Burning Topic: ఇసాయిస్ హరికేన్ దెబ్బకు అమెరికా అతలాకుతలం
Burning Topic: అమెరికా దక్షిణ తీరాన్ని 'ఇసాయాస్' తుఫాను కేటగిరీ-2 తీవ్రతతో తాకింది. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది
Burning Topic: ఇసాయిస్ హరికేన్ దెబ్బకు అమెరికా అతలాకుతలం
Burning Topic: భారీ ప్రకృతి బీభత్సానికి అగ్ర రాజ్యం అతలాకుతలం అయింది. 2026 అట్లాంటిక్ తుఫానుల సీజన్‌లో నమోదైన మొదటి తుపాన్ ఇయాసస్ దక్షిణ తీరాన్ని బలంగా తాకింది. కేటగిరీ -2 తీవ్రతతో ఫ్లోరిడాలోని డెస్టిన్ సమీపంలో గల్ఫ్ తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు సుమారు 168 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక చోట్ల చెట్లు నేల కూలాయి. బలమైన గాలులకు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. వేలాది ఇళ్లు కూలిపోయాయి. ఇయాసస్ తుఫాను కారణంగా ఫ్లోరిడా, అలబామా రాష్ట్రాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తీర ప్రాంతాల్లో సుమారు 10 ఇంచుల వరకు భారీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో కార్లు ఇతర వాహనాలు మునిగిపోయి కనిపించాయి. తుఫాను తాకిడికి భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వైర్లు విరిగిపడటంతో ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో సుమారు 6.7 లక్షల మంది విద్యుత్ సరఫరా కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. తుపాను ప్రభావం మొదలైన తొలి గంటల్లో దాదాపు 10లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు. తాగు నీటికి కూడా కొరత ఏర్పడింది. పనామా సిటీ బీచ్‌లో ఎత్తైన భవనం దాదాపు కూలిపోయింది. డెస్టిన్‌లో పడవల షెడ్ ధ్వంసమైంది. పెన్సకోలా విమానాశ్రయం దెబ్బతినడంతో వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేశారు.
ఇసాయాస్ తుఫాను క్రమంగా బలహీనపడినా.. వరదలు, టోర్నడోల ముప్పు మాత్రం వెంటాడుతోంది. టెన్నస్సీ వ్యాలీ, కరోలినా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమా దం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందస్తు చర్యల్లో భాగంగా అలబామా, ఫ్లోరిడా, జార్జియా రాష్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇసాయాస్ తుఫాను బీభత్సాన్ని గుర్తించిన ఫెడరల్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ సహాయక చర్యల కోసం సుమారు 50 మిలియన్ డాలర్ల సాయం కోసం ఫెడరల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌లను ఆమోదించారు. అత్యవసర ఉత్తర్వుల ప్రకారం, విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా చేపట్టే అత్యవసర రక్షణ చర్యల ఖర్చులో 75 శాతం నిధులను ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 25 శాతాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
కాగా ఇసాయాస్ అనే పేరు అమెరికాకు కొత్తేమీ కాదు. ఇదే పేరుతో 2022లో వచ్చిన తుఫాను అత్యంత భయంకరమైనదిగా చెబుతారు. అప్పట్లో అది నాలుగో కేటగిరీ స్థాయిలో ఫ్లోరిడాను తాకి భారీ విధ్వంసం సృష్టించింది. దాని వల్ల జరిగిన నష్టం సుమారు 119.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఫోర్ట్ మైయర్స్ బీచ్ ప్రాంతంలో సముద్రపు అలల ఉద్ధృతి సుమారు 15 అడుగుల ఎత్తు వరకు చేరింది. ఇక 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అమెరికా చరిత్రలో అత్యంత వినాశకరమైన తుపానుల్లో ఒకటిగా నిలిచింది. మిసిసిపీ తీరంలో సముద్రపు అలల ఉద్ధృతి సాధారణ అలల స్థాయికి మించి సుమారు 24 అడుగులకు చేరగా, అమెరికాలో నమోదైన అత్యధిక తుపాను అలల ఉద్ధృతి రికార్డుల్లో కత్రినా 25 నుంచి 28 అడుగుల స్థాయితో నిలిచింది. ఆ ఏడాది బలమైన ఎల్ నినో ప్రభావం కారణంగా తుఫానుల ఉధృతి చాలా తక్కువగా ఉంది. అయితే అట్లాంటిక్ మహాసముద్రంలో ఇప్పటివరకు 9 ఉష్ణమండల తుఫానులు ఏర్పడ్డాయి.
తాజా ఇసాయాస్ తుఫాను గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా దూసుకురావడంతో చమురు, సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోయింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా చమురు కంపెనీలు తమ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. దీనివల్ల షెల్, చెవ్రాన్ సంస్థల్లో రోజువారీ చమురు ఉత్పత్తిలో గరిష్టంగా 72% వరకు తాత్కాలికంగా నిలిచిపోయింది. అలాగే 59% సహజ వాయువు ఉత్పత్తి కూడా ఆగింది. ఇంధన సరఫరాలో అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి గరిష్ఠంగా 40 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అత్యవసర మార్పిడి పద్ధతిలో అందించేందుకు ఇంధన శాఖ అనుమతించింది. మిస్సిసిపి, అలబామా పరిసరాల్లోని కొన్ని చమురు శుద్ధి కర్మాగారాలు ఈ తుఫాను మార్గంలో ఉన్నప్పటికీ, తుఫాను గమనం కొద్దిగా తూర్పు వైపునకు మారడంతో లూసియానా వంటి ప్రధాన రిఫైనరీ కేంద్రాలకు పెద్ద ప్రమాదం తప్పింది.




