Burning Topic: ట్రంప్‌కు నోబుల్ శాంతి బహుమతి వస్తుందా!
Burning Topic: 2026 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేడు వెలువడనున్న నేపథ్యంలో ట్రంప్ ఆశలు, పోటీలో ఉన్న ప్రముఖులు మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) વિશે ప్రత్యేక కథనం.
Burning Topic: ట్రంప్‌కు నోబుల్ శాంతి బహుమతి వస్తుందా!
Burning Topic: డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ శాంతి బహుమతి మీద ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. కొంతమంది దీనిని పిచ్చి కూడా అంటారు. నోబెల్ శాంతి బహుమతి పై ఉన్న ఆసక్తిని ఆయన మరోసారి బయటపెట్టుకున్నారు. నోబెల్ శాంతి బహుమతికి తాను అన్నివిధాల అర్హుడినేనంటూ తనకు తాను ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నారు. ఎప్పటిలాగా మరో సారి స్వంత డబ్బా కొట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది యుద్దాలు ఆపానని పాత ముచ్చటే మరోసారి ఆయన వెల్లడించారు.
అంతేకాదు ఎనిమిది యుద్ధాలు ఆపిన చరిత్ర ఏ దేశాధ్యక్షుడిని లేదని ట్రంప్ చెప్పుకున్నారు. కాగా తన ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ...నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందన్న నమ్మకం లేదన్నారు. తనలాంటి అన్నివిధాల అర్హుడికి బహుమతి ఇవ్వకపోవడం నోబెల్ కమిటీకి అలవాటుగా మారిందని ట్రంప్ మహాశయుడు తన ఆక్రోశం వెళ్లబుచ్చాడు.
నోబెల్ శాంతి బహుమతిని ప్రతి ఏడాది నార్వేజియన్ కమిటీ ప్రదానం చేస్తుంది. 2026 ఏడాదికిగాను అక్టోబరు తొమ్మిదిన విజేత పేరు ప్రకటిస్తారు. కాగా 2025 లో కూడా నోబెల్ శాంతి బహుమతి పై ట్రంప్ అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన ఆశలు ఆవిరి అయ్యాయి. వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోడాకు దక్కింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ఆవేదనతో ఆయన అనేకసార్లు వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక దశలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని నోబెల్ కమిటీపై తన అక్కసు వెళ్లగక్కారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక...అనేక దేశాలతో కత్తి కట్టినట్లు ప్రవర్తించారు. అనేక దేశాలపై భీకరంగా సుంకాలు విధించారు. భారత్ వంటి సన్నిహిత దేశానికి కూడా ట్రంప్ మినహాయింపు ఇవ్వలేదు. 2025లో ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలలోకి అకస్మాత్తుగా డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు ఎంట్రీ ఇచ్చారు. అది చాలదన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరుగా ఇరాన్ పై దాడులు ప్రారంభించాడు.ఇప్పటికీ ఇరాన్ పై అమెరికా దాడులకు ఎండ్ కార్డ్ పడలేదు.
ఈ సంగతి ఎలాగున్నా..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి పోటీదారుగా చర్చకు వస్తున్నారు. ఈ అవార్డు తనకు రావాలని ట్రంప్ గతంలో పలుమార్లు ఆకాంక్షించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనను నామినేట్ చేశారు. అయితే ఇటీవలి నిపుణుల అంచనాల్లో ట్రంప్‌కు అవకాశాలు అంతగా లేవనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆయన అవకాశాలపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.
నోబెల్ శాంతి బహుమతి అంటే చాలా గొప్పది. ప్రధానంగా ప్రపంచ శాంతిని కాంక్షించేవారు అలాగే అందుకోసం నిబద్ధతతో పనిచేసేవారికి అందాల్సిన గొప్ప బహుమతి అది. అంత చరిత్ర గల నోబెల్ శాంతి బహుమతిని వివాదాలకు చిరునామాలాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించడమే విచిత్రం. అంతేకాదు...తాను అనేక ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపాననీ, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి అందలేదని ట్రంప్ మహాశయుడు నిర్వేదం నటించడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.
అనేక ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నిలువరించానని జబ్బలు చరచుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ , పశ్చిమాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలను ఎందుకు సద్దుమణిగింపచేయలేకపోయారో వెల్లడించలేదు. పైపెచ్చు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ భూభాగాలపై ఇటీవల భీకర దాడులు చేశారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి శ్వేతసౌధంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అనేక వివాదాలు మూటగట్టున్నారు. గ్రీన్‌లాండ్ దీవిని అమెరికాలో కలిపేసుకోవాలన్న కోరికను ట్రంప్ బాహాటంగా ఆయన బయటపెట్టారు. వాస్తవానికి గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన ఒక దీవి. అవసరమైతే సైన్యాన్ని దింపి అయినా, గ్రీన్‌లాండ్ దీవిని కొనుగోలు చేస్తామని తెగేసి చెప్పారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్‌లో కూడా గ్రీన్‌లాండ్ దీవిని కొనాలని ఆయన భావించారు. అయితే గ్రీన్‌లాండ్ దీనిని విక్రయించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు ప్రధాని మెటే ప్రెడెరిక్సన్.
