Burning Topic: నెతన్యాహు అధికారం కాపాడుకుంటాడా ?
Burning Topic: ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్, హంగ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తదుపరి ప్రభుత్వంపై కొనసాగుతున్న ఉత్కంఠ.
Burning Topic: నెతన్యాహు అధికారం కాపాడుకుంటాడా ?
Burning Topic: ఇజ్రాయెల్ పార్లమెంటుకు జరుగిన ఎన్నికల్లో చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో 77.7 % పోలింగ్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 100 % పోలింగ్ జరిగింది. మొత్తం 73,31,981 మంది అర్హులైన ఓటర్లు ఉండగా, అందులో 5,695,682 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 12,018 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 1999 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం విశేషం.
ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటేసే అవకాశం ఉండగా, జనం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అరబ్ , ఆల్ట్రా-ఆర్థడాక్స్ కమ్యూనిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి 80 వేల మంది వచ్చారు. ఓట్ల లెక్కింపు అధికారికంగా నవంబరు 4వ తేదీన జరగనుంది. అయితే పోలింగ్‌కు సంబంధించిన అంచనాలు ఇప్పటిరకే వచ్చేశాయి.
ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్‌లో హమాస్ దాడి తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. అయితే ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించేలా లేదు, దీనివల్ల దేశం రాజకీయ ప్రతిష్టంభన వైపు వెళ్తోంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్ లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి, ప్రధాని బెంజిమన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికారిక కూటమి గానీ,
మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష కూటమి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల స్పష్టమైన మెజారిటీని సాధించే పరిస్థితి కనిపించడం లేదు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ, ఇతర మిత్ర పక్షాలకు ప్రకారం 55 నుండి 57 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. లికుడ్ పార్టీకి దాదాపు 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవనుంది.
ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషార్ పార్టీకి దాని మిత్ర పక్షాలుకు ప్రకారం 49 నుండి 51 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. యషార్ పార్టీ దాదాపు 21 స్థానాలను సాధించే దిశగా ఉంది. అరబ్ పార్టీలకు 16 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓట్ల లెక్కింపులో అరబ్ పార్టీలకు లభిస్తున్న మద్దతు కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెరూసలేం నగరంలో అరబ్ పార్టీలకు గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. అక్కడ 80 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల లెక్కింపు పూర్తయ్యే సమయానికి, ఉమ్మడి జాబితాకు 11,477 ఓట్లు వచ్చినట్లు సమాచారం.
గత ఎన్నికల్లో ఈ జాబితాకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇది సుమారు 4.5 రెట్లు అధికం. మరోవైపు, సైన్యంలో పనిచేస్తున్న వారిలో 79.9 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే, కొన్ని ప్రధాన నగరాల్లోని పోలింగ్ కేంద్రాల ఫలితాలు ఇంకా పూర్తిగా నమోదు కాకపోవడంతో తుది రాజకీయ చిత్రం మారే అవకాశం ఉంది. తుది లెక్కింపు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరిదనే ఉత్కంఠ కొనసాగనుంది.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరికీ మెజారిటీ దక్కే అవకాశం లేదని తేలడంతో ప్రత్యామ్నాయాలు కనిపిస్తుననాయి. మొదటి అవకాశంగా పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. రెండోది.. చిన్న పార్టీలతో కలిసి అధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇందులో అరబ్ పార్టీలు అధ్యక్ష అభ్యర్థిని సూచిస్తాయి. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యత లేకన్నా తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇది చారిత్రక అవకాశమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు బలమైన, జాతీయవాద ప్రభుత్వమే అవసరమని స్పష్టం చేశారు. అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశ భద్రతకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కొన్ని అరబ్ పార్టీలు హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయని, ఇజ్రాయెల్ సైనికులను యుద్ధ నేరగాళ్లుగా అభివర్ణిస్తున్నాయని ఆరోపించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నెతన్యాహూ అద్భుతమైన యోధుడు అని ట్రంప్ కొనియాడారు. ఇరాన్‌పై ఉమ్మడి పోరాటాన్ని పూర్తి చేయడానికి నెతన్యాహుకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
