Burning Topic: బ్రిక్స్‌ను ప్రపంచానికి దిక్సూచిగా మార్చేసిన భారత్!

Burning Topic: దౌత్య విజయాలు, చాబహార్ ఒప్పందం, చైనాతో సంబంధాలు మరియు బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Oct 2026 7:30 AM IST
Burning Topic
X

Burning Topic: బ్రిక్స్‌ను ప్రపంచానికి దిక్సూచిగా మార్చేసిన భారత్!

Burning Topic: ప్రస్తుతం భారత విదేశాంగ విధానానికి ప్రపంచ రాజకీయ పరిణామాలు అనుకూలంగా మారుతున్నాయి.యుద్ధం కంటే...దౌత్యమే ఎప్పుడూ ఉత్తమం. యుద్దంలో విజయం సాధించినప్పటికీ...దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో...ఎవరూ చెప్పలేరు.చివరకు యుద్దాలు కూడా చర్చల ద్వారానే ముగుస్తాయి.సైనిక చర్యల ద్వారా సాధించలేని విజయాలను అలుపెరుగని దౌత్య ప్రయత్నాలు అందించగలవు. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.

కాగా గత ఐదు సంవత్సరాల్లో భారత్ అనేక అంతర్జాతీయ వివాదాలకు సంబంధించి దౌత్య విజయాలను నమోదు చేసుకుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఆఫ్గనిస్తాన్ అంశం. 2021 ఆగస్టులో తాలిబన్లు ..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ను...మరో పాకిస్తాన్ అని అందరూ అనుకున్నారు. అయితే కాలక్రమంలో ఆఫ్ఘనిస్తాన్..పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తన సంబంధాలను మెరుగుపరచుకుంది.

ఇందులో ఇరాన్ లోని చాబహార్ మీదుగా ఏర్పడిన అనుసంధానం అత్యంత కీలక పరిణామం.చాబహార్ మార్గం వల్ల...సముద్ర తీరం లేని ఆఫ్ఘనిస్తాన్ కు ప్రత్యామ్యాయం లభించినట్లయింది. అలాగే ఇటీవల చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తయిన రైల్వే మార్గం మరో కీలక పరిణామం.ఈ రైల్వే మార్గం ...ఆఫ్ఘనిస్తాన్ ..మధ్య ఆసియా మధ్య మరింత బలమైన రవాణా అనుసంధానంగా మారనుంది.ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు ఇరాన్ మీదుగా సముద్రానికి ప్రత్యామ్నాయ మార్గం లభించింది.

ఇక్కడ చాబహార్ ఓడరేవు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.చాబహార్ విజయం ప్రధానంగా భారత్ దౌత్యం విజయంగానే పేర్కోవాలి. ఒకవైపు అమెరికా ఆంక్షల కారణంగా ఏర్పడిన తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే మరో వైపు ఇరాన్ తో భారత్ తన సంబంధాలను కొనసాగించింది.ఆఫ్ఘనిస్తాన్..మధ్య ఆసియాకు భారత్ చేరుకోవడానికి ఇరాన్ భౌగోళిక పరిస్థితి తప్పనిసరి అని భారత్ అర్థం చేసుకుంది.చాబహార్ లో భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.దీంతో ఇరాన్ కు భారత్ దగ్గరైంది.

భారత్ కు చైనా పొరుగుదేశమన్న సంగతి తెలిసిందే. గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో కొంతకాలం కిందట భారత్ ..చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.కొంతకాలం పాటు రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అయితే చైనాతో పెరిగిన ఈ దూరాన్ని దౌత్యం ద్వారానే భారత్ దగ్గర చేసింది. ఈ నేపథ్యంలో చైనాలో భారత్ సంబంధాలు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డాయి.భారత్ దౌత్యనీతికి సంబంధించి ఇదొక కీలక పరిణామం.

అయితే చైనాలో సరిహద్దు వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు..సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇదొక పెద్ద విజయం కిందే లెక్క. కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ ఈ ఏడాది సెప్టెంబరులో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ఇద్దరు దేశాధినేతలు డిసైడ్ అయ్యారు. చైనా విషయంలో జాతీయ ప్రయోజనాలే ఏకైక అజెండాగా భారత్ దూసుకెళుతోంది.

అలాగే భారత్ మారుతున్న దౌత్య బలం ..బంగ్లాదేశ్ లోనూ కనిపిస్తోంది.బంగ్లాదేశ్ లో స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలను భారత్ కోరుకుంటోంది. అయితే...ఇటీవల పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ పరిణామాలు ..భారత్ కు అందోళన కలిగిస్తున్నాయి.దీంతో..ఇదే అంశంపై భారత్ గట్టిగా స్పందించింది.బంగ్లాదేశ్ తో తాము మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు భారత్ మరోసారి కుండబద్దలు కొట్టింది.

