Big Story: G20 వేదికగా జయశంకర్ పవర్ ఫుల్ స్పీచ్!
Big Story: అట్లాంటాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ ఇంధన సరఫరాలో అంతరాయాలు, సైనిక చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Big Story: G20 వేదికగా జయశంకర్ పవర్ ఫుల్ స్పీచ్!
Big Story: ప్రపంచ ఇంధన సరఫరాలో ఆంక్షలు, రవాణా మార్గాల్లో అడ్డంకుల ద్వారా అంతరాయాలు సృష్టించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చమురు, ఇంధన వాణిజ్యం, మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడులు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇదంతా ధరలను తమ అదుపులో ఉంచుకునేందుకు కొన్ని దేశాలు అనుసరిస్తున్న వ్యూహమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు.
అలాగే అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో సైనిక చర్యల కంటే దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సైనిక పరిష్కారాలు పనిచేయవని, దౌత్యానికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో అనేక దేశాల మధ్య విభేదాలు తలెత్తడం చివరకు యుద్ధాల వరకు ఈ విభేదాల దారితీయడాన్ని జైశంకర్ ప్రస్తావించారు. ఈ అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో సైనిక చర్యలకు ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయన్నారు. అయితే సైనిక చర్యలు...సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేవని ఆయన వెల్లడించారు. కేవలం దౌత్యపరమైన చర్చలు మాత్రమే వివిధ దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్బంగా సముద్రయాన సిబ్బందిపై ఇటీవల పెరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. సముద్రమార్గాల్లో రవాణాకు సంబంధించి అంతర్జాతీయ సముద్ర చట్టం ఉందన్న విషయం ముందుగా అన్ని దేశాలూ తెలుసుకోవాలన్నారు. అంతర్జాతీయ సముద్ర చట్టం పరిధిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని జై శంకర్ కోరారు. ఇందులో భాగంగా నౌకలు, నావికులపై దాడులు నిలిపివేయాలని కోరారు.
అంతేకాదు.... పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ఇంధనం, ఆహారం, ఎరువుల సరఫరా, ధరలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఈ పరిణామాల భారాన్ని గ్లోబల్ సౌత్ దేశాలు అధికంగా భరిస్తున్నాయని జైశంకర్ పేర్కొన్నారు.
మార్కెట్లలోకి ఉత్పత్తులను అధికంగా మళ్లించడం, సరఫరా గొలుసులను ఆయుధాలుగా ఉపయోగించడం, మార్కెట్ ప్రవేశాన్ని అడ్డుకోవడం వంటి చర్యలతో కొన్ని దేశాల పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటున్నాయని జై శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు, బలమైన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద ముప్పును కూడా వ్యూహాత్మక లెక్కల పేరుతో విస్మరించకూడదని ప్రపంచ దేశాలను జై శంకర్ హెచ్చరించారు.
అట్లాంటాలో జీ20 సమావేశం సందర్భంగా పలువురు దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ఆయన సమావేశమయ్యారు.ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య సహకారం క్రమంగా పెరుగుతున్న తీరుపై వారు సమీక్షించారు. అలాగే అర్జెంటీనా విదేశాంగ మంత్రి పాబ్లో క్విర్నోతో కూడా జైశంకర్ సమావేశమయ్యారు.
ఇందులో వాణిజ్యం, కీలక ఖనిజాలు, రక్షణ, అణు సహకారం, బహుళపక్ష అంశాల చర్చకు వచ్చాయి. అలాగే మెక్సికో విదేశాంగ మంత్రి రాబర్టో వెలాస్కో అల్వారెజ్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై జైశంకర్ మాట్లాడారు. అంతకాదు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియెరాతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ పరిణామాలను ఆయన చర్చించారు.




