Burning Topic: ఇండియా కూటమికి బిగ్ షాక్?

Burning Topic: ఇండియా కూటమిలో ఊహించని పరిణామాలు! ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే వైదొలగడం, టీఎంసీలో 20 మంది ఎంపీల తిరుగుబాటుతో విపక్షాల ఐక్యత గాలిలో దీపంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Jun 2026 6:52 AM IST
Burning Topic
X

Burning Topic: ఇండియా కూటమికి బిగ్ షాక్?

Burning Topic: దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ మరోసారి సమావేశమైంది ఇండీ అలయన్స్. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, టీఎంసీ, శివసేన యూబీటీ, ఎన్సీపీ పవార్ వర్గం, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ముస్లింలీగ్, ఆర్‌ఎస్‌పీ, వీసీకే, ఎండీఎంకే తదితర పార్టీల అధినేతలు ఈ భేటీకి వచ్చారు. మోదీ ప్రభుత్వ పాలనలో దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరంపై ప్రధానగా చర్చించారు. జ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని ఈ సమావేశం నిర్ణయించింది. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని, రాబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో జరుగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారి భేటీ అయిన విపక్ష ఇండీ కూటమిలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరైంది. కాగా ఇప్పుడు తాము ఈ కూటమితో తెగతెంపులు చేసుకున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్​ అధికారికంగా ధ్రువీకరించారు. "ఆప్ ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని మేము ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశాం. అందుకే ఈ మీటింగ్​కు హాజరవ్వలేదు" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇండియా కూటమిలో తాము భాగం కాదని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇచ్చి, మాకు తీవ్రమైన నమ్మక ద్రోహం చేసింది. అందువల్లే మేము కూటమి నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపింది. మరోవైపు 2029 ఎన్నికల కోసం కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించాలని శివసేన యూబీటీ తరపున సంజయ్ రౌత్ షరతు పెట్టారు.

ఓవైపు కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ వేదికగా ఇండీ కూటమి సమావేశం జరుగుతుంటే మరోవైపు ఢిల్లీలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్న పోస్టర్లు కనిపించడగం కలకలం రేపింది. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ పోస్టర్లలో కనిపించాయి. రాహుల్‌ గాంధీకి నిలకడ లేదంటూ శరద్‌ పవార్‌ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు వస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.

చాలా కాలంగా ఇండీ కూటమి దూరంగా ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇండీ కూటమి సమావేశంలో ఉన్న సమయంలోనే టీఎంసీలో మరో సంక్షోభం ముంచుకొచ్చింది. లోక్‌సభలోని 20మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఎంపీ కకోలీ ఘోష్‌ నేతృత్వంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా తాను.. తోటి ఎంపీలతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఘోష్‌ తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. వారు ఎన్నుకున్న ప్రభుత్వంతోనే కలిసి పని చేయాలని తమ బృందం నిర్ణయించుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ చీలికతో లోక్‌సభలో మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌కు కేవలం ఎనిమిదిమంది సభ్యులే మిగిలారు. ఇప్పటికే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మందికి టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం తెలిసిందే.

మరోవైపు టీఎంసీకి చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను సమర్పించగా, ఆయన దానిని వెంటనే ఆమోదించారు. పార్టీలో అవినీతి అంశాలపై బహిరంగంగా మాట్లాడినందుకు తనను పక్కన పెట్టారని సుఖేందు శేఖర్ రాయ్ ఆరోపించారు. బెంగాల్‌లో గత 15 ఏళ్ల పాలనలో శాంతిభద్రతల క్షీణత, నిరుద్యోగం పెరిగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు కోయల్ మల్లిక్ కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బలమైన పట్టున్న ఈ ఇద్దరు నేతలు తప్పుకోవాలని నిర్ణయించుకోవడం మమతా బెనర్జీకి పెద్ద తలనొప్పిగా మారింది రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్‌కు 13 మంది సభ్యుల బలం ఉంది. సభలో టీఎంసీ ఎంపీల సంఖ్య 11కు పడిపోనుంది.

కాగా టీఎంసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎంపీలు కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నాయకుడు భూపేందర్‌ యాదవ్‌ నివాసంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారితో భేటీ అయ్యారు. ఎంపీ నిధులను ఉపయోగించుకోవడానికి మమత అడ్డుచెప్పడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలుచేయకపోవడంతో ప్రజలకు తామేమీ చేయలేకపోతున్నామని ఎంపీలు ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ముందు అలాంటి అడ్డంకులన్నీ తొలగిస్తానని వారికి సువేందు అధికారి హామీ ఇచ్చారు. కాగా తృణమూల్‌ టికెట్ మీద గెలిచి ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న తోటీ ఎంపీలపై మహువా మొయిత్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసిన బీజేపీ టికెట్ మీద గెలవాలని ఛాలెంజ్ చేశారు. మరో ఎంపీ, మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను కూడా తప్పు పట్టారు. టీఎంసీలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ మమతా బెనర్జీ పార్టీపై పూర్తిగా పట్టుకోల్పోయాని చెబుతున్నాయి.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story