Off The Record: గుంటూరులో చక్రం తిప్పిన గల్లా మాధవి
Off The Record: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన రాజకీయ ప్రస్థానం.
Off The Record: గుంటూరులో చక్రం తిప్పిన గల్లా మాధవి
Off The Record: గల్లా మాధవి. 2024 ఎన్నికల వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఎన్నికల్లో సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయాలకు ఆమె పూర్తిగా కొత్త. తొలిసారి పోటీలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా వైసీపీ ముఖ్య నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విడదల రజనీపై విజయం సాధించారు గల్లా మాధవి. టీడీపీ నుంచి సీనియర్లు ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాధవి ఎలా నెట్టుకొస్తారనే చర్చ వినిపించేది. అదే విధంగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. బీసీ వర్గానికి చెందిన మాధవి కంటే నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనం ఎక్కువగా సాగుతుందనే చర్చ వినిపించింది. అయితే, ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. రెండేళ్ల కాలంలో మాధవి పరిస్థితి పూర్తిగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యారు.
గుంటూరు పశ్చిమం నియోజకవర్గం.. తొలి నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉంది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే లక్ష్యంతో మాజీ సీఎం జగన్ ఈ నియోజకవర్గం నుంచి బీసీ మహిళా మంత్రి విడదల రజనీని బరిలోకి దించారు. కూటమి వేవ్‌లో రజనీ ఓడిపోక తప్పలేదు. గల్లా మాధవి విజయం సాధించారు. పార్టీ నేతలు.. కూటమి నాయకులు.. చివరకు అధికారుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. ఆ సమయంలో మాధవి రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారనే వాదన కూడా వినిపించింది. ఇక.. పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ర్యాంకుల్లో మాధవి చివరి స్థానంలో నిలిచారు. మాధవి పరిస్థితి చూసి.. నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులు సైతం ఆమెను లెక్క చేయని విధంగా వ్యవహరించారు. అయితే.. తాను నేరుగా సీఎం చంద్రబాబు వద్దే అన్ని విషయాలు చర్చించి, పరిష్కారంతో వస్తానని మాధవి తేల్చి చెప్పారు.
అంతే, ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. హైకమాండ్ ఏం చేస్తే తనకు గుర్తింపు ఇస్తుందో పల్స్ పట్టుకోవటంలో మాధవి సక్సెస్ అయ్యారన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో రీసౌండ్ చేస్తోంది. వరుసగా అదే తరహా నిర్ణయాలతో ముందుకు వెళ్లారామె. అంచనా వేసినట్లుగానే మాధవికి హైకమాండ్ నుంచి ప్రశంసలు అందాయి. దీంతో పార్టీలో దిశా నిర్దేశం చేసే పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు. ఇదే సమయంలో పార్టీ కేడర్.. మరో అంశాన్ని గుర్తు చేస్తున్నారు. మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ దాడి సమయంలో ఎమ్మెల్యే మాధవి వ్యవహార శైలి పైనా వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ఆ ఘటనలో ఎమ్మెల్యేకు గిఫ్ట్‌గా పార్టీ నాయకత్వం కీలక పదవులు అప్పగించిందనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అయితే.. ఈ సారి టీడీపీలో పార్టీ పొలిట్ బ్యూరోలో మండలస్థాయి నేతలకు సైతం అవకాశం కల్పించారు. అందులో భాగంగా బీసీ వర్గానికి చెందిన మాధవికి అవకాశం కల్పించారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిత్యం ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మాధవి.. పార్టీ హైకమాండ్‌ను ఆకట్టుకోగలిగారు. అదే ఇప్పుడు మాధవి సక్సెస్ మంత్రగా మారింది. అదే విధంగా ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకోవటం.. ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవటం అదనపు బలంగా మారింది. ఇక.. నాడు దూరంగా ఉన్న పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇప్పుడు మాధవి వర్గంగా మారిపోయారు. పూర్తిగా అగ్రెసివ్‌గా నియోజకవర్గంలో దూసుకెళ్తున్న గల్లా మాధవి తీరు ఇప్పుడు టీడీపీలో ఆసక్తికరంగా మారుతోంది.
ఇలా ఒక్కో అడుగు వేస్తూ.. ముందుకు వెళ్తున్న మాధవి.. అసలు సిసలు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గుంటూరు పశ్చిమంలో వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడతారా..? ఇక్కడి రాజకీయాల్లో పావుగా మారుతారా ..? అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.




