Burning Topic: భారీ కరువు తప్పదా?
Burning Topic: ప్రపంచాన్ని భయపెడుతున్న 'గాడ్జిలా ఎల్-నినో' అంటే ఏంటి? దీనివల్ల భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
Burning Topic: భారీ కరువు తప్పదా?
Burning Topic: ఎల్‌నినో.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచం వణిపోతోంది. గత దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తిమంతమైన 'ఎల్‌నినో' తీవ్ర రూపం దాల్చబోతుందని అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ - నోవా ఇప్పటికే హెచ్చరించింది. శిలాజ ఇంధన కాలుష్యం కారణంగా ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్' సమస్యతో అల్లాడుతోంది. వేడెక్కిన పుడమిని ఎల్‌నినో మరింత వేడెక్కించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే దీని ప్రభావం ప్రారంభమంది. సాధారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు చల్లగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. ఈ ప్రక్రియనే 'ఎల్‌నినో' అని పిలుస్తారు. తాజాగా పసిఫిక్ మహాసాగర లోతుల నుంచి వేడి.. ఉపరితలంపైకి వస్తోందని నిపుణులు తెలిపారు. సాధారణంగా వచ్చే ఎల్‌నినోల కాస్త ప్రత్యేకంగా ఉండటంతో శాస్త్రవేత్తలు దీనికి గాడ్జిలా ఎల్‌నినో అని పేరు పెట్టారు.
జూన్ 11న ఎల్‌నినో ఆరంభమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం పసిఫిక్ మహాసాగర లోతుల్లోని వేడి నీరు ఉపరితలం వైపునకు ఉధృతంగా వస్తోంది. ఈ మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో గాడ్జిలా ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చి, 1950 తర్వాత అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినోల్లో ఒకటిగా నిలిచే అవకాశం 63 శాతం మేర ఉందని నోవా పేర్కొంది. ఇది వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసి, ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయికి చేర్చవచ్చని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రుతుపవనాల గమనం దెబ్బతింటుంది. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు తలెత్తుతాయి. ఇది వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి, ఆహార భద్రతకు ముప్పు కలిగించవచ్చు. ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ - ఐఎండీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవన కాలంలో ఈ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. సముద్రం, గాలి కలిసి పనిచేసే తీరును బట్టి చూస్తే.. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటిపోయినట్లు ఐఎండీ పేర్కొంది. సముద్రం వేడెక్కడంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. సముద్ర–వాతావరణ అనుసంధాన వ్యవస్థ ఇప్పుడు ఎల్‌నినో స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్‌అంచనాల ప్రకారం.. రుతుపవన కాలం గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖతన జూన్ 2026 ఎన్సో, ఇండియన్ ఓషన్ డైపోల్బులెటిన్లో ఈ వివరాలు వెల్లడించింది.
వాస్తవానికి 2026 జూన్‌లో మధ్య ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటాయి. ఈ వాతావరణ మార్పును కొలిచే 'నినో 3.4 ఇండెక్స్' మూడు నెలల సగటు ఉష్ణోగ్రత +0.5సీ కంటే పైకి రికార్డ్ అయ్యిందని తెలిపింది. ఇది ఎల్‌నినో ప్రారంభమైంది అనడానికి సంకేతమని స్పష్టం చేసింది. అంతేకాదు సముద్ర పైభాగంలోనే కాకుండా, లోపలి పొరల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ వేడి నీరు పైకి వచ్చి ఎల్‌నినోను మరింత బలోపేతం చేస్తుందని ఐఎండీ గుర్తించింది. సాధారణంగా తీవ్రమైన ఎల్‌నినో ఏర్పడినప్పుడు, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కార్చిచ్చులు వస్తాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి.
భారతదేశానికి సంబంధించి చూసుకుంటే, 2000వ సంవత్సరం తర్వాత అంటే 2002, 2009, 2015, 2023లో ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు వచ్చాయి. సాధారణంగా ఈ ఎల్ నినో సమయంలో దేశంలో రుతుపవనాలు బలహీనపడడం, తక్కువ వర్షాలు కురవడం, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంవత్సరాలపాటు కరవు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే భారతదేశ వర్షపాతాన్ని కేవలం ఎల్‌నినో ఒక్కటే ప్రభావితం చేయదని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో 'ఇండియన్ ఓషన్ డైపోల్' సాధారణ స్థితిలోనే ఉందని తెలిపింది. అందువల్ల ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడంలో, పెంచడంలో దీని పాత్ర చాలా పరిమితం అని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం గమనిస్తూ, ప్రతి నెలా తాజా సమాచారాన్ని అందిస్తామని ఐఎండీ పేర్కొంది.
భారత్ విషయానికొస్తే, ఎల్ నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీన పడతాయి. దీనివల్ల వర్షపాతం తగ్గిపోతుంది. ఈ పరిణామాల వల్ల వ్యవసాయ రంగం కుదేలై పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సరఫరా వ్యవస్థ దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎల్ నినో దెబ్బకి వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ ప్రక్రియ ప్రస్తుతం తటస్థ స్థితిలో ఉంది. ఈ వర్షాకాలమంతా అదే పరిస్థితి కొనసాగవచ్చని తెలిపింది. ఐవోడీ తటస్థంగా ఉంటే.. ఎల్‌నినో ప్రభావాన్ని పెద్దగా పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు.




