Burning Topic: క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
Burning Topic: ప్రపంచాన్ని వణికిస్తున్న సూపర్ ఎల్ నినో ప్రభావం. రానున్న కాలంలో విపరీతమైన ఎండలు, వేడి తీవ్రత కారణంగా భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిక.
Burning Topic: క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
Burning Topic: పసిఫిక్ మహాసముద్ర గగణతలంపై ఎల్ నినో ప్రభావం మరింత బలపడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణ సగటు కంటే 3.07 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. ప్రస్తుత సెప్టెంబర్ అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న నెలగా మారే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం గమనం మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో కరువులు, మరికొన్ని చోట్ల తీవ్ర తుపానులు, వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మన దేశంలో వర్షాల కాలం క్రమంగా ముగింపు దశకు చేరుతోంది. నైరుతీ రుతుపవన వర్షాలు తిరోగమన దిశగా అడుగులు వేస్తున్నాయి. వాయువ్య, పశ్చిమ భారత్ నుంచి ఈ నెల 20వ తేదీ తర్వాత రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలై, క్రమంగా పొడి వాతావరణం నెలకొంటోంది.
ప్రస్తుత ఎల్ నినో తీవ్రతను ముందుగానే గుర్తించి సూపర్ ఎల్ నినో అని వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. ఎల్ నినో ప్రభావంతో వచ్చే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు పెరగొచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తన తాజా నివేదికను వెల్లడించింది. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే అత్యంత వేడి ఉండే రోజులు 44 శాతం పెరగొచ్చని తెలిపింది. 1996 నుంచి 2025 మధ్య కాలంలో ఉష్ణోగ్రత రికార్డులను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఏడాది జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 4,51,000 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇందులో 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఆరు నెలల్లో సుమారు 2.39 లక్షల మంది మరణించే అవకాశం ఉంది.
ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది వేసవి వరకు కొనసాగితే ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చు. అయితే ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భారత కూడా మరణాల ముప్పును ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో సుమారు 15,800 మరణాలు సంభవించే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ఇందులో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యే సుమారు 7,400 మంది వేడి కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. కాగా భారత్‌లో అసలు ఎండాకాలం మార్చి తర్వాత మొదలవుతుంది. ఆ సమయంలో కూడా ఎల్‌నినో ప్రభావం కొనసాగితే వేడి వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వేడి కారణంగా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉన్న దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేసియా, సూడాన్, భారత్, బ్రెజిల్ ఉన్నాయి.
ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో అత్యధికంగా 66,800 మరణాలు సంభవించే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. ఒక్క నైజీరియాలోనే 31,400 మంది మరణించడానికి అవకాశం ఉంది. అలాగే సూడాన్- 17,500, నైగర్- 10,000, చాద్- 8,000 మంది ఎండల తీవ్రత తట్టుకోలేక మరణించే అవకాశం ఉంది. ఇక . బ్రెజిల్‌లో 13,300 మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియాలలో కలిపి 19,400 మరణాలు సంభవించవచ్చు. అయితే ఇది కచ్చితమైన సంఖ్య కాదని, వాతావరణ పరిస్థితులు మారితే ఆ సంఖ్య కూడా మారవచ్చని పరిశోధకులు తెలిపారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత అసాధారణంగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ దేశాల్లో నివారణ చర్యలతో పాటు తగిన రక్షణ ప్రణాళికలు అవసరమని సూచించింది.
సూపర్ ఎల్ నినో ముప్పు కారణంగావేడి పెరిగే ప్రాంతాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తెలిపింది. ప్రజలకు ముందుగానే ఎండలపై హెచ్చరికలు ఇవ్వడం, చల్లగా ఉండే కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు ఉపయోగపడతాయని పేర్కొంది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, ఎండలో పనిచేసే కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆసుపత్రుల్లో అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచడం కూడా అవసరమని తెలిపింది. ప్రస్తుత పరిశోధనలు భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణానికి ఒక ముందస్తు హెచ్చరికగా చెప్పింది. ఎండలు మరింత తీవ్రంగా మారే పరిస్థితుల్లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారీ ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
సాధారణంగా పసిఫిక్ సముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఎల్‌నినో ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. ఎక్కడో వర్షాలు తగ్గుతాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా తీవ్రంగా మారుతాయి. సముద్రం నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరిగినప్పుడు దాన్ని సూపర్ ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో సహజంగా ఏర్పడే వాతావరణ మార్పే అయినప్పటికీ, భూమి ఇప్పటికే వేడెక్కుతుండటం వల్ల దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఎల్‌నినో కూడా తోడైతే కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వర్షాభావం, అడవుల్లో మంటలు, భారీ వర్షాలు, వరదలు వంటి సమస్యలు పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యవసాయం, ఆహార సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం సూపర్ ఎల్ నినో ప్రభావం ఇంకా గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. నవంబర్-డిసెంబర్ నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చనుంది. అమెరికాకు చెందిన నోవా శాస్త్రవేత్తలు కూడా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ దాటి నమోదయ్యానని ధృవీకరించారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ తదితర దేశాల్లో ఫిబ్రవరి 2027 తర్వాత వచ్చే వచ్చే వేసవి కాలంలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకోవడం ఖాయమని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆగస్ట్.. అత్యంత వేడి నెలగా రికార్డయింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 16.96 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇది 1850-1900 పారిశ్రామికీకరణ సగటు కంటే 1.65 డిగ్రీల సెల్సియస్ అధికం.
ఇదిలా ఉంటే భారత్ లో ఎల్‌నినో మరింత బలపడుతుండటంతో రానున్న రోజుల్లో వర్షపాతంలోటు మరింత పెరుగుతుందని, ఇది వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఈనెల 17వ తేదీ నాటికి దేశంలోని రిజర్వాయర్లలో 71 % మాత్రమే నీరు నిల్వ ఉందని, దక్షిణ భారతంలో ఇంకా తక్కువగా రిజర్వాయర్ల సామర్థ్యంలో 52 % మాత్రమే నీరు నిల్వ ఉందని పేర్కొంది. ఈనెల 21వ తేదీ నాటికి దేశంలో దీర్ఘకాలిక సగటు కంటే 15 % తక్కువగా 704 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే.. దక్షిణభారతంలో లోటు 27 %, తూర్పు భారతంలో 26 %, మధ్య భారతంలో 6 %, వాయవ్య భారతంలో 10 % నమోదైందని పేర్కొంది. మరింత బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులు వ్యవసాయానికి ముప్పుగా పరిణమించనున్నాయని నివేదిక పేర్కొంది.




