Off The Record: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు .. మల్లన్నకు షాక్ తప్పదా?

Off The Record: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? తీన్మార్ మల్లన్నకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2026 6:32 AM IST
Off The Record
X

Off The Record: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు .. మల్లన్నకు షాక్ తప్పదా?

Off The Record: అది ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. 2024 మే నెలలో ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ మద్దతుతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. అయితే ఆయన పదవీకాలం 2027 మార్చి 9తో ముగుస్తోంది. స్థానం ఖాళీ కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఎన్నికల ముందస్తు వేడి పార్టీల్లో కనిపిస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందన్న సంకేతాలతో, రాజకీయ పక్షాలు ఇప్పుడే క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి.

బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డినే మళ్ళీ రంగంలోకి దించేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. యువతను, నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి రాకేష్ రెడ్డి ఇప్పటి నుంచే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా 'ఈ-క్లాస్' యాప్‌ను ప్రారంభించడం వెనుక, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది పట్టభద్రుల మద్దతును కూడగట్టడమే లక్ష్యమని స్పష్టమవుతోంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకుని విద్యావంతులు, నిరుద్యోగులు కాంగ్రెస్‌ సర్కార్‌పై ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చూస్తోంది గులాబీ పార్టీ. దీన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టి్ంది.

బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర మల్లగుల్లాలు సాగుతున్నాయి. గతంలో పోటీ చేసిన రాణి రుద్రమాదేవి పేరు మరోసారి తెరపైకి వస్తోంది. అయితే ఆమెతో పాటు స్టూడెంట్ ఉద్యమాల నేపథ్యం ఉన్న కాసం వెంకటేశ్వర్లు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వయసు రీత్యా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని పక్కన పెట్టి, ఈసారి యువతకు లేదా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్లు యోచిస్తున్నారు. బలమైన అభ్యర్థిని నిలబెట్టి, ఈసారి ఎలాగైనా గెలుపు రుచి చూడాలనే పట్టుదలలో బీజేపీ ఉంది.

ఇక కాంగ్రెస్ పరిస్థితిపై క్లారిటీ లేదు. అధికార పార్టీ కాబట్టి ఆశావహుల జాబితా భారీగా ఉండే ఛాన్స్ లేకపోలేదు. తెర వెనుక ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. హస్తం పార్టీ పవర్‌లో ఉండటంతో గెలుపు ఈజీ అయింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేరుగా ఉన్నాయి. హస్తం పార్టీ నుంచి బయటికి వచ్చిన మల్లన్న సొంతంగా రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నారు. ఐతే రాబోయే ఎమ్మెల్సీ పోరులో మల్లన్న బరిలోకి దిగుతారా లేక తన పార్టీ నుంచి మరొకరిని నిలబెడతారా అన్నది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అన్నట్టుగా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరై.. హస్తం అండతో పోటీ చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీజేపీ సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఆయన రాజకీయ వ్యూహాల్లో భాగంగానే చూడాలనే చర్చ జరుగుతోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా, ఇది అధికార పార్టీకి ఒక 'రిఫరెండం'లా మారుతోంది. 2021లో 72 మంది, 2024 ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారంటేనే ఈ సీటుకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గతంలో 5 లక్షల వరకు ఉన్న ఓటర్లు, ఇప్పుడు కొత్త నమోదుతో మరింత పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఫైనల్ జాబితా, మార్చిలో ఎన్నికలు.. ఈ లోపు ఈ నియోజకవర్గంలో ఎన్ని రాజకీయ మలుపులు చోటుచేసుకుంటాయో చూడాలి."

"మొత్తానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. నిరుద్యోగ యువత, విద్యావంతుల తీర్పు ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి. అధికార పక్షం ఆధిపత్యం నిలబడుతుందా? ప్రతిపక్షాల వ్యూహాలు ఫలిస్తాయా? లేక ఇండిపెండెంట్ గా మల్లన్న మళ్లీ మ్యాజిక్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే మూడు నెలలు ఓటరు నమోదు ప్రక్రియ కీలకం కానుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story