BIG STORY: విపక్షాలపై అధికార పక్షం ఎదురుదాడి!
BIG STORY: దేశంలో ర్యాలీల రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రదర్శన, సీఏఐటీ అభ్యంతరాలు మరియు రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహాలపై ప్రత్యేక కథనం.
BIG STORY: విపక్షాలపై అధికార పక్షం ఎదురుదాడి!
BIG STORY: ప్రస్తుతం దేశంలో ర్యాలీల రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ దశాబ్దకాలంలో జాతీయ రాజకీయాలు మునుపెన్నడూలేని రీతిలో వేడెక్కాయి. ప్రస్తుతం అదే వేడి కొనసాగుతోంది. ఇందుకు నాంది పలికింది కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఇందుకు నాంది పలికింది.ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతోంది.
సీజేపీ ట్రెండ్ ను కొనసాగిస్తూ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్ నవంబరు ఒకటో తేదీన ఢిల్లీలో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించింది. జంతర్ మంతర్ ను ధర్నాలకు డీ నోటిఫై చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రామ్ లీలా మైదానంలోనే ఈ ప్రదర్శనను ఇండియా బ్లాక్ నిర్వహించింది.అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ ఈ సభను ఇండియా బ్లాక్ విజయవంతంగా నిర్వహించింది.
ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను చట్టానికి అతీతంగా ఎందుకు చేశారన్నది రాహుల్ అడిగిన సూటి ప్రశ్న. జ్ఞానేష్ కుమార్ ను ఎవరూ ప్రశ్నించకూడదనే చట్టం తేవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు.
అయితే ఇప్పటివరకు రాహుల్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి సమాధానాలు రాలేదు.గతంలో కాంగ్రెస్ పాలనపై ఇటువంటి ప్రశ్నలనే సంధించిన బీజేపీ నాయకులు ప్రస్తుతం అవే ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు.
ఇండియా కూటమి ర్యాలీకి ప్రతిగా బీజేపీ నాయకులు ఢిల్లీలో మరో ర్యాలీ నిర్వహించారు. ప్రశ్నకు మరో ప్రశ్న ...ఎప్పటికీ సమాధానం కాదు.అయితే ఈ విషయం బీజేపీ నాయకులకు తెలియనిది కాదు.అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా సమాధానాన్ని దాట వేశారు. రాహుల్ సంధించిన ప్రశ్నకు కౌంటర్ గా మరో ప్రశ్న వేసి..అదే తమ సమాధానం అనుకోమన్నారు.
అంతేకాదు....1984 నాటి సిక్కు అల్లర్ల విషయాన్ని బీజేపీ నాయకులు తమ ర్యాలీలో ప్రస్తావించారు.సిక్కు అల్లర్ల కు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల కిందటి సిక్కు అల్లర్లకు, రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటో బీజేపీ పెద్దలే చెప్పాలి.
సూటిగా చెప్పాలంటే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత అధికారపక్షం పై ఉంది. అయితే సదరు నైతిక బాధ్యతను పక్కన పెట్టి, కౌంటర్ ర్యాలీలతోనే సమాధానాలు చెప్పాలని కేంద్రంలోని అధికారపక్షం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ర్యాలీలు చేయడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చాలా సహజమైన విషయం. కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్రంలో యూపీఏ సర్కార్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేతులు ముడుచుకుని కూర్చోలేదు.
ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు చేశారు. అయితే ఇందుకు కౌంటర్ గా అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడా నిరసనలు చేపట్టలేదు.
ర్యాలీలు,నిరసన ప్రదర్శనల వల్ల...జన జీవితానికి అంతరాయం ఏర్పడుతుందన్నది వాస్తవం. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండనక్కరలేదు. ర్యాలీలు జరిగిన ప్రాంతంలో రవాణా వ్యవస్థ కు బ్రేక్ పడుతుంది. ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోతాయి.జన జీవనం స్తంభించిపోతుంది.అంతేకాదు..ర్యాలీలు జరిగే చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా సదరు ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంటే వ్యాపారాలకు నష్టం జరుగుతుందన్నది వాస్తవం.
