Off The Record: గుంటూరు మేయర్ పదవికి భారీ పోటీ!

Off The Record: గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పీఠం కోసం టీడీపీ, వైఎస్సార్సీపీల్లో తీవ్ర పోటీ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Oct 2026 11:12 AM IST
Off The Record
X

Off The Record: గుంటూరు మేయర్ పదవికి భారీ పోటీ!

Off The Record: ఏపీ రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు. ఇక్కడ మేయర్ సీటు కోసం రేసు మొదలైంది. టీడీపీకి కంచు కోటగా చెప్పుకునే ఇక్కడ మేయర్ సీటుకు డిమాండ్ పీక్స్‌లో ఉంది. కూటమిలోని మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రిజర్వేషన్లలో భాగంగా ఓసీ మహిళకు సీటు దక్కనుంది.

ఇందు కోసం టీడీపీ నుంచి పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలు తమ వారిని మహిళా కోటాలో సీటు కోసం లాబీయింగ్ ప్రారంభించారు. జనరల్ కావటంతో పాటుగా స్థానిక సమీకరణాల్లో భాగంగా ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. స్థానిక లెక్కల్లో భాగంగా కమ్మ లేదా కాపు వర్గానికి మేయర్ సీటు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేతలు ఈ రెండు వర్గాలకు చెందిన వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు నుంచి కేంద్ర మంత్రి మొదలు జిల్లాలో అన్ని ప్రధాన పదవులు కమ్మ వర్గానికే దక్కాయి. కాపు వర్గం నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా మాత్రమే ఉన్నారు. దీంతో.. కాపు వర్గానికి మేయర్ సీటు ఇవ్వాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కాగా.. కమ్మ వర్గం నుంచి మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర సతీమణి, మాదల చైతన్య సతీమణి మాదల మీనా రత్న రేసులో ప్రముఖంగా ఉన్నారు.

కాపు వర్గం నుంచి పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ సతీమణి భువనేశ్వరి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ కోడలు రాజకుమారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా స్థానికంగా పేరున్న సిమ్స్ విద్యా సంస్థల అధినేత భరత్ రెడ్డి సతీమణి శిరీష్ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. మేయర్ అభ్యర్థి ఎంపికలో కేంద్ర మంత్రి పెమ్మసాని అభిప్రాయం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇక, వైసీపీ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర రావు సతీమణి వసంత కుమారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసిన తరువాత వైసీపీ తమ అభ్యర్ది పేరు ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 76 వార్డులకు పెరిగిన గుంటూరు కార్పోరేషన్‌లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

దీంతో.. మూడు పార్టీల నుంచి ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల ఆధారంగా మూడు పార్టీల సీట్లు.. అభ్యర్దులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక కావటంతో.. మూడు పార్టీలు కార్పోరేటర్లుగా తమ అభ్యర్ధుల కోసం పని చేస్తూ.. మేయర్ కోసం కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఈనెల నాలుగో వారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు మేయర్ సీటు ఏ సామాజిక వర్గానికి దక్కుతుందీ... ఎవరికి ఇస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ రోజు లేదా రేపు గుంటూరు మేయర్ అభ్యర్దిగా ఏ మహిళ పేరు ఖరారయ్యేది స్పష్టత రానుంది. అప్పటి వరకు ఈ పొలిటికల్ సస్పెన్స్ కంటిన్యూ కావటం ఖాయం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్