Burning Topic: ప్రపంచాన్ని వణికిస్తున్న హంటా వైరస్.. ఇది కరోనా కంటే డేంజర్..?

Burning Topic: ప్రపంచాన్ని భయపెడుతున్న మరో మహమ్మారి హంటా వైరస్! ఎంవీ హోండియస్ క్రూయస్ నౌకలో ముగ్గురు మృతి చెందడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన మొదలైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 7:01 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచాన్ని వణికిస్తున్న హంటా వైరస్.. ఇది కరోనా కంటే డేంజర్..?

Burning Topic: ప్రపంచాన్ని తీవ్రంగా అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారిని జనం ఇంకా మరచిపోకముందే మరో వైరస్ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ భయాలకు కారణం అట్లాంటిక్‌ సముద్రం మహాసముద్రంలో ప్రయాణిస్తున్న 'ఎంవీ హోండియస్‌’ అనే క్రూయిజ్‌ నౌక.. అర్జెంటినాలోని ఉషువాయా నుండి అంటార్కిటికాలోని అంటార్కిటిక్ పెనిన్సులావైపుకు ప్రయాణిస్తున్న ఈ పర్యాటక నౌకలో సముద్రపు అలల మధ్య ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణం కాస్తా మృత్యు బాట పట్టింది. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి కొందరి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉంది. 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు ఉన్న ఎంవీ హోండియస్‌‌లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి . దీంతో మరి కొన్ని రోజులు ప్రయాణించాల్సిన ఈ క్రూయిజ్‌ను అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వెర్డే తీరం దగ్గర అత్యవసరంగా నిలిపివేశారు. ప్రయాణీకులందరికీ వైద్య సాయం అందించడం మొదలు పెట్టారు.

ఎంవీ హోండియస్‌ క్రూయిజ్‌ పరిస్థితి ఇంత భయానకంగా మారడానికి కారణం హంటా వైరస్. ఈ నౌకలో ఏప్రిల్‌1 అర్జెంటీనా నుంచి బయలుదేరింది. అయితే 6న ఓ డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యాడు. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి నౌకలోనే ఆయన మరణించాడు. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మన్ మహిళ కూడా న్యుమోనియా లక్షణాలతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నమోదైన 21 రోజుల తర్వాత ప్రయోగశాల పరీక్షల్లో ఇది 'హంటా వైరస్' అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కేప్‌ వర్డే తీరానికి చేరువలో నిలిపిన ఎంవీ హొండియస్‌ ఓ విషాద స్థావరంగా మారింది. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక, నేడు ఒక క్వారంటైన్‌ జైలుగా మారింది. షిప్‌ డాక్టర్‌ మొదలుకొని, సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్‌ నీడలో బందీలయ్యారు.

ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులను కేబిన్లకే పరిమితం చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వైద్యుల బృందం నౌకలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హంటా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ముగ్గురు ప్రయాణికులను నౌక నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం వారిని నెదర్లాండ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు

ఎంవీ హోండియస్‌ క్రూయిజ్‌ నౌక నుండి ముగ్గురు వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్‌కు తరలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రేయేసస్‌ ధ్రువీకరించారు. క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రఖ్యాత పర్యాటక బోటులో ఇలాంటి వైరస్ వ్యాప్తి చెందడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ అమెరికా నుంచి తిరిగి వచ్చి అదే షిప్​లో ప్రయాణించిన ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని, అతనికి చికిత్స కూడా అందిస్తున్నారని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. షిప్‌లో ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి స్విట్జర్లాండ్‌కు తిరిగి వచ్చాడని అధికారులు పేర్కొన్నారు.

ఈ నౌకలోని హంటా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్‌లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, హంటా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వైద్య బృందాలు పరిశోధన చేస్తున్నాయి. ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం ఉండటంతో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలుకలు ఉన్న చోట బ్లీచింగ్ సొల్యూషన్ వాడాలని, వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని కోరారు.

కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన వేరియంట్ల భయం పూర్తిగా మర్చిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి భయం మొదలైంది. ఎంవీ హోండియస్‌ క్రూయిజ్‌ విషాదం నేపథ్యంలో అసలు ఏంటీ హంటా వైరస్ అనే చర్చ మొదలైంది.. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల లాలాజలం, మూత్రం లేదా విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల వ్యర్థాలు ఉన్న చోట గాలిని పీల్చడం వల్ల లేదా కలుషితమైన ప్రదేశాలను తాకడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి వారం నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది. మొదట సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనినే 'హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్' అంటారు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 35 శాతంగా ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రక్తస్రావానికి కూడా దారితీస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, దక్షిణ కొరియాల్లో వేల సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు హంటా వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైరస్‌ను ముందుగా గుర్తించి ఆసుపత్రిలో చేరడం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఎలుకలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఇళ్లను శుభ్రంగా ఉంచడం, ఎలుకల మలమూత్రాలతో సంబంధం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు ఉపయోగించడం అవసరం. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వేరు చేయడం కూడా ముఖ్యమే. మొత్తానికి, హంటా వైరస్ సాధారణ ఫ్లూ లాగా కనిపించినప్పటికీ, అది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story