అంతేకాదు కెనడాకు సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇటీవల కెనడా ప్రధాని పదవికి జస్టిస్ ట్రూడో రాజీనామా చేసే సందర్భంలో , అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడానికి కెనడా అంగీకరిస్తే, సదరు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానన్నారు. అమెరికాలో కెనడా విలీనమైతే, సదరు దేశంపై ఎటువంటి సుంకాలు, పన్నులు ఉండవని హామీ ఇచ్చారు. అంతేకాదు రష్యా, చైనా నుంచి అమెరికా రక్షణ కల్పిస్తుందన్నారు. కథ అక్కడితో ఆగలేదు. అమెరికా దేశంలో కెనడా విలీనమైనట్లుగా తయారు చేసిన ఒక మ్యాప్‌ను ట్రంప్ తన పోస్టుకు జత చేశారు.
అంతేకాదు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానంటూ కొంతకాలం కిందట ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఒకదేశం తరువాత మరొక దేశంలో డొనాల్డ్ ట్రంప్ వేలు పెట్టడాన్ని యావత్ ప్రపంచం గమనించింది. ట్రంప్ ది ఒకటే నీతి. తమ్ముడు తమ్ముడే ...పేకాట..పేకాట. ట్రంప్ మహాశయుడు అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఆయనకు అమెరికా ప్రయోజనాలు తప్ప మరింకేమీ కనిపించడం లేదు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్....ఒక కరడుగట్టిన జాతీయవాది. మేక్ అమెరికా ఎగైన్ గ్రేట్...ఈ విధానమే ట్రంప్‌ను రెండోసారి అమెరికా అధ్యక్షుడిని చేసింది. ఈ నినాదంతోనే సగటు అమెరికా సమాజానికి ఆయన దగ్గరయ్యాడు. మిగతా దేశాలకు దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే 2026 నోబెల్ శాంతి బహుమతి రేసు అనూహ్య మలుపు తిరిగింది. సాధారణంగా రాజకీయ నేతలు, మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పేర్లు వినిపించే ఈ పోటీలో ఈసారి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ...ఐఎస్‌ఎస్... కూడా చర్చకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తదితరులతో పాటు ఐఎస్‌ఎస్ పేరు కూడా నిపుణుల అంచనాల్లో వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరూ అధికారికంగా నామినేట్ అయ్యారనే ధ్రువీకరణ లేదు. నోబెల్ కమిటీ విజేతను అక్టోబర్ 9న ఓస్లోలో ప్రకటించనుంది.
కాగా ఈసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రేసులో ఉండటం అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో అంతరిక్ష కేంద్రానికి ఎందుకంత ప్రాధాన్యం అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇందుకు అంతర్జాతీయ విశ్లేషకులు బదులిచ్చారు. భౌగోళిక, రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా దేశాలు కలిసి పనిచేయగలవనే సందేశానికి ఐఎస్‌ఎస్ ప్రతీకగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడాకు చెందిన వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష కేంద్రంలో కలిసి పనిచేశారు. రాజకీయంగా పరస్పరం విభేదించే దేశాలు కూడా శాంతియుత ఉమ్మడి ప్రాజెక్టులో సహకరించగలవనే అరుదైన ఉదాహరణగా ఐఎస్‌ఎస్ నిలిచింది. 2000 నవంబర్ నుంచి అక్కడ నిరంతరంగా మనుషుల ఉనికి కొనసాగుతోంది. అందుకే ఐఎస్‌ఎస్ కు నోబెల్ శాంతి బహుమతి లభిస్తే ... అది ఒక్క శాస్త్రీయ విజయానికి కాకుండా అంతర్జాతీయ సహకారానికి ప్రతీకగా భావించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేరు కూడా ఈసారి నిపుణుల చర్చల్లో కనిపిస్తోంది. అమెరికా సుంకాల విధానాలను ఆయన వ్యతిరేకించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలపరచాలని కోరడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఆయన నోబెల్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు అధికారిక సమాచారం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు కూడా పోటీదారుల్లో వినిపిస్తోంది. అమెరికాలో జన్మించిన తొలి పోప్‌గా గుర్తింపు పొందిన పోప్ లియో కూడా చర్చలో ఉన్నారు. పశ్చిమాసియాలోని యుద్ధంపై ఆయన పలుమార్లు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో ఆయన వైఖరి ట్రంప్ అభిప్రాయాలకు భిన్నంగా కూడా ఉంది.
కాగా 2026 నోబెల్ శాంతి బహుమతికి మొత్తం 287 అర్హత కలిగిన నామినేషన్లు అందాయి. ఇందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. అయితే అధికారిక నామినీల జాబితాను నార్వేజియన్ నోబెల్ కమిటీ బహిర్గతం చేయదు. అందువల్ల నిపుణుల అంచనాలు, ప్రిడిక్షన్ మార్కెట్లు, బహిరంగ చర్చల్లో వినిపిస్తున్న పేర్లను అధికారిక నామినీలుగా పరిగణించలేం. తుది నిర్ణయం పూర్తిగా నోబెల్ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.




