Off The Record: ప్రాణాల కోసం పారిపోతున్న బంగ్లా మూకలు

Off The Record: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారుల పలాయనం! సువేందు అధికారి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల అక్రమంగా వచ్చిన వారు తమ దేశానికి వెనక్కి వెళ్లిపోతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 May 2026 6:43 AM IST
Off The Record
X

Off The Record: ప్రాణాల కోసం పారిపోతున్న బంగ్లా మూకలు

Off The Record: తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్లుదారులను తిప్పిపంపేస్తామని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది బీజేపీ. మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నారని చేసిన ప్రచారం పెద్ద ప్రభావాన్నే చూపింది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ తామిచ్చిన వాగ్దానాన్ని ఆచరణలో చూపించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. అక్రమ వలసదారుల ఎరివేతకు “డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్”.. విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. దీంతో అక్రమ వలసదార్లలో అందోళన మొదలైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టక ముందే తిరిగి వెళ్లిపోవడం మంచిదని భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర పెద్ద సందడి కనిపిస్తోంది. హకీంపూర్ చెక్‌పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్‌ అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

హకీంపూర్​ చెక్​పోస్టు దగ్గర కొద్ది రోజులుగా వందలాది బంగ్లాదేశీయులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు గుమిగూడారు. వారు తమ వెంట లగేజీ ట్రాలీలు, వంట పాత్రలు, బట్టల మూటలను తెచ్చుకున్నారు. ఏం జరుగుతుందో అనే భయం వారి మొఖాల్లో కనిపిస్తోంది. వీరంతా ఇన్నాళ్లూ కోల్‌కతాతోపాటు పలు ప్రాంతాల్లో తాపీ పనులు, కూలీ పనులు, ఇళ్లలో పనులు చేస్తూ బతుకుతున్నారు. కొత్త ప్రభుత్వం తమను ఇక్కడ ఉండనివ్వనప్పుడు, బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడం తప్ప మాకు వేరే దారి లేదు వారంటున్నారు. గతేడాది సర్ ప్రక్రియ సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.తమ దగ్గర ఉన్న నకిలీ ఆధార్​ కార్డులు, సర్టిఫికెట్లు దొరికిపోతాయనే భయంతో చాలా మంది పరిహద్దుకు వచ్చారు. మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వారిలో చెదిరిపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ వలసదారులు మళ్లీ మూటలు కట్టుకొని వెనక్కి పోవడానికి సిద్ధమవుతున్నారు.

అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్‌లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరివేయడానికి జిల్లాల వారీగా జైళ్ల లాంటి 'హోల్డింగ్​ సెంటర్లు' ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను పట్టుకొని, వారి వివరాలు తేలేదాకా ఉంచుతారు. బంగ్లాదేశీయులు ఎలా వచ్చారో, అలాగే వెళ్లిపోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. వారిని ఇంటి అల్లుళ్లలా జైళ్లలో పెట్టి తిండిపెట్టడం వల్ల ప్రజాధం వృధా అని వ్యాఖ్యానించారు. నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌ ప్రభుత్వం సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసింది. హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. వీరిలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీరంతా గుంపులుగా కూర్చొని బంగ్లాదేశ్​లోకి వెళ్లడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఈ అక్రమ వలసల అంశం మొదలి నుంచీ చర్చనీయాంశంగానే ఉంది. ఈ విషయంలో బీజేపీ, తృణమూల్ పార్టీల మధ్య నిరంతరం వాగ్వాదం జరిగేది. మనం అక్రమ వలసదారులను వెతకాల్సిన పనిలేదు. నిబంధనలు కఠినంగా మఅలు చేస్తే, వారే స్వయంగా వెనక్కి వెళ్లిపోతారు" అని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు అన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్‌గా మారాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జనాభా నిష్పత్తిలో మార్పులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యతో దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశ జనగణన కమిషనర్‌తో పాటు నిపుణులకు స్థానం కల్పించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కమిటీలో దేశ సెన్సస్ కమిషనర్​తోపాటు మాజీ ఐఏఎస్​ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త శామికా రవి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోంశాఖలోని జాయింట్​ సెక్రటరీ (ఫారనర్స్-I) ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా మార్పులపై సమగ్రమైన అంచనా వేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

దేశంలో చట్టవిరుద్ధమైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దేశ సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతిభద్రతకు ముప్పుగా మారాయన్నారు. విభిన్న సామాజిక, మత వర్గాల మధ్య అసాధారణంగా మారుతున్న జనాభా నిష్పత్తిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వానికి సూచిస్తుందని స్పష్టం చేశారు. చొరబడిన ప్రతీ ఒక్క అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం దాటించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దుల్లో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత BSFపై ఉందన్నారు. త్రిపుర, అసోం, బెంగాల్ ప్రభుత్వాలు అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తుచేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగాలతో కలిసి పనిచేయాలని సూచించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story