Burning Topic: నేపాల్‌లో రచ్చ రచ్చ చేస్తున్న గూర్ఖా యూత్!

Burning Topic: భారత సైన్యంలో అగ్నిపథ్ కింద గూర్ఖాల నియామకాలను వెంటనే ప్రారంభించాలని నేపాల్‌లోని పోఖరాలో మాజీ సైనికులు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 11:15 AM IST
Burning Topic
X

Burning Topic: నేపాల్‌లో రచ్చ రచ్చ చేస్తున్న గూర్ఖా యూత్!

Burning Topic: భారత్, నేపాల్ దేశాలు కేవలం ఇరుగు పొరుగు దేశాలు మాత్రమే కాదు. రెండు దేశాల మధ్య పురాతన కాలం నుంచి సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలు ఉన్నాయి. భేటీ - రోటీగా చెప్పుకునే బంధుత్వాలు కూడా భారత్, నేపాల్ మధ్య ఉన్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత సైన్యంలో సేవలందిస్తున్న ఏకైక విదేశం నేపాల్. భారత సైన్యానికి, నేపాల్‌లోని గూర్ఖా సైనికులకు సుదీర్ఘ కాలంగా బలమైన సంబంధం ఉంది. బ్రిటీష్ కాలం నాటి నుంచి నేపాలీ యువకులు గూర్ఖా రెజిమెంట్లలో వీరోచితంగా సేవలు అందిస్తున్నారు.

1814-1816 మధ్య ఆంగ్లో-నేపాల్‌ యుద్ధం జరిగింది. ఆ సమయంలో గూర్ఖా సైనికుల శౌర్యానికి ముగ్ధుడైన ఈస్ట్‌ ఇండియా కంపెనీ జనరల్‌ డేవిడ్ ఆక్టర్లోని.. బ్రిటిష్‌ సైన్యంలో వారిని నియమించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. 1815లో మొదటి గూర్ఖా బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి భారత సైన్యంలో భాగమయ్యాయి.

గుర్ఖాల చేతిలోని కీలక ఆయుధం 'ఖుక్రీ' మొదటి ప్రపంచ యుద్ధంలో 2 లక్షల మంది గూర్ఖా సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో దాదాపు 20 వేల మంది ప్రాణాలను కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో గూర్ఖా బెటాలియన్ల సంఖ్య భారీగా పెరిగింది. రెండున్నర లక్షల గుర్ఖాలు యుద్ధంలో పాల్గొన్నారు. 32 వేల మంది మరణించారు. గుర్ఖా రెజిమెంట్స్ సైనికులు తమ అసమాన ధైర్యసాహసాలకు గాను బ్రిటిష్ సైన్యంలో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

ఏకంగా 9 విక్టోరియా క్రాస్ పతకాలను గెలుచుకుని తమ శౌర్యాన్ని ప్రపంచానికి చాటారు. 'విక్టోరియా క్రాస్ అందుకున్న మొదటి గూర్ఖా సైనికులు కుల్బీర్ థాపా. చావడానికి నేను భయపడను అని ఎవరైనా చెబితే, అతను అబద్ధం చెబుతున్నాడు లేదా అతను గూర్ఖా అయినా అయి ఉండాలి అని ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా ఒక సందర్భంలో చెప్పారు.

1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గుర్ఖాలు కొనసాగారు. భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గూర్ఖా రెజిమెంట్లు భారత్, యూకే సైన్యాల్లో కొనసాగాయి. ఇలా విదేశీ సైన్యంలో సేవలందించిన నేపాలీ సైనికులకు పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఆయా దేశాలే అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో భాగంగా నాలుగు గూర్ఖా రెజిమెంట్లు బ్రిటన్‌కు వెళ్లగా.. ఆరు రెజిమెంట్లు భారత్‌కు లభించాయి.