నెతన్యాహు కూటమి వెనుకబడి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ, ఓట్ల లెక్కింపులో ఆయన కూటమి ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచడంపై ట్రంప్ స్పందిస్తూ.. తన మద్దతు ప్రకటన వల్లే మొత్తం పరిస్థితి నెతన్యాహుకు అనుకూలంగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు ట్రంప్ ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. నెతన్యాహు తదుపరి ప్రభుత్వంలో ఇట్మార్ బెన్ గ్విర్, బహుశా బెజలెల్ స్మోట్రిచ్లకు చోటు కల్పించకూడదని ట్రంప్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. సౌదీ అరేబియా సహా కొన్ని అరబ్ దేశాలు నెతన్యాహు ప్రధానిగా కొనసాగడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ ఇరాన్ ముప్పును సంయుక్తంగా ఎదుర్కోవడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వాడుకున్నారు. నెతన్యాహు కూడా ట్రంప్ కంటే స్నేహపూర్వక అమెరికా అధ్యక్షుడు మరొకరు ఉండరని, ఇరాన్ ముప్పును పూర్తిగా తుడిచిపెట్టడానికి ట్రంప్ హయాంలో తమకు చారిత్రాత్మక అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పుకున్నారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ అంతర్గత ఎన్నికల్లో ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నెతన్యాహును గెలిపించడం ద్వారా అబ్రహం ఒప్పందాల విస్తరణను, ఇరాన్‌పై ఉమ్మడి సైనిక వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. మొత్తంగా, నెతన్యాహు ఓటమి యుద్ధం తీవ్రత పెరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చే తప్ప, శాశ్వత శాంతికి హామీ ఇవ్వదు. ట్రంప్ రాజీకి సిద్ధపడతారా, ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుంది అనే అంశాలే ప్రాంతీయ భద్రత, చమురు మార్కెట్ల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
హమాస్ నేతృత్వంలో 2023 అక్టోబర్ 7న జరిగిన దాడి, ఆ తర్వాత గాజా, లెబనాన్, ఇరాన్లలో చోటుచేసుకున్న యుద్ధాల అనంతరం ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి జాతీయ ఎన్నికలు ఇవి. ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలకు తన నాయకత్వమే అమెరికా మద్దతును సాధించగలదని నెతన్యాహు ప్రచారం చేశారు.
అమెరికా, ఇరాన్ మధ్య ఆంక్షలు, చమురు ఎగుమతులు, హార్ముజ్ జలసంధి అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, పెద్దస్థాయి పోరాటం కొన్ని నెలలుగా నిలిచిపోయింది. ఆయన నెతన్యాహు ప్రభుత్వం తిరిగి ఏర్పడక పోతే ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గేందుకు, దౌత్య చర్చలకు అవకాశాలు పెరిగేందుకు మార్గం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైఖరి పూర్తిగా మారిపోతుందని చెప్పలేం. ప్రతిపక్ష నేత గాది ఐసెన్‌కోట్ అధికారంలోకి వచ్చినా, ఇరాన్ సైనిక సామర్థ్యాలను అడ్డుకోవడం, దాని అణు కార్యక్రమంపై ఒత్తిడి కొనసాగించడం వంటి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
కాగా నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న గాది ఐసెన్‌కోట్ గతంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతిగా పనిచేశారు. జాతీయ భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతమైన ప్రత్యామ్నాయంగా తనను తాను ఆయన పరిచయం చేసుకున్నారు. ట్రంప్‌ను ఇజ్రాయెల్‌కు మిత్రుడిగా అభివర్ణిస్తూ, తాను ఎన్నికైతే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
నెతన్యాహు విధానాలపై ఐసెన్‌కోట్ విమర్శలు ప్రధానంగా ఆయన వ్యవహారశైలి, ఎన్నికల ప్రయోజనాల కోసం ఇరాన్ ముప్పును ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై కేంద్రీకృతమయ్యాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ భద్రతా లక్ష్యాలను వదులుకుంటానని ఆయన హామీ ఇవ్వలేదు. అందువల్ల, ఐసెన్‌కోట్ ప్రభుత్వం ఏర్పడినా ఇరాన్ సైనిక సామర్థ్యాలపై ఒత్తిడి, అణు కార్యక్రమానికి వ్యతిరేకత కొనసాగవచ్చు. మార్పు ప్రధానంగా సైనిక చర్యలను ఎప్పుడు, ఎలా చేపట్టాలనే అంశాల్లో ఉండవచ్చు.




