమంలో ఇటీవల భైంసా మున్సిపల్ పీఠం బీజేపీ దక్కించుకోవడంలో రాజేష్ బాబు కీరోల్ పోషించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజేష్‌కు కూడా మళ్లీ బీఆర్ఎస్‌లోకి రావాలన్న ఆహ్వానం అందినట్టు వార్తలొస్తున్నాయి.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.. త్వరలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. దీంతో కేటీఆర్ పాదయాత్ర ప్రారంభం రోజునే గులాబీ కండువా కప్పుకోవాలన్న ఆతృతతో ఈ వలస నాయకులంతా ఉన్నారట. అదే రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకుని మూకుమ్మడిగా గులాబీ కండవు కప్పుకోవాలని ఈ నాయకులంతా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. దశాబ్దకాలంపాటు బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందన్న వాదన లేకపోలేదు. ద్వితీయ శ్రేణి నాయకులతో పార్టీ కార్యక్రమాలు వెళ్లదీస్తున్నారట. ఈ క్రమంలో కారు పార్టీ అధినేతలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన మాజీలంతా.. తిరిగి సొంత గూటికి రాబోతున్నారన్న మాట. ఈ వార్తలు ఎంత వరకు నిజమో త్వరలో తేలిపోనుంది.