ఆ తర్వాత గూర్ఖా రైఫిల్స్‌ పేరుతో మరో దళాన్ని కూడా భారత్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దాదాపు 35వేల మంది నేపాలీ సైనికులు భారత ఆర్మీలో పనిచేస్తున్నారు. అలాగే, 1.32లక్షల మంది మాజీ సైనికులున్నారు. కాగా 2020 కరోనా కారణంగా భారత సైన్యంలోకి నేపాలీల నియామకాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2022లో కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ పథకాన్ని తీసుకొచ్చింది.

నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్ పథకం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన పౌరులను పంపేందుకు అంగీకరించలేదు. అగ్నివీరులుగా చేరేవారు నాలుగేళ్లు మాత్రమే సేవలు అందిస్తారు. ఆ తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే పూర్తిస్థాయి సేవలకు ఉంచుకుంటారు. తక్కువ కాలపరిమితి, పదవీ విరమణ తర్వాత సైనికుల భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, 1947 నాటి త్రైపాక్షిక ఒప్పందాలకు ఇది భిన్నంగా ఉందనే కారణాలతో నేపాల్ ప్రభుత్వం ఈ రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసింది.

భారత సైన్యంలోని నిబంధనలను మార్చినప్పుడు తమ అభిప్రాయాలను తీసుకోలేదని ఆరోపించింది. దీన్ని భారత్‌ ఆనాడే తోసిపుచ్చింది. అది తమ ప్రభుత్వ విధానమని తేల్చిచెప్పింది. అలా ఈ విభేదాల కారణంగా భారత సైన్యంలో నేపాలీల నియామకాలు ఆగిపోయాయి. ఈ నిర్ణయం కారణంగా నేపాల్ యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయి ఇబ్బందుల్లో పడ్డారు.

కొవిడ్ తర్వాత నేపాల్ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. అక్కడి ప్రభుత్వం మీద యువత తిరగబడ్డారు. గత ఏడాది జెన్‌ జీ ఉద్యమం ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బాలెన్‌ షా ప్రధానమంత్రిగా వచ్చారు. అయితే నేపాల్ పరిస్థితులు మాత్రం మారలేదు. భారత సైన్యంలో చేరిక విషయంలో గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యంలో నియామకాలు కొనసాగినప్పుడు.. గూర్ఖా సైనికుల జీతభత్యాలు, ఇతర పరిహారం కింద ఏటా రూ.1000 కోట్ల మొత్తం నేపాల్‌ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్లేది.

ఇప్పుడు ఆ నిధులు ఆగిపోయాయి. దీనికి తోడు అస్థిరత కారణంగా స్వదేశంలో ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. ఈ క్రమంలోనే నేపాల్‌లో ఆందోళనలు వెల్లువెత్తాయి.స్థానికంగా ఉపాధి లేకపోవడంతో.. అగ్నివీరులుగా అయినా సరే తమను భారత సైన్యంలోకి తీసుకోవాలని నేపాల్ యువత ఇప్పుడు తమ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.

తాజాగా నేపాల్‌లోని పోఖరాలో ‘ఇండియన్ ఎక్స్-సర్వీస్‌మెన్ గోర్ఖా బ్రిగేడ్ నేపాల్’ ఆధ్వర్యంలో మాజీ సైనికులు, వారి కుటుంబాలు, మిలిటరీ శిక్షణ పొందుతున్న యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్నిపథ్ కింద నియామకాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోవడమే కాకుండా, మన పూర్వీకుల వీరత్వ చరిత్ర తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు.

నాలుగేళ్ల అగ్నిపథ్ కాలంలోనే యువకులు దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చని వినతిపత్రంలో పేర్కొన్నారు. 50 డిగ్రీల తీవ్రమైన ఎండలో గల్ఫ్ దేశాలకు వెళ్లి అల్ప వేతనానికి కష్టపడటం కంటే, భారత సైన్యంలో చేరడం వంద రెట్లు మెరుగైన ఉపాధి మార్గమని స్పష్టం చేశారు. భారత ఆర్మీ చీఫ్‌ ధీరజ్‌ సేథ్‌ నేపాల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఆందోళనకు ప్రాధాన్యత ఏర్పడింది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story