Jordar News: అటు విజయ్.. ఇటు మోడీ
Jordar News: తమిళనాడు రాజకీయాల్లో తలపతి విజయ్ సృష్టించిన సంచలనం మరియు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రక విజయంపై ప్రత్యేక కథనం.
Jordar News: అటు విజయ్.. ఇటు మోడీ
Jordar News: ఎన్నికలకు ముందుగాల తలపతి విజయ్ జేశ్న ఈల సప్పుడు ఓటర్ల శెవ్వులల్ల ఇంక గుడ గుయ్యిమని అంటనే ఉన్నది. అట్లన్నది మరి విజయ్ ఇచ్చిన సౌండ్. కింగ్ మేకర్ అయితడు గావచ్చని అనుకుంటే కింగే అయ్యిండిప్పుడు. 234 నియోజకవర్గాల్ల నేనే పోటీజేస్తున్న, నామొఖాన్ని సూశి ఓటెయ్యుర్రన్న విజయ్ ఇచ్చిన పిలుపునకు తమిళతంబీలు పట్టం కట్టిర్రు. ఇగ రొండు జాగల్ల పోటీ జేశ్న విజయ్... రొండు జాగల్ల గుడ భారీ మెజార్టీతోని గెల్శిండు. ఇగ విజయ్ రాజీనామా జేశే స్థానం నుంచి సినీనటి త్రిష పోటీజేశి గెల్శి డిప్యూటీ సీఎం అయితదన్న పుకార్లు గుడ బగ్గనే బైలెల్లినయి. ఇగ విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ కు టిక్కెట్ ఇస్తే విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ జేశి డీఎంకే అభ్యర్థి మీద గెల్శిండు. మొత్తానికైతే., దక్షిణాధిల ఎన్టీఆర్ తర్వాత అంతటి అఖండమైన విజయం దక్కిచ్చుకున్నడు తలపతి విజయ్. 2024 ఫిబ్రవరి నెలల పార్టీ వెట్టిన విజయ్... తలపండిన రాజకీయ ఉద్దండులు, ఎన్నో ఏండ్ల సంది పాతుకుపోయిన పార్టీలను ఓడగొట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూసోవోతున్నడు. దీంతోని ఇప్పుడు విజయ్ అభిమానులు సంబురాల్ల మునిగిపోయిర్రు. అటు మల్లోపారి అధికారంలకు వస్తమని అనుకున్న డీఎంకే ప్రతిపక్షపాత్రకు పరిమితమవ్వుడేగాదు., టీవీకే అభ్యర్థి శేతిల ఓడిపొయ్యేటాళ్లకు డీలావడ్డ డీఎంకే కార్యకర్తలు.. పార్టీ ఆఫీసు ముంగటేశ్న టెంట్లు గుడ పీకేశిర్రు.
ఇగటు పచ్చింబెంగాల్ల ఈపారి ఎట్లన్నజేశి గెల్వాల్నని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పకడ్బందీగ వ్యూహాలు జేస్తే., అక్కడి పువ్వు పార్టీ కార్యకర్తలు కసితోని పన్జేశి తృణముల్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిర్రు. డబుల్ సెంచరీ సీట్లతోని బంపర్ విక్టరీ కొట్టి వర్సగ మూడు సార్లు ముఖ్యమంత్రిగ పన్జేశ్న దీదీని ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుంట జేసుట్ల కాషాయదళం సక్సెస్ అయ్యింది. ఇగటు పనిహతి నియోజకవర్గంల నుంచి బీజేపీ అభ్యర్థిగ పోటీజేశ్న ఆర్జీకర్ హాస్పటల్ బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ గెల్శింది. మొత్తానికైతే., మొదటిపారి జెండా పాతాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరినయి. ఇగ పచ్చింబెంగాల్ను దశాబ్దాల పాటు ఏలిన కామ్రెడ్లు ఈ ఎన్నికల్ల గుడ అడ్రస్ లేకుంట పోయిర్రు.
కేరళంల కాంగ్రెస్ నేతృత్వంల యూడీఎఫ్ కూటమి గుడ భారీ విక్టర్ కొట్టేటాళ్లకు అక్కడి లీడర్లు సంబురాలు జేస్కున్నరు. ఇగిటు రాష్ట్రంలున్న శేతి పార్టీ లీడర్లు గుడ కేరళం విజయం ఖరారు అవ్వుడుతోనే సంబురాలు జేస్కున్నరు. పినరయ్ విజయన్ మల్లోపారి ముఖ్యమంత్రి అయితడు, దేశంల ఒక్కగానొక్క కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉంటదనుకున్న ఎర్రజెండా పార్టీల మద్దతుదారుల ఆశలు అడియాశలే అయినయి.
ఇగ మొదాటి సంది అందరు అనుకున్నట్టుగనే., అస్సాం, పుదుచ్చేరిల పాత ప్రభుత్వాలకే మల్లోపారి పట్టంకట్టిర్రు అక్కడి పబ్లిక్కు. ఇగ జాతీయ కూటమిల లెక్కల జూస్తే., ఇండియా కూటమికి పెద్దమద్దతుదారులైన మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్ ప్రభుత్వాలు పడిపోయి ప్రతిపక్ష పాత్రకు పరిమిత అయితే., ఎన్డీయే కూటమి ఖాతాల చేరింది పచ్చింబెంగాల్ రాష్ట్రం. మరిగ తమిళనాడుల ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతున్న విజయ్ ఏ కూటమికి మద్దతు చేస్తడో సూడాలెగనీ., ఈ ఎన్నికలతోని ఎన్డీఏ బలం మాత్రం ఇంకింతెక్కోనే పెరిగింది పోండ్రి.




