Jordar News: వీడియో తియ్యకపోతే.. ఎవ్వరు నమ్మరు
Jordar News: ఉత్తరప్రదేశ్‌లో కురిసిన భారీ గాలివాన, దుమ్ము దుమారం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.
Jordar News: వీడియో తియ్యకపోతే.. ఎవ్వరు నమ్మరు
Jordar News: ఉత్తర్ ప్రదేశ్ దిక్కు 19 జిల్లాలను గాలివాన అడివెట్టి సుడివెట్టిందుల్లా. మూన్నాలుగు రోజుల సుంది ఇడ్వకుంట పిడుగులు, గాలిదుమారం, వాన పగవట్టినట్టు జెయ్యంగ 127 మంది జీవిడ్శిర్రు. వందల పాడిపశువులు ఆగమైనయ్. ఏడికాడ శెట్లు నేలకు రాలినయ్. వంద దాంక ఇండ్లు ఇచ్చుకపోయ్నయ్. బరేలీ కాడ సూడుర్రి రేకుల శెడ్డు గాలిల ఎట్లలేశిందో.
పాపంపాడుగాను.. హాలీవుడ్ సిన్మాల హీరోలెక్కనే గాల్లె ఎగ్రిండు గదా అన్న. అటు దిక్కుండే నన్నేమియా అనే గీ అన్న. ఆయ్న ఇంటిముంగటవెట్టిన రేకుల షెడ్డు గాలికి ఎగ్రిపోవద్దని తాడు కడ్తున్నడట. ఇగ అంతల్నే గాలి ఇంకింత రువ్వడిగచ్చి రేకుల షెడ్డును అమాంతం లేపింది. ఈ అన్న సుతం తాడును అట్లనే పట్టుకొని గాలిలకు 50 ఫీట్ల ఎత్తుకు ఎగ్రి, 3వందల మీటర్ల దూరంలున్న మక్కశేన్ల వడ్డడు. ఈ రియల్ స్టంట్ వీడియోలల్ల సూశ్నోల్లు.. ముందుగాల ఏఐ మాయనా అని మస్తు పర్శానైర్రు. అటెంక అసలు ముచ్చట తెల్శి నోర్లు తెర్శిర్రు. ఈనె నశివ మంచిగుండి పానాలకు పెద్దగ ప్రమాదం ఏంకాలేదు. రెక్క శిన్నగ ఇర్గినట్టైందట. ఎంబటే దావఖాన్కు ఏస్కపోయిర్రు సుట్టుముట్టున్నోల్లు. ఇగట్లనే గాలిదుమారానికి శెట్లు కూలి కార్లు, బండ్లు మీద వడ్తె తుక్కుతుక్కైనయ్.
పాత గోడలు కూలి సుతం శానా మందికే దెబ్బలు తాకినయ్. తొవ్వల మీద శెట్లువడి అచ్చిపొచ్చెయెటోల్లకు మస్తు తిప్పలైనయ్. కరెంటు స్థంభాలు కూలి, ఊర్లు శీకటైనయ్. ఇది ఇట్లుంటే.. సీఎం యోగి సారు.. ఎంబటే కంట్రోల్ రూం తెర్శి, పబ్లిక్ తిప్పలు తీర్వాల్నని అధికార్లకు ఆడరేశిండు. జీవిడ్శినోల్లకు పరిహారం ఇయ్యాల్నని హుకూం జారీ జేశిండు. దెబ్బలు తాకినోల్లకు మంచిగ వైద్యం అందియాల్నన్నడు. తొవ్వలు కరావైన కాడ, శెట్లు కూలిన కాడ, స్థంభాలు ఇర్గిన కాడ రిపేర్లు గిపేర్లు ఎంబటే జేపియ్యాల్నని ఆడర్లేశిండు. కనీ.. ఏం కలికాలమో ఏందోనుల్లా. ఎప్పుడు వానలు వడ్తయో.. ఎప్పుడు ఎండలు కొడ్తయో.. ఎప్పుడు సలివెడ్తదో తెల్వకుంటున్నది. కలియుగం మన్శులకు తగ్గట్టే.. కాలాలు సుతం బగ్గ కలుషితమైనట్టే కొడ్తున్నదుల్లా ఇసొంటియ్ సూస్తుంటె.




