Off The Record: భాగ్యనగరంలో మినీ యుద్ధానికి ముహూర్తం ఖరారు?
Off The Record: గ్రేటర్ హైదరాబాద్ సరికొత్త సమరానికి వేళయింది! విభజన తర్వాత ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ట్రై కార్పొరేషన్ల ఎన్నికల రోడ్ మ్యాప్‌పై ప్రత్యేక విశ్లేషణ. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికల నోటిఫికేషన్?
Off The Record: భాగ్యనగరంలో మినీ యుద్ధానికి ముహూర్తం ఖరారు?
Off The Record: తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటింది. ఆర్థికంగానే కాదు.. రాజకీయంగానూ సెంటర్ పాయింట్. రాష్ట్రానికి పాలనా కేంద్రం భాగ్యనగరమే. మరి అలాంటి చోట ఎన్నికలంటే ఆ ఉత్కంఠ మాములుగా ఉండదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది గ్రేటర్లో కొత్తగా ఏర్పడిన ట్రై కార్పొరేషన్ ఎన్నికలే.
జీహెచ్ఎంసీ ఎన్నికలంటే... ఒక మినీ యుద్దాన్నే తలపిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలక వర్గం గడువు ముగియడంతో.. ఆ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఎప్పుడనే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 10నే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లింది. చట్ట ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీని.. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి.. ఇలా మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యం అవుతూ వస్తోంది.
జిహెచ్ఎమ్సిలో యధావిధిగా 150 వార్డులుండగా, ఎమ్ఎన్సిలో 74, సైబరాబాద్ కార్పోరేషన్ పరిధిలో 76 వార్డులను ఏర్పాటు చేసారు. అయితే ఇప్పటికే గడువు ముగియడంతో వీటికి ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. మూడు కార్పొరేషన్ల విభజనకి ముందు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న ఏడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అనేక గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీలు అన్నీ కలిపి ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో విలీనం అయ్యాయి. అయితే వీటికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది..
ఇప్పటికే సోషల్ మీడియాలో రిజర్వేషన్లు కన్పార్మ్ అయ్యాయని త్వరలోనే ఎన్నికలు అంటు ప్రచారం జరుగుతుండగా వాటిని కొట్టిపారేసారు జిహెచ్ ఎమ్ సి కమిషనర్. ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. సర్ ప్రక్రియ సెప్టెంబర్ 1 నాటికి పూర్తయి అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.. ఇది పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఓటర్లు ఉన్నారనే క్లారిటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఎంత మంది ఓటర్లు ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుందంటున్నారు అధికారులు. అది పూర్తయిన తర్వాత పూర్తిస్తాయిలో ఎన్నికల నిర్వహణ పై స్పష్టత రానుంది.
S.I. R ప్రక్రియ అనంతరం డివిజన్లు, వార్డుల జాబితా ఆధారంగా ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిహెచ్ ఎమ్సికు సంబంధించి ఛైర్మన్ పదవిని రిజర్వేషన్ కోటాలో మహిళలకే కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన మిగతా రెండింటికి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారుల సమాచారం ప్రకారం ఇక గ్రేటర్ పరిధిలోని మూడు కార్పోరేషన్లలో నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 తరహాలోనే నవంబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ మొదటి వారంలోపు పోలింగ్, కౌంటింగ్ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.. 2027 జనవరి మొదటివారంలో కొత్త పాలకవర్గం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మూడు కార్పోరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.




