Off The Record: కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు ?
Off The Record: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం లభించనుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Off The Record: కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు ?
Off The Record: బీజేపీ సాధారణ కార్యకర్తగా మొదలై... యువమోర్చా జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా... అక్కడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా... ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆ నాయకుడు ఎవరో కాదు. ప్రస్తుత కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి.
అంబర్‌పేట రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల దాకా సాగిన ఆయన ప్రస్థానం.. బీజేపీలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఉదాహరణగా నిలిచింది. అంటే.. ఒకప్పుడు పార్టీ ఆఫీస్‌లో పోస్టర్లు అంటించిన స్థాయి నుంచి.. ఇప్పుడు దేశంలోని కీలక శాఖలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారన్నమాట.
అదే అనుభవం.. ఢిల్లీలో మరోసారి చర్చకు వస్తోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కేంద్ర మంత్రిగా ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ పెడుతున్నారు కిషన్ రెడ్డి.
ఇలాంటి సమయంలోనే బీజేపీ జాతీయ స్థాయి వ్యవస్థలో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు మొదలయ్యాయట. అసలు అధిష్టానం వేసే అడుగులు ఏంటన్న ఉత్కంఠ తీవ్రస్థాయిలో నెలకొన్నదట. ఇటీవల జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత లేకపోవడంతో పెద్ద ఎత్తున దుమారమే రేగింది.
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 7గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలతో బలమైన కేడర్ ఉంది. దీంతో బీజేపీ బలం పెరుగుతున్న వేళ.. జాతీయ స్థాయిలో మరింత ప్రాతినిధ్యం వస్తుందని చాలామంది ఆశించారు. కానీ లెక్క తారుమారైంది.
జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లేకపోవడంతో లోలోపలే అసంతృప్తితో నేతలు అప్పట్లో మదనపడ్డారట.. ఇదే సమయంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కడం.. తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీసిందట.
పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలు, విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ కమిటీల జాయింట్ కోఆర్డినేటర్‌గా కీలక సంస్థాగత బాధ్యతలు దక్కడం, అక్కడ పదవుల పండుగ కనిపిస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎదురుచూపులేనా..? అన్న అసహనం వ్యక్తమైందట.
ఈ నేపథ్యంలో మరో వాదన తెరపైకి వస్తోందట. ఒక పదవి రాకపోవడం అంటే పూర్తిగా పక్కన పెట్టినట్టు కాదని రాజకీయ విశ్లేషకుల మాట. కొన్నిసార్లు ఇంకో పెద్ద పదవికి గేమ్ ప్లాన్ కూడా కావొచ్చంటున్నారు. జాతీయ కార్యవర్గంలో చోటు ఇవ్వలేదు. అయితే పార్లమెంటరీ బోర్డులో చోటు ఇవ్వబోతున్నారా..? అన్న ఊహాగానాలు అటు ఢిల్లీ వర్గాల్లో, ఇటు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అంటే సాదాసీదా మామూలు పదవి కాదట. పార్టీకి సంబంధించిన కీలక రాజకీయ నిర్ణయాల్లో ఈ బోర్డుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందట. పార్లమెంటరీ బోర్డు అంటే బీజేపీలో అత్యున్నత నిర్ణాయాత్మక బోర్డు. దీనికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ప్రస్తుతం 12మందితో ఈ బోర్డు నడుస్తోంది.. ప్రధానంగా ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి కీలక నేతలు ఉండే బోర్డు.. ముఖ్యంగా బోర్డులో ఎన్నికల వ్యూహాలు, ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు, సీఎంల ఎంపిక, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక.. ఇలా అత్యంత కీలకమైన అంశాల్లో ఈ బోర్డు కీలకమని చెబుతున్నారు.
దీంతో ఈ నెలలో ఏ క్షణమైనా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, గవర్నర్ల నియామకాలతోపాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
పార్లమెంటరీ బోర్డులో మార్పులు, చేర్పులు జరిగితే కేంద్ర మంత్రి పదవితోపాటు కిషన్ రెడ్డికి అదనంగా పార్లమెంటరీ బోర్డు మెంబర్ పదవి దక్కే ఛాన్స్ ఉందంటూ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు, రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయట.
ఇక్కడ మరో అంశం తెరమీదకు వస్తోందట. ఇప్పటికే తెలంగాణ నుంచి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్నారు. కానీ త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో ఒకరికి బెర్త్ ఖాయమన్న వార్తలు రీసౌండ్ చేస్తున్నాయి.
ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డాక్టర్ లక్ష్మణ్‌కు మంత్రి పదవి లేదంటే పలు రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జిగా పంపిస్తారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డులో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి చోటు దక్కితే..?
అది కేవలం కిషన్ రెడ్డికి ప్రమోషన్ మాత్రమే కాదు.. తెలంగాణ బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో మరో బలమైన గొంతుక దొరికినట్టేనన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఇప్పటికే దూకుడు పెంచింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచి రైతు సమస్యల వరకు... భూముల వ్యవహారాల నుంచి ప్రభుత్వ విధానాల వరకు... ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ జాతీయ నిర్ణయాత్మక వేదికలో తెలంగాణకు బలమైన స్వరం ఉంటే.. రాష్ట్ర రాజకీయాలకు అదనపు బలం వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
అదీ కాకుండా దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు తెలంగాణ కీలక రాష్ట్రం. కర్ణాటక తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచాలంటే అనుభవం ఉన్న స్థానిక నాయకత్వం అవసరం. దీంతో తెలంగాణపై పార్టీ హైకమాండ్ మరింత ఫోకస్ పెంచబోతోందట.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీకి ఢిల్లీ నుంచి మరింత బలమైన కమాండ్‌గా తయారు చేయాలనుకుంటోందట. మొత్తానికి...రాబోయే అసెంబ్లీ సమరానికి ఇప్పటి నుంచే బీజేపీ అధిష్టానం పెద్దలు పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది.
కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవితోపాటు అత్యున్నత నిర్ణాయాత్మక బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి ఎంట్రీ ఇస్తే.. తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు. బీజేపీ పెద్దల వ్యూహాత్మక అడుగులు ఏమేరు ఫలితాలిస్తాయో చూడాలి మరి.




