Off The Record: గ్రేటర్ లో గెలిస్తే రాష్ట్రం మనదే?

Off The Record: గ్రేటర్ హైదరాబాద్ (GHMC) మూడు కార్పొరేషన్లుగా విభజన అయిన వేళ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 May 2026 7:24 AM IST
Off The Record
X

Off The Record: గ్రేటర్ లో గెలిస్తే రాష్ట్రం మనదే?

Off The Record: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాటల్లోనే కాదూ చేతల్లోనూ కేటీఆర్ దూకుడు మీద ఉన్నారట. అందులోభాగంగానే పార్టీ కేడర్‌ను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేస్తున్నారట. ఎన్నికలకు ముందుగానే ప్రజలతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించే బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. అంతేకాక.. అధికార పక్షంపై సవాళ్ల పర్వానికి దిగుతూ గులాబీ దళాన్ని ఉత్సాహపరుస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లుగా విభజన చేశారు. ఈ పరిణామాలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. అత్యంత కీలకంగా చూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని మళ్లీ ఓట్లుగా మార్చుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి వంటి కీలక పట్టణ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, గత ఎన్నికల్లో బలహీనంగా ఉన్న డివిజన్ల గుర్తింపు, కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలను ఎదుర్కొనే ప్రచార కార్యాచరణపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని టాక్.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు మళ్లీ ఉత్సాహాన్ని ఇచ్చాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా బీఆర్ఎస్‌కే బలమైన మద్దతు ఉందని కారు పార్టీ కేడర్ బలంగా నమ్ముతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గణనీయ విజయాలు సాధించిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని కేటీఆర్ పార్టీ నేతలకు, కేడర్‌కు చెబుతూ వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ విభజనను రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించారని, ప్రజాభిప్రాయం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక కేటీఆర్ తన సమావేశాల్లో కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. హైద్రాబాద్ నగరంలో వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడే చెప్పేస్తున్నారు. హైదరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయాలి అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఈ క్రమంలోనే సనత్‌నగర్, ఎల్బీనగర్, అంబర్‌పేట్, కూకట్‌పల్లి నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు.

బీఆర్‌ఎస్ నాయకులు అంతర్గతంగా కూడా గ్రేటర్ ఎన్నికలను 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌‌గా భావిస్తున్నారు. హైదరాబాద్‌లో గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా మళ్లీ బలపడతామనే అంచనాలో బీఆర్ఎస్ ఉంది. అందుకే నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల సమీకరణలు, ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి, యువ ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెంచుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి, పరిపాలన వైఫల్యాలు, చట్టవ్యవస్థ సమస్యలు, పెట్టుబడుల తగ్గుదల వంటి అంశాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని కేటీఆర్ నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను నిర్ణయించే పోరాటంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, పట్టణ ఓటర్ల తీర్పు ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరం బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో పాగా వేయాలని భావిస్తోందట గులాబీ పార్టీ అధినాయకత్వం. ట్రై కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పార్టీ నేతల వ్యూహరచన.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story