Burning Topic: హంగరీ రాజకీయాల్లో సంచలనం.. విక్టర్ పై యువనేత గెలుపు
Burning Topic:
Burning Topic: హంగరీ రాజకీయాల్లో సంచలనం.. విక్టర్ పై యువనేత గెలుపు
Burning Topic: యూరోప్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. హంగేరీలో 16 ఏళ్లుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. ఏప్రిల్ 12-13 తేదీలలో జరిగిన హంగేరీ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార ఫిడెజ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ‘తిస్జా’ పార్టీ తిరుగలేని ప్రభంజనం సృష్టించింది. 199 స్థానాలున్న పార్లమెంట్‌లో టిస్జా పార్టీ 53.72% ఓట్లతో 138 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఫిడెజ్ పార్టీ 37.8% ఓట్లతో 55 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. అవర్ హోంల్యాండ్ పార్టీకి కేవలం ఆరు సీట్లు దక్కాయి. దీంతో ప్రధాన మంత్రి పదవి నుంచి విక్టర్ ఓర్బన్ తప్పుకోకున్నారు. హంగేరీ నూతన ప్రధానమంత్రిగా తిస్జా పార్టీకి చెందిన యువ నాయకుడు పీటర్ మాగ్యార్ చేపట్టనున్నారు. హంగేరీ ఎన్నికల ఫలితాలు కేవలం ఈ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
విక్టర్ ఓటమి వార్త తెలిసి లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి సంబరాలుచేసుకున్నారు. తెల్లవారుజాముదాకా సంబరాలు కొనసాగాయి. రాజధాని బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది ఒడ్డున పార్లమెంట్ ప్రాంగణంలో వేలాది మంది అభిమానుల హర్షద్వానాల మధ్య విజయాన్ని ప్రకటించుకున్నారు పీటర్ మాగ్యార్. ఈ రాత్రి అబద్ధాలపై నిజం గెలిచింది అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు పీటర్. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసి, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో నూతన శకం ఆరంభమైందన్నారు. పీటర్ మాగ్యార్ గతంలో ఫిడెజ్ పార్టీలోనే ఉన్నారు. బ్రస్సెల్స్‌లో దౌత్యవేత్తగా పని చేశారు. అయితే లైంగిక వేధింపుల కేసును కప్పిపుచ్చిన వ్యక్తికి ఓర్బన్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2024లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే ఏడాది తిస్జా అనే కొత్త రాజకీయా పార్టీని ప్రారంభించి ప్రజల మద్దతు చూరగొన్నారు.
హంగేరీలో తిరుగులేని నాయకుడిగా విక్టర్ ఓర్బన్‌కు పేరుంది. అయితే దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. విక్టర్ ఓర్బన్ తన బంధువులు, అనుచరులు, మిత్రులకు కీలక పదవులు అప్పగించి పాలనను అనుకూలంగా మార్చుకున్నారు. అనుకూలురైన వారికి జడ్జీలుగా పదవులు కట్టబెట్టారు. కుదేలైన ఆర్థికవ్యవస్థ, అప్రజాస్వామిక విధానాలతో దేశం పరువును మంటగలిపారు. తర్వాతి పాలకులు తన పరిపాలనా నిర్ణయాలను మార్చేయకుండా రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ ధర్మాసనం అధికారాలను పరిమితంచేశారు. మీడియాపై ఆంక్షలు విధించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా అడ్డుకున్నారు. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరి అయిందనే భావన హంగేరీ ప్రజల్లో నెలకొంది. తన ఓటమి అత్యంత బాధాకరమైనప్పటికీ స్పష్టమైనదని అంగీకరించిన ఓర్బన్.. పీటర్ మాగ్యార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది అని తెలిపారు విక్టర్.
పీటర్ మాగ్యార్ ప్రధానమంత్రిగా రావడంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి దాకా ప్రధానమంత్రిగా ఉన్న విక్టర్ ఓర్బన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడిగా పేరుంది. ఈ క్రమంలో యుద్ధంలో రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌కు భారీస్థాయిలో సైనిక సాయం చేయాలని నాటో సభ్య దేశాలు భావించిన ప్రతిసారీ విక్టర్ తన వీటో అధికారంతో ఏకాభిప్రాయానికి మోకాలడ్డి విమర్శలపాలయ్యారు. గతంలో ఉక్రెయిన్‌కు అందాల్సిన 90 బిలియన్ యూరోల రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్‌లో ప్రతికూల వైఖరి అనుసరించారు. తాజా ఎన్నికల్లో పీటర్ మాగ్యార్ విజయంతో ఈయూలో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. కాగా పశ్చిమాసియా యుద్ధంలో తనతో కలిసిరాని నాటో దేశాలపై గుర్రుగా ఉన్న ట్రంప్‌తోనూ విక్టర్‌కు సత్సంబంధాలున్నాయి. అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్ తరఫున సైతం విక్టర్ ప్రచారంచేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
హంగేరీలో విక్టర్ ఓర్టన్ పాలన ముగియడాన్ని పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. ఈ ఎన్నికల ఫలితం హంగేరీకే కాకుండా యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. ఇంతకాలం ఉక్రెయిన్‌కు సాయం చేయడాన్ని అడ్డుకుంటూ వచ్చిన విక్టర్ ఓర్బన్ ఓటమి ఈయూ దేశాలకు ఆనందాన్ని కలిపిస్తోంది. ఉక్రెయిన్‌కు ఇవ్వాల్సిన 90 బిలియన్ యూరోల రుణానికి ఇప్పుడు మార్గం సుగమం కానుంది. అలాగే, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన కారణంగా హంగేరీకి యూరోపియన్ యూనియన్ నిలిపివేసిన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. విక్టర్ ఓర్టన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడం ద్వారా హంగేరీతో పాటు యూరోప్ దేశాలరూ ఆకట్టుకున్నారు పీటర్ మాగ్యార్.
దేశంలో అవినీతిని అంతమొందిస్తానని, యూరో కరెన్సీని తీసుకొస్తానని ఎన్నికల్లో వాగ్దానంచేశారు. ఎన్నికల్లో గెల్చిన పీటర్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.




