Jordar News: భారీ వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం

Jordar News: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం! కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు విలవిల.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2026 7:06 AM IST
Jordar News
X

Jordar News: భారీ వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం

Jordar News: మొత్తానికైతే., వర్షాలు దండిగ పడటానికి కార్నమైన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకినయుల్లా ఇయ్యాల. దాంతోని కేరళ తీర ప్రాంతాలల్ల ఇయ్యాల భారీ వర్షాలు పడ్డాయి. ఇంకో వారం రోజుల్లనే రొండు తెలుగు రాష్ట్రాలను ఈ నైరుతి రుతుపవనాలు పలకరిస్తయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నరు. కనీ., ఇప్పట్కే ఆడాడ వర్షాలు దండిగనే పడ్తున్నయి. జనగామల ఈదురు గాలులు, ఉరుములతోని భారీ వర్షం పడ్డదియ్యాల. ఇగీ భారీ వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్ల పోసిన వడ్ల బస్తాలన్ని తడ్శిపోయినయి. అసల్కే వాతావరణం తేడా ఉన్నదని రైతులు ముందస్తుగనే వడ్ల బస్తాల మీద పరదాలు కప్పిర్రుగనీ., వర్షం బొమ్మానంగ పడేటాళ్లకు వడ్లన్ని తడ్శినయని రైతులు బాధవడ్తున్నరు. ఒక్క జనగామల్నే గాదు., తెలంగాణ అంతట గుడ ఇంకా శానా జాగల్ల కొనుగోలు కేంద్రాల్లనే వడ్ల మూలుగుతున్నయి. వర్షాలు శాలయ్యే వరకు గుడ వడ్లు కొనకుంటె పర్శానే ఉంటదని రైతులు బాధవడ్తున్నరు.

ఇగటు కర్నూలు జిల్లా దేవనకొండల గుడ భారీ వర్షం పడేటాళ్లకు డ్రైనేజీ నీళ్లతోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల మొత్తం మునిగిపోయి చెరువు లెక్కన్నే మారిపోయింది. ఒక్క వర్షానికే గిట్లైతే రేపురేపు ఇంకా పెద్ద వానలు కొడ్తె ఇంకా పర్శానే ఉంటదిగావట్టి., అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను ఎంటనే శుభ్రం జెయ్యాల్నని డిమాండ్ జేస్తున్నరు. ఇదిట్లుంటే., ఎల్‌నినో ప్రభావంతోని ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంల సాధారణం కంటే తక్కో వర్షమే పడ్తదని వాతావరణ శాఖ అధికారులు అంచనా ఏస్తున్నరు. ఇగ వర్షాలు పడకుంటె ఇబ్బంది అయితది గావట్టి., రైతులు సుతం సూస్కోని పంటలేస్కోవాల్నని ఎవుసం అధికారులంటున్నరు. ఎక్కో నీళ్లు అవుసరముండే పంటలు కాకుంట తక్కో నీళ్లతోని పండే పంటలు పండియ్యాల్నని అంటున్నరు. సూడాలె మరి వాతావరణ శాఖ అధికారుల అంచనాలు ఎంత వరకు నిజం అయితయనేది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story