Burning Topic: అస్సాంలో హిమంత 'మామా' మేజిక్: బీజేపీ క్లీన్ స్వీప్.. రెండోసారి సీఎంగా బిశ్వ శర్మ రికార్డ్!
Burning Topic: అస్సాంలో బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా, ఆయన రెండోసారి సీఎంగా రికార్డు సృష్టించారు.
Burning Topic: అస్సాంలో హిమంత 'మామా' మేజిక్: బీజేపీ క్లీన్ స్వీప్.. రెండోసారి సీఎంగా బిశ్వ శర్మ రికార్డ్!
Burning Topic: అస్సాం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించింది బీజేపీ. మొత్తం 126 స్థానాలకుగానూ ఈ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో 82 సీట్లను ఒక్క బీజేపీయే గెల్చుకుంది. బీజేపీ మిత్రపక్షాలైన అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ లకు చెరో 10 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు అత్యంత అవమానకరంగా 19 సీట్లు మాత్రమే రాగా ఏఐయూడీఎఫ్ 2 సీట్లు, రైజోర్ దళ్ 2 సీట్లు, టీఎంసీ 1 సీటును గెల్చుకున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ విజయంలో అత్యంత కీలక పాత్ర హిమంత బిశ్వ శర్మదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి విజయానికి కారణమైన హిమంత బిశ్వ శర్మ రెండోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సాధారణంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిగా విజయం సాధించిన పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ అధికంగా ఉంటుంది. కానీ హిమంత బిశ్వ శర్మ అస్సాంకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం నల్లేరుపై నడకగానే సాగింది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఆయన్నే తమ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకే వైపే మొగ్గు చూపారు. ఇందుకు కారణం అస్సాం ప్రజల్లో హిమంత బిశ్వ శర్మకు దక్కిన ఆదరణే కారణం. బీజేపీ అధిష్టానం కూడా హిమంతవైపే మొగ్గు చూపింది. దీంతో కాంగ్రెసేతర పార్టీ తరఫున వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలి నేతగా హిమంత రికార్డును సాధించారు.
అస్సాం భూమి, సంస్కృతి అక్కడి మూలవాసులకే చెందాలనే నినాదాన్ని హిమంత బలంగా వినిపించారు. 2023లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అసోం అసెంబ్లీలో దాదాపు 90 నుంచి 100 స్థానాలను స్థానిక అస్సామీల చేతుల్లోనే ఉండేలా భౌగోళికంగా మార్చారు. తీవ్రవాద గ్రూపులతో ప్రభుత్వం శాంతి ఒప్పందాలను కుదుర్చుకుని, దశాబ్దాలుగా ఉన్న అంతర్గత ఘర్షణలకు స్వస్తి పలికింది. ఈ అంశం కొండప్రాంతాలు, గిరిజన బెల్ట్‌లో ఆయన గ్రాఫ్‌ను విపరీతంగా పెంచింది. ముఖ్యంగాబంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వచ్చే అక్రమ వలసదారుల కారణంగా రాష్ట్ర జనాభా సమతుల్యత దెబ్బతింటోందని నిరంతరం హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు, సత్రాల భూములను ఆక్రమించుకున్న వారిని తొలగించడానికి పెద్ద ఎత్తున డ్రైవ్స్‌ను నిర్వహించారు
అస్సాం యువత, విద్యార్థులు హిమంత బిశ్వ శర్మను ఆత్మీయంగా మామా అని పిలుచుకుంటారు. బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడే తీరు, విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించే గుణం హిమంతకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. వారితో సరదాగా ముచ్చటిస్తూ ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కుటుంబ సభ్యునిలా కనిపిస్తారు. తన ప్రసంగాల్లోనూ తరచుగా విద్యార్థులను ఉద్దేశించి నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అని సంబోధిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి 'మామా' అనే గుర్తింపు లభించింది. హిమంత ఎలాంటి లంచాలు, అవినీతి లేకుండా పూర్తిగా లక్ష మంది స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటర్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.
ఓరునోదోయ్ అనేది అసోం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకం. దీని ద్వారా దాదాపు 30 లక్షలకుపైగా పేద కుటుంబాల మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెలా రూ.1,250 నుంచి రూ.1,400 నేరుగా హిమంత సర్కారు జమ చేసింది. బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపడం, మైక్రో ఫైనాన్స్ రుణాల నుంచి విముక్తి కల్పించడం ద్వారా మహిళల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చింది. ఈ అంశాలు ఎన్నికల్లో సైలెంట్ ఓట్ బ్యాంక్‌గా మారి బీజేపీకి భారీ విజయాన్ని అందించాయి.రాష్ట్రంలో దాదాపు 19 లక్షల మంది గ్రామీణ మహిళలు తీసుకున్న మైక్రోఫైనాన్స్ రుణాలను హిమంత ప్రభుత్వం మాఫీ చేసి, వారిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించింది. ఈ అంశం మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించింది.
హిమంత బిశ్వ ప్రభుత్వం రాష్ట్రంలోని నదీ తీర ప్రాంతాలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై పలు మల్టీ లేన్ వంతెనలను నిర్మించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు 100 శాతం రోడ్ కనెక్టివిటీని అందించారు. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో కొత్త మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ కేర్ ఆస్పత్రులను రాష్ట్రంలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌కు అదనంగా, రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత వైద్య బీమాను వర్తింపజేసేందుకు ఆయుష్మాన్ అసోంను హిమంత అమలుచేశారు.మిషన్ బసుంధర ద్వారా భూమి వివాదాలు, భూమి రికార్డుల డిజిటలైజేషన్, యాజమాన్య హక్కుల బదిలీ వంటి రెవెన్యూ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేశారు. ఆయా వ్యవహారాల్లో అవినీతిని అరికట్టారు.
అస్సాంతో మాత్రమే కాకుండా, మొత్తం ఈశాన్య భారతంలో బీజేపీని బలోపేతం చేయడానికి కేంద్ర నాయకత్వం హిమంత బిశ్వను ప్రధాన వ్యూహకర్తగా చూస్తోంది. నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్‌గా ఉంటూ పొరుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషిని పార్టీ పెద్దలు గుర్తించారు. అందుకే వరుసగా రెండోసారి అసోం సీఎంగా పనిచేసే అవకాశాన్ని హిమంతకు వారు కల్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజన, నిబంధనల మార్పుల విషయంలో దిల్లీ పెద్దలు ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ బలమైన మద్దతు వల్లే రాష్ట్రంలో హిమంత సాహసోపేతమైన సామాజిక, రాజకీయ నిర్ణయాలను తీసుకోగలిగారు.




