Burning Topic: అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో!

Burning Topic: ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నావిక్ వ్యవస్థను బలోపేతం చేసే ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని షార్ నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 7:06 AM IST
Burning Topic
X

Burning Topic: అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో!

Burning Topic: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో మరో కీలక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తదుపరి తరం నావిగేషన్ శాటిలైట్ అయిన ‘ఎన్‌వీఎస్-03’ ను ఈ రాకెట్ నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది.

24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం, శుక్రవారం రాత్రి సరిగ్గా 11:51 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి 50 మీటర్ల ఎత్తున్న ఈ మూడు దశల జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. మూడు దశలు కలిగిన ఈ రాకెట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 420 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువుతో బయలుదేరిన ఈ రాకెట్, 2,232 కిలోల బరువు కలిగిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

మన దేశ సొంత నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం.. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెల్లేషన్.. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది. తాజాగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌లోని మూడు దశలూ నిర్దేశించిన విధంగా పనిచేశాయి. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైన క్రయోజెనిక్‌ పైదశ కూడా విజయవంతంగా పనిచేయడంతో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడం సాధ్యమైంది.

ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. దేశ రక్షణ రంగానికి, సామాన్యుడి రవాణా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడే ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా మోహరించి, అంతరిక్ష సామర్థ్యంలో భారత్‌కు తిరుగులేదని నిరూపించింది. ఈ ప్రయోగంతో భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న 'నావిక్' వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్థానాన్ని గుర్తించడానికి చాలామంది అమెరికాకు చెందిన GPS వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని మన దేశం ఇతర దేశాల వ్యవస్థలపై ఆధారపడకుండా నావిక్ పేరుతో సొంత నావిగేషన్ సేవలను అభివృద్ధి చేసుకుంది. ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్లలో సంకేతాలను ప్రసారం చేసే సామర్థ్యం దీనికి ఉంది నావిక్ భారత్‌నే కాకుండా దేశ సరిహద్దుల చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన నావిగేషన్‌ సేవలను అందిస్తుంది.

ఇప్పటికే కక్ష్యలో పనిచేస్తున్న మూడు ఉపగ్రహాలకు ఎన్‌వీఎస్‌-03 తోడవడంతో మొత్తం నాలుగు ఉపగ్రహాలతో నావిక్‌ వ్యవస్థ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంలో స్వదేశీ రుబీడియం అణు గడియారాన్ని అమర్చారు. ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థలో కచ్చితమైన సమయ నిర్ధారణ అత్యంత కీలకం. ఈ ఉపగ్రహంలో స్వదేశీ సాంకేతికతతో పాటు విదేశాల నుంచి సేకరించిన అణు గడియారాలనూ వినియోగిస్తారు.

ఎన్‌వీఎస్‌-03 సేవలు అందుబాటులోకి రావడంతో నావిక్‌ సేవలు మరింత బలోపేతం కానున్నాయి.. విమానాలు ప్రయాణించే మార్గాలను గుర్తించడం, సముద్రంలో నౌకల కదలికలను పర్యవేక్షించడం, రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, రోడ్లపై వాహనాల స్థానాన్ని తెలుసుకోవడం వంటి అవసరాలకు ఈ సేవలు ఉపయోగపడతాయి. అత్యవసర సమయాల్లో సహాయక బృందాలు, బాధితుల స్థానాన్ని గుర్తించడంలోనూ ఇది తోడ్పడుతుంది.

మరోవైపు దేశ రక్షణ రంగానికి కూడా స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఎంతో ముఖ్యం. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలకు ఖచ్చితమైన స్థాన, సమయ సమాచారం అవసరం. విదేశీ నావిగేషన్‌ వ్యవస్థలపై ఆధారపడకుండా దేశీయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతను వినియోగించుకోవడం వ్యూహాత్మకంగా భారత్‌కు ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రామాణిక సమయాన్ని అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ 'ఒకే దేశం ఒకే సమయం' ప్రాజెక్టులోనూ నావిక్‌ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.

తాజా ప్రయోగంతో GSLV రాకెట్ తన 20వ మిషన్‌ను పూర్తి చేసుకుంది. గతంలో కొన్ని ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఈ రాకెట్.. వరుస విజయాలతో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. నావిక్‌ వ్యవస్థ కేవలం దిశానిర్దేశ సేవలకే పరిమితం కాదని, దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆస్తి అని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు. పొజిషనింగ్‌, నావిగేషన్‌, టైమింగ్‌ సేవలను స్వతంత్రంగా అందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

ఈ ప్రయోగంలో మరో ప్రత్యేకతను నారాయణన్‌ వెల్లడించారు. వరుస జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల మధ్య కేవలం 56 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం సంస్థ సామర్థ్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 80 శాతం బడ్జెట్‌ను భారతీయ పరిశ్రమలకే కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఎన్‌వీఎస్‌-03 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. నావిక్‌ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రయోగం కీలక ముందడుగని పేర్కొన్నారు. మెరుగైన సామర్థ్యాలతో కూడిన ఎన్‌వీఎస్‌-03 కీలక సాంకేతికతల్లో స్వావలంబన లక్ష్యానికి దోహదపడుతుందని తెలిపారు. దేశ ప్రజలకు ఉపయోగపడే నావిగేషన్‌ సేవలను మరింత పటిష్ఠం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, ప్రతిభ దేశానికి గర్వకారణమని కొనియాడారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ సాధిస్తున్న పురోగతికి ఈ విజయం నిదర్శనమన్నారు. విక్రమ్‌ సారాభాయ్‌, సతీశ్‌ ధావన్‌ వంటి అంతరిక్ష రంగ మార్గదర్శకుల కలలను సాకారం చేసే దిశగా దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్