అయితే ప్రతిపక్షాల ర్యాలీలను అడ్డుకోవడానికి ఏకంగా వ్యాపార సంఘాలు తెరమీదకు రావడం ఇదే తొలిసారి. నవంబరు ఒకటో తేదీన ఇండియా కూటమి నిర్వహించతలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాల్సిందిగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కోరడం గమనించాల్సిన విషయం. ఈ మేరకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సీఏఐటీ ఘాటైన లేఖ రాసింది. వ్యాపారుల జీవనోపాధికి విఘాతం కలిగించే పరిస్థితులపై రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా డిమాండ్ చేశారు.
అంతేకాదు..సదరు లేఖలో రాహుల్ గాంధీకి ఏకంగా ఐదు ప్రశ్నలను కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సంస్థ సంధించింది.నిరసన తెలిపే హక్కు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందే హక్కు కంటే ముఖ్యమైనదా? అంటూ సూటి ప్రశ్న వేసింది.దీంతో పాటు మరో నాలుగు ప్రశ్నలను కూడా రాహల్ ను అడిగింది సీఏఐటీ.
అయితే వ్యాపార సంఘాలు లేదా సమాఖ్య ఇలా ప్రతిపక్షాలకు లేఖ రాయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా ఢిల్లీలో అనేక సార్లు ర్యాలీలు నిర్వహించింది.అయితే ఏ రోజు...మీరు తలపెట్టిన ర్యాలీల వల్ల మా జీవనోపాధి దెబ్బతింటుందని వ్యాపార సంఘాలు లేఖ రాసిన చరిత్ర లేదు. దీంతో..ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యాపార సంఘాలు సాయం చేస్తున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, కొంతకాలంగా రాహుల్ గాంధీ ప్రవర్తనలో పరిణతి కనిపిస్తోంది. ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడి గా ఆయన వ్యవహరిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రతిపక్ష నేత హోదాలో లోక్ సభలో లేవనెత్తుతున్నారు. ప్రభుత్వాన్నిఇరుకున పెడుతున్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీని చర్చనీయాంశం చేశారు. అలాగే కార్పొరేట్ల రుణాల మాఫీ గురించి ఆయన మాట్లాడారు.అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవలింది ఆయన క్షేత్ర స్థాయిలోనే ఉండటం.
రాహుల్, ఒక రోజు విద్యార్థులతో మాట్లాడుతున్నారు. మరో రోజు ఒక సామాజిక అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెడుతున్నారు. మొత్తంమీద జనంలోనే...జనంతోనే ఆయన ఉంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ మనుధర్మం గురించి మాట్లాడారు.
మహిళల హక్కుల విషయంలో మనుధర్మం ఏం చెబుతున్నదనే అంశంపై విపులంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. పూణేలో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమంలో మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పితృస్వామ్య బంధనాలను బద్దలుకొట్టండి అంటూ మహిళలకు ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాదు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కులగణన జరగకపోవడం వల్ల వెనుకబడిన తరగతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రజాస్వామ్యం , సామాజిక న్యాయం గురించి ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. అలాగే భారత రాజ్యాంగం గురించి, అభివ్రుద్దికి నోచుకోని అట్టడుగు వర్గాల హక్కుల గురించి ఆయన ప్రస్తావన తీసుకువస్తున్నారు.
వీటన్నిటితో పాటు సాధ్యమైనంత వరకు ఒక చేతిలో రాజ్యాంగం పెట్టుకోవడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని యువత ఆవేదనను, ఆక్రోశాన్ని ఆయన పట్టించుకుంటున్నారు. యువత ఆకాంక్షల గురించి పదే పదే మాట్లాడతున్నారు. యువత సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఆయన మాటల్లో కనిపిస్తోంది.




