OFF THE RECORD: తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ టెన్షన్!

OFF THE RECORD: తెలంగాణలో ఎల్ నినో ఎఫెక్ట్, సాగు-తాగునీటి కష్టాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 8 నెలలు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 10:57 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ టెన్షన్!

OFF THE RECORD: ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి వేళ.. తెలంగాణ ఎన్నికలపై చర్చోపచర్చలు రీసౌండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం సర్పంచ్, కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి పలు మున్సిపాలిటీలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు.

ఇంతలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో.. ఈ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త ఓటరు జాబితా వచ్చాక ఎన్నికలు నిర్వహించాలని భావించింది. నవంబర్ 9న కొత్త ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కానీ కొత్త ఓటరు జాబితా వచ్చాక కూడా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదట. ఎన్నికలను వచ్చే ఏడాది జూన్ తర్వాత నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట.

గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 8 నెలలు వాయిదా వేయాలనే ఆలోచనకు సర్కారు పెద్దలు వచ్చారట. ప్రస్తుతం తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వానాకాలం సీజన్లో 23 శాతం లోటు వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మునుముందు ఎండాకాలంలో తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. విద్యుత్ కోతలు.. తాగు, సాగునీటి కష్టాలతో ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ ఎఫెక్ట్.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పడుతోంది. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని.. పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ పలు చోట్ల మంత్రుల పర్యటనలకు నిరసన సెగలు తగులుతున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 9న తుది ఓటరు జాబితా వచ్చాక ఎన్నికల ప్రక్రియ చేపడితే తీవ్ర భంగపాటు తప్పదనే ఆలోచనలో ఉన్నారట.

వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్‌ను అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చేశారు. వీటికి వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని నేతలకు మొదట్లో ఇండికేషన్ ఇచ్చారు. అలాగే సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు.

కానీ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందట. విద్యుత్ కోతలతో పాటు వర్షాలు సరిగా లేక గ్రౌండ్ వాటర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో వానాకాలం సీజన్ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రభుత్వ అంచనాల ప్రకారం 10 లక్షల ఎకరాలకు పైగా ఒక్క వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగంతో ఉన్న గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే.. పుట్టి మునిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అలాగే తెలంగాణకు గుండెకాయలాంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కానీ ఇప్పటికే తాగునీటి ఎఫెక్ట్ కనిపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామే అన్నట్లుగా భావిస్తున్నారట. అందుకే ఈ ఎన్నికలన్నింటిని దాదాపు ఎనిమిది నెలలు అంటే వచ్చే ఏడాది జూన్ వరకు వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.

సో.. మొత్తం మీద ఎల్ నినో ఎఫెక్ట్ తెలంగాణ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్ ప్రక్రియ తర్వాత నిర్వహిద్దామనుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను.. ఇక ఇప్పట్లో నిర్వహించొద్దని భావిస్తున్నారట. చూడాలి ఈ ఎన్నికలపై తుది ఓటరు జాబితా వచ్చాక సర్కారు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్