Burning Topic: జాతీయ పార్టీల ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేవా?

Burning Topic: భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడిందా? అస్సాం గణ పరిషత్ మరియు గూర్ఖాలాండ్ ఉద్యమాలు ఎందుకు బలహీనపడ్డాయి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 May 2026 6:57 AM IST
Burning Topic
X

Burning Topic: జాతీయ పార్టీల ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేవా?

Burning Topic: అస్సాం రాజకీయాల్లో ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రాంతీయ చైతన్యం అస్సాం గణ పరిషత్- AGP. ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ. కానీ ఇప్పుడా పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది అస్సాంలోకి అక్రమంగా వలస వచ్చారు. స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ, సామాజిక సమతౌల్యం దెబ్బతింది. వీరికి వ్యతిరేకంగా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 1985లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి.

ఈ ఉద్యమ ఫలితంగా విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్‌గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో 96 మంది విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. దీంతో అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. కేవలం 32 ఏళ్ల చిన్న వయసులో ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం సంచలనం సృష్టించింది. సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులు అయ్యారు. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ ఆవిర్భవించిందో ఆ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపలేకపోయింది.

అస్సాం గణ పరిషత్ పార్టీని అంతర్గత కుమ్ములాటలు,అవినీతి ఆరోపణలు బలహీనపరిచాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటంతో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పోయింది. ఏజీపీలో మొదటి నుండి సమిష్టి నాయకత్వం లోపించింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది.ఏజీపీలోని చాలా మంది నాయకులు తమ భవిష్యత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఏజీపీ పతనానికి మరో ప్రధాన కారణం సరైన వ్యూహం లేకుండా జాతీయ పార్టీలతో సావాసం చేయడం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది.

అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం కూడా ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగ పూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ దాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. అస్సాంలో ఏజీపీ ఇవాళ బీజేపీకి ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది.

ఇక గూర్ఖాలాండ్ ఉద్యమం అనేది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలలో నివసిస్తున్న నేపాలీ మాట్లాడే గూర్ఖా ప్రజల ఉద్యమం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాఠశాలల్లో బెంగాలీ భాషను తప్పనిసరి చేయడం వంటి అంశాలు వారిలో అభద్రతా భావాన్ని పెంచాయి. జాతి, భాష, సంస్కృతి గుర్తింపును కాపాడుకోవడంతో పాటు తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదనే అసంతృప్తి ఉద్యమానికి కారణమయ్యాయి. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. 1907 డార్జిలింగ్‌కు ప్రత్యేక పరిపాలనా హోదా కావాలని బ్రిటిష్ ప్రభుత్వానికి మొమోరాండం సమర్పించడంతో ఈ డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత 1980లో సుభాష్ ఘీసింగ్ నేతృత్వంలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ GNLF ఏర్పడి ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున పోరాటం మొదలైంది. ఈ ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. 1988లో త్రిపాక్షిక ఒప్పందం ద్వారా డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ DGHC ఏర్పాటయింది.

కొండ ప్రాంతాలకు పాక్షిక స్వయంప్రతిపత్తి లభించినప్పటికీ, శాశ్వత రాజకీయ పరిష్కారం ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. దీంతో బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలో ఏర్పాటైన గూర్ఖా జన్‌ముక్తి మోర్చా GJM ఉద్యమం కొనసాగింది. అయినా గూర్ఖాలాండ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా దక్కలేదు. 2009లో బీజేపీ డార్జిలింగ్ ప్రాంత సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత జీజేఎం, జీఎన్‌ఎల్‌ఎఫ్‌తో కలిసి డార్జీలింగ్‌ లోక్‌సభ సీటును గెలుచుకోగలిగింది.బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలోని జీజేఎం.. డార్జీలింగ్‌ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతిస్తోంది. ప్రతిగా గతంలో గూర్ఖాలాండ్‌ ఉద్యమంలో పాల్గొన్న నేతలతోపాటు స్థానికంగా బలమున్న వారికి బీజేపీ టికెట్లు ఇచ్చింది.కాగా2017లో జరిగిన 100 రోజుల ఆందోళన కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. పర్యాటకరంగం కుప్పకూలింది.టీ తోటలు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

దశాబ్దాలపాటు ఉత్తర బెంగాల్‌లోని డార్జీలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్‌ జిల్లాల్లో గూర్ఖాలాండ్‌ డిమాండ్ ఒక భావోద్వేగంగా ఉండేది. ఆ తర్వాత గూర్ఖాలాండ్‌ ఉద్యమం కనుమరుగు కావడమే కాదు.. ముక్కలైంది. బిమల్‌ గురుంగ్‌ ప్రాభవం కోల్పోయారు. జీఎన్‌ఎల్‌ఎఫ్‌ ప్రతిష్ఠ మసకబారింది. ఈ సమయంలో రంగంలోకి వచ్చిన అనిత్‌ థాపా బీజీపీఎం బలం పుంజుకుంది. అధికార తృణమూల్‌తో కలిసి అభివృద్ధితోపాటు గౌరవం పేరుతో ప్రజల్లో ప్రాబల్యం పెంచుకుంది. తాజా ఎన్నికల్లో గూర్ఖాలాండ్ డిమాండ్ పెద్దగా వినిపించలేదు. ఈసారి ఎన్నికల్లో ఓట్ల తొలగింపు ప్రధానాంశంగా మారింది. ఒక్క డార్జీలింగ్‌ జిల్లాలోనే 1.22 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన మెజారిటీల కంటే అధికంగా తొలగించారు. ఈ తొలగింపు గూర్ఖాలాండ్‌ ప్రాంతంలో ఎన్నికల లెక్కలను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఉద్యమంకన్నా అభివృద్దే ఎజెండాగా మారింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story