BurningTopic: ప్రపంచాన్ని వణికిస్తున్న 'గాడ్జిల్లా ఎల్ నినో'.. ప్రమాదంలో భారత్?

BurningTopic: భారతదేశంలో రుతుపవనాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ప్రపంచాన్ని వణికిస్తున్న 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతోంది?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2026 7:08 AM IST
BurningTopic
X

BurningTopic: ప్రపంచాన్ని వణికిస్తున్న 'గాడ్జిల్లా ఎల్ నినో'.. ప్రమాదంలో భారత్?

BurningTopic: మన దేశ వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలే జీవనాడి. దేశవ్యాప్తంగా కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 75 శాతం వర్షాలు ఈ రుతుపవనాల ద్వారానే వస్తాయి. నదులు, చెరువులు, రిజర్వాయర్లు నిండటానికి ఈ వర్షాలే ఆధారం. ఇవి భూగర్భ జలాలను పెంచి, ఏడాది పొడవునా నీటి కొరత లేకుండా చేస్తాయి. ఖరీఫ్ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు వంటి వాటి సాగు పూర్తిగా ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. నైరుతి రుతుపవనాల రాకను బట్టే రైతులు విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. వర్షాలు సమృద్ధిగా పడితే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి, ఆహార భద్రత చేకూరుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. వేసవి తీవ్రతతో అల్లాడిపోయే ప్రజలకు ఈ రుతుపవనాలు భారీ ఉపశమనాన్ని ఇస్తాయి. వాతావరణాన్ని చల్లబరిచి, జీవకోటికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రైతుల్లో ఆశలు నింపాయి. జూన్ 4న కేరళలోకి ప్రవేశించి జూన్ 15 నాటికి దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలను తాకాయి. తొలి దశలో వేగంగా విస్తరించినా ఆ తర్వాత వాటి కదలికలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. జూన్ మధ్య నాటికి దేశంలోని చాలా ప్రాంతాల వ్యాపించాల్సిన నైరుతి రుతుపవనాలు మధ్యలోనూ నిలిపోవడం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నాయి. జూన్ 1 నుంచి జూన్ 17 వరకు దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఏకంగా 62 శాతం వర్షపాత లోటు నమోదైంది. జూన్ 23 వరకు కూడా రుతుపవనాల పురోగతిలో పెద్దగా మార్పు కనిపించే సూచనలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, బలహీనమైన సముద్ర గాలులు కారణమని అంచనా వేస్తున్నారు.

సాధారణంగా వర్షాలు ఆలస్యం కావడానికి ఒకటో రెండో కారణాలు ఉంటాయి. కానీ ఈసారి ఏకంగా ఐదు ప్రతికూల వాతావరణ అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి.

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలను ప్రభావితం చేస్తుంది.

ఉష్ణమండల ప్రాంతాల్లో మేఘాల ఏర్పాటుకు, వర్షాల కురిసేందుకు కీలకమైన మాడెన్-జూలియన్ ఆసిలేషన్ వ్యవస్థ ప్రస్తుతం హిందూ మహాసముద్రానికి దూరంగా ఉండటంతో మనదేశానికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.

ఉత్తర భారతదేశంలో ఏర్పడిన బలమైన పశ్చిమ అలజడుల కారణంగా పొడి గాలులు దక్షిణ దిశగా విస్తరించి తేమతో కూడిన గాలులను అడ్డుకుంటున్నాయి.

హిందూ మహాసముద్రం నుంచి భారతదేశానికి భారీగా తేమను తీసుకొచ్చే ఈ గాలులు ఈసారి బలహీనంగా ఉండటంతో రుతుపవనాలకు అవసరమైన శక్తి అందడం లేదు.ఇది పాజిటివ్ దశలో ఉంటే భారతదేశంలో వర్షపాతం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రస్తుతం తటస్థంగా ఉండటంతో రుతుపవనాలకు అదనపు బలం లభించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ వానలు పడటం లేదు. వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఆశలు వదులుకున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడం, ఆశించినంత వర్షాలు కురవకపోవడంతో వాతావరణ పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన లోటు వర్షపాతం కొనసాగుతోంది. సాధారణంగా వానలు ఆలస్యమైనా, జూన్​ రెండో వారం ముగిసేసరికి పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. 2015, 2021ల్లోనూ నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించినప్పటికీ వానలు ఆలస్యమయ్యాయి. అయితే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. జూన్‌ నాలుగో వారంలో ఎంజేవో అనుకూలమైన దశలోకి ప్రవేశిస్తుందని, అదేసమయంలో తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రవాహం, భూమధ్యరేఖను దాటి వచ్చే గాలులు, ఎగువస్థాయి తూర్పు గాలులు బలపడతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

దేశంలోకి తేమతో కూడిన గాలులు ప్రవేశిస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం పడకపోవడానికి ప్రధాన కారణం 'అట్మాస్ఫిరిక్ సబ్సిడెన్స్' అంటే గాలి పైకి ఎగసి మేఘాలు ఏర్పడే బదులు కిందికి అణచివేస్తోంది. దీంతో మేఘాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు సరైన విధంగా కలవడం లేదు. దీనివల్ల రుతుపవన ద్రోణి ఆకారం కూడా మారిపోయింది. ఫలితంగా ఈశాన్య భారతదేశంలో మాత్రమే అక్కడక్కడా వర్షాలు పడుతుండగా, దేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాలు పొడిగా ఉంటున్నాయి. కాగాప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ జూన్ చివరి వారంలో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మాడెన్-జూలియన్ ఆసిలేషన్ భారత్‌కు అనుకూల దశలోకి రావడం, క్రాస్- ఈక్వటోరియల్ గాలులు బలపడటం వల్ల పొడి వాతావరణం తగ్గి వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని సూపర్ ఎల్‌నినో భయపెడుతోంది. 2026-27 మధ్య కాలంలో ఏర్పడే అవకాశం ఉన్న ఈ పరిస్థితిని కొందరు శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోగా పిలుస్తున్నారు. ఇది అత్యంత బలంగా మారి ప్రపంచ వాతావరణ వ్యవస్థను కుదిపేస్తుంది అనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే 1976-78 మధ్య కాలంలో సంభవించిన బలమైన ఎల్‌నినో కారణంగా ప్రపంచం తీవ్ర కరువు, ఆహార కొరత, వ్యాధులను ఎదుర్కొంది. ఆ సమయంలో ప్రపంచ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రభావితమయ్యారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు సూపర్ ఎల్‌నినో వస్తే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. భారీ వరదలు, తుఫానులు, ఆకస్మిక వర్షాలు, నీటి కొరత వంటి సమస్యలు పెరగొచ్చు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story