కాగా భారత్ తన దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ప్రతి వివాదాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ వేదికపైకి హడావిడిగా వెళ్లకుండా ఉండాలి.మనం ఒక్క విషయం ఇక్కడ చెప్పుకుని తీరాలి. భారత్..ప్రపంచ పోలీసుగా మారాల్సిన అవసరం లేదు. ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న శక్తులతో కూడా సంబంధాలను కొనసాగించగలగాలి.అంతిమంగా తమ దేశ ప్రయోజనాలకు భారత్ పెద్ద పీట వేయగలగాలి.

కాగా భారత్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.ఇందులో రెండో అభిప్రాయమే లేదు.ఇదంగా కొన్ని సంవత్సరాలుగా భారత్ జరుపుతున్న దౌత్యానికి లభించిన ఫలితంగానే భావించాలి. అయితే..అనుకూల భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. దీంతో ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను భారత్ గమనిస్తూ ఉండాలి.అందుకు అనుగుణంగా దౌత్య నీతిని రూపొందించుకోగలగాలి.

దౌత్య విజయాల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇటీవలి కాలంలో ప్రపంచ పటంపై భారత్ విశ్వగురుగా అవతరించింది.ఇందుకు ఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ కూటమి సదస్సే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటు రష్యా అధినేత పుతిన్ ఇటు చైనా అధినేత షీ జిన్ పింగ్ తో పాటు అనేకమంది దేశాధినేతలు ..ఇటీవలి బ్రిక్స్ కూటమి సదస్సుకు హాజరయ్యారు. కాగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ కూటమి సదస్సు లో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆ‌ఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

మొత్తంగా ప్రపంచ జనాభాలో 41 శాతానికి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచ జీడీపీలో 24 శాతం వాటా కలిగి ఉన్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి బ్రిక్స్ కూటమి దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి . భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి ఒక బలమైన వేదికగా మారుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

ఐక్యరాజ్యసమితితో పాటు భద్రతామండలిలో సమగ్ర సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ సదస్సు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితిని మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దాలని బ్రిక్స్ కూటమి అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్థమాన దేశాలకు కూడా ప్రాతినిధ్యం దక్కేలా ఐక్యరాజ్యసమితిని తీర్చిదిద్దాలని బ్రిక్స్ జొహన్సెస్‌బర్గ్ సదస్సు అభిప్రాయపడింది. దీంతో పాటు సుస్థిరాభివృద్ది అజెండాను సమర్థంతంగా అమలు చేయాలని కోరింది.

అంతర్జాతీయంగా భారత్‌కు ఒక ప్రత్యేకత ఉంది. భౌగోళిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది భారత్‌. కొన్ని సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి 15వ సదస్సులోనూ భారతదేశం కీలకపాత్ర పోషించింది. బహుళపక్ష సంస్థల్లో ఆర్థికపరమైన సంస్కరణల అవసరాన్ని జొహన్నెస్‌బర్గ్‌ సదస్సులో భారత్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాల అభినందనలు అందుకుంది. బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలకు భారత్ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. అలాగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో బలమైన సంబంధాలు పెంపొందించుకోవడానికి బ్రిక్స్ కూటమిని ఒక సాధనంగా భారతదేశం ఉపయోగించుకుంటోంది. పాశ్చాత్య దేశాలతో ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారతదేశం అభిప్రాయపడింది.

బ్రిక్స్‌ కూటమికి సమష్టి ప్రయోజనాలు ఉండాలనేది మౌలికంగా భారత్ చేస్తున్న వాదన. భవిష్యత్ అవసరాలకు దీటుగా బ్రిక్స్ కూటమిని తీర్చిదిద్దుకోవాలంటే ముందుగా సభ్యదేశాల మధ్య సహకారం చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచపటంపై బ్రిక్స్ కూటమి ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

బ్రిక్స్ కూటమికి ప్రపంచపటంపై ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలు వెతికే కూటమిగా బ్రిక్స్ కు తనదైన గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణపై దృష్టి పెట్టింది బ్రిక్స్ కూటమి. అయితే సభ్యత్వ విస్తరణ అనేది ఏకాభిప్రాయంతోనే జరగాలని భారత్ తెగేసి చెప్పింది. బ్రిక్స్ కూటమిపై పెత్తనానికి కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది భారత్‌.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్