Burning Topic: భారత్ కు శుభవార్త..ఇక పెట్రోల్, డీజిల్ బాధలు ఉండవు

Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్‌కు యూఏఈ నుంచి భారీ ఊరట లభించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 May 2026 8:47 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్ కు శుభవార్త..ఇక పెట్రోల్, డీజిల్ బాధలు ఉండవు

Burning Topic: పశ్చిమాసియాలో హార్ముజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధం తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్రెంట్ ప్యూచర్స్ నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి 120 డాలర్లకు చేరాయి. 2022 జూన్ తరువాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయ డానికి ఆ దేశ ఓడరేవులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశిండంతో.. దీనికి ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధి గుండా సాగే రాకపోకలకు అంతరాయం కలిగించడం కొన సాగిస్తామని ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ వద్దకు వచ్చే ఏ నౌకపైనైనా దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించగా, ఇరాన్ ఓడరేవులకు రాక పోకలు సాగించే నౌకలను వెనక్కి పంపుతామని అమెరికా ప్రకటించింది. మంగళ వారం 110 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 120 డాలర్లకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైన తరు వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

చమురు సంక్షోభంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా జాగ్రత్త పడుతోంది భారత ప్రభుత్వం. అయితే పరిస్థితులు మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే చమురు కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. సరిగ్గా ఇదే సమయంలో గల్ఫ్ నుంచి శుభవార్త అందింది. హార్మూజ్ జలసంధితో ప్రమేయం లేకుండా.. ఫుజైరా తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. యూఏఈ రెండు రోజుల క్రితమే. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ - ఒపెక్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది.

యూఏఈ ఒపెక్‌ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. .అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హార్మూజ్‌ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ అని పిలిచే దీనికి సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయం అయింది. ఈ మార్గం ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్‌ జలసంధి అవసరం లేకుండా పోతుంది. ఇది ఒక రకంగా భారత్‌కు శుభవార్త. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది.

భారత్, యూఏఈల మధ్య ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా సాగుతోంది. దీనికి ఇంధన ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముడి చమురు దిగుమతులలో సుమారు 9 - 10 శాతం యూఏఈ అందిస్తోంది. భారతదేశానికి ఒక ముఖ్యమైన ఎల్ఎన్జీ సరఫరా దారుగా కూడా యూఏఈ సేవలు అందిస్తోంది. ఫుజైరా మార్గం ఇప్పటికే భారత్‌కు ప్రయోజనకరంగా నిరూపితమైంది. హార్ముజ్‌లో అడ్డంకులు ఏర్పడినప్పుడు మన దేశ రిఫైనరీలు పుజైరా ద్వారా దిగుమతులను పెంచాయి. ఈ పైపులైన్ పుజైరా రిఫైనరీ, ఎగుమతి టెర్మినల్స్ రెండింటికి చమురును సరఫరా చేస్తుంది. ప్రస్తుతం యూఏఈ ఒపెక్ పరిమితుల నుండి విముక్తి పొందడటంతో కోటాతో నిమిత్తం లేకుండా ఈ లైన్ ద్వారా మరింత ముడి చమురును సరఫరా చేయగలదు. భారీ సంఖ్యలో భారత్‌కు చమురు వచ్చే అవకాశాలు ఉన్నాయి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ రోజు చేరుతుంది. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత దేశ చమురు అవసరాల్లో యూఏఈ నుంచి దిగుమతుల వాటా 9 నుంచి 10 వరకూ ఉంది. ప్రస్తుతం మన దేశానికి యూఏఈ రోజుకు 619,000 బ్యారెల్స్ చమురు సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 433,000 బ్యారెల్స్ రాగా తాజాగా సుమారు 43% పెరుగుదల నమోదైంది. రాబోయే రోజుల్లో మన దేశానికి ఆ దేశం నుంచి భారీగా చమురు రాబోతోంది. ఫలితంగా భారత్‌కు దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం ద్వారా ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story