Off The Record: విజయనగరం తమ్ముళ్ల లో అసంతృప్తి..! అధ్యక్ష పదవిపై వివాదం..!

Off The Record: విజయనగరం టీడీపీ నగర అధ్యక్ష పదవిలో తక్కువ కాలంలోనే ముగ్గురు మారడం వెనుక కారణాలపై పార్టీలో జోరుగా చర్చ. ఆ మార్పుల వెనుక అసలు రాజకీయ సమీకరణలేంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Oct 2026 7:44 AM IST
Off The Record
X

Off The Record: విజయనగరం తమ్ముళ్ల లో అసంతృప్తి..! అధ్యక్ష పదవిపై వివాదం..! 

Off The Record: విజయనగరం టీడీపీలో కొత్త సంస్కృతి కనిపిస్తోంది. నగర పార్టీ అధ్యక్ష పదవి.. ఏడాదికో కొత్త నేతకు అప్పగించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నగర పార్టీ పగ్గాలు వరుసగా మారుతూ వస్తున్నాయి. గంటా రవికి బాధ్యతలు అప్పగించడంతో.. ఈ మార్పులపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

విజయనగరం నగర టీడీపీలో అధ్యక్ష పదవి మార్పులు ఆసక్తికర రాజకీయ పరిణామాల కు వేదికగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నగర పార్టీకి వరుసగా ముగ్గురు అధ్యక్షులు మారారు. దీంతో పార్టీ కేడర్‌లో పదవి మార్పులపై చర్చ జరుగుతోంది. తొలుత కర్రోతు నరసింగరావుకు నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

పదవి చేపట్టిన సమయంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ.. తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను సమన్వయం చేస్తూ నగరంలో పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నరసింగరావు స్థానంలో ప్రసాదుల ప్రసాద్‌కు నగర పార్టీ పగ్గాలు అప్పగించారు.

అయితే ఆయన పదవీకాలం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా ప్రసాద్‌ను తప్పించి గంటా రవికి బాధ్యతలు అప్పగించడం.. మరోసారి చర్చకు దారితీసింది. ఒకే నగర పార్టీ అధ్యక్ష పదవికి వరుసగా మార్పులు రావడంతో.. కేడర్‌లో కొంత అనిశ్చితి ఏర్పడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పార్టీ కార్యక్రమాలకు బాధ్యత తీసుకునే నాయకుడికి.. పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఎంతకాలం ఉంటుందన్న చర్చ కూడా పార్టీలోత జరుగుతోంది. మరోవైపు విజయనగరం టీడీపీలో కొంతకాలంగా వినిపిస్తున్న బంగ్లా పాలిటిక్స్ అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. పార్టీ నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నవారికే కీలక బాధ్యతలు దక్కుతున్నాయనే అభిప్రాయాలు కొందరు నాయకులు, కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

అయితే ఇది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం మాత్రమేనట. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. అదే సమయంలో.. పార్టీ కార్యక్రమాల ఖర్చులను భరించే సామర్థ్యం ఉన్నవారికే బాధ్యతలు‌ దక్కుతున్నాయనే మరో టాక్ కూడా స్థానికంగా వినిపిస్తోంది. పార్టీ పదవి అంటే కేవలం హోదా కాకుండా.. కార్యక్రమాల నిర్వహణ, కేడర్‌ను సమన్వయం చేయడం, ఆర్థిక భారం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయనే చర్చ సాగుతోంది.

గంటా రవికి నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వెనుక‌ ఇదే బలమైన‌ కారణంగా చెప్పుకుంటున్నారు. అధ్యక్షుడి నాయకత్వంలో నగర టీడీపీ కార్యకలాపాలు అంతంత మాత్రమే. స్థానిక ఎన్నిక నేపథ్యంలో ఏ మేరకు ఊపందుకుందోనన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అయితే గంటా రవిని కూడా మార్చే అవకాశం లేకపోలేదన్నది పార్టీ వర్గలలో వినిపిస్తున్న టాక్.

ఇప్పటికే రవిపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. కానీ బంగ్లా అండతో ఏదో నెట్టుకొస్తున్నారన్న వాయిస్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే నగర పార్టీ అధ్యక్షుడిగా ముగ్గురు నేతలు మారడం.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆసక్తిని, సస్పెన్స్‌ను సైతం పెంచుతోంది.

ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించిన కొద్ది కాలానికే మరో నేతకు పగ్గాలు ఇవ్వడం.. కేడర్‌కు స్థిరత్వం లేకుండా చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షులు మారడం మాత్రమే కాదు.. ప్రతి మార్పు వెనుక పార్టీ అవసరాలు, నాయకత్వ నిర్ణయాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. అయితే వరుస మార్పులతో కేడర్‌లో ఏర్పడుతున్న అనిశ్చితి మాత్రం పెరుగుతుందనే రాజికీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్