Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచేది ఎవరు!

Off The Record: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో ఎన్నికలు. అధికార కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ, ఆశావహుల జాబితా.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:39 AM IST
Off The Record
X

Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచేది ఎవరు!

Off The Record: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల భేరి మోగనుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవడంతోపాటు మరో స్థానాన్ని కూడా సొంతం చేసుకోవాలని భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ.

ఆ టికెట్‌ను ఆశించే వారి సంఖ్య కూడా భారీగానే ఉన్నారట. ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావోరేవో లాంటిదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు స్థానాలకు జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి.. 2028లో జరిగే ప్రధాన ఎన్నికలకు తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది రేవంత్ టీం. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ జిల్లాలు అలాగే.. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో ఎక్కువ మంది ఈ రెండు శాసనమండలి నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి.

ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తోంది కాంగ్రెస్.

ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. దీంతో ఈ ఎన్నికల్లో వారు ఇచ్చే తీర్పు చాలా కీలకం కాబోతోంది. అందుకే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామమే కానుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్‌ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక కావాల్సి ఉంది.

ఓటరు నమోదు ప్రక్రియ కోసం ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ జారీ చేస్తారని అంచనా వేస్తున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరులోపు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ చేపట్టవచ్చు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని అంచనా.

ఇక అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి ప్రధాన సానుకూల అంశంగా మారింది. తాము చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పట్టభద్రులు ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇన్ని సానుకూలతల కారణంగానే రెండు స్థానాలకూ అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉందని భావిస్తున్నాయి గాంధీభవన్ వర్గాలు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేత గౌరీ సతీశ్‌ తదితరులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, ఇందిర శోభన్, ఓయూ జేఏసీ నేత లోకేశ్‌ యాదవ్‌ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని టాక్. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి.. కసరత్తు ముమ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొంత ఆలస్యమైనా గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక పోటీ చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్‌తోపాటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ తరఫున కూడా పోటీ చేసేందుకు గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వరుస కడుతున్నారట.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్