Burning Topic: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. దేశంలో 3,400 మంది మృతి
Burning Topic: భారతదేశంలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 97 భారత్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Burning Topic: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు.. దేశంలో 3,400 మంది మృతి
Burning Topic: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మే నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఎక్కువ భారత్‌లో నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. వడగాల్పులు రోజుకు 3,400 మంది చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్వయంగా ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఈ సారి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కరువు పరిస్థితుల తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మన దేశంలో ఈసారి వేసవి మరీ దారుణంగా మారింది. ఉదయం ఎనిమిది అవ్వకముందే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మే మాసంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను గమనించే సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల్లో ఏకంగా 97 నగరాలు భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బిహార్‌లోని ససారం, బక్సర్, ఒడిశాలోని బలాంగిర్, ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి అత్యంత వేడి ప్రాంతాలుగా రికార్డు సృష్టించాయి.
ఈ నగరాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిపోయారు.ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత దారుణంగా ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా.. వడదెబ్బ కారణంగా ఒక్కరోజే వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.
మరో రెండు రోజుల పాటు ఈ వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణ కనిపిస్తోంది.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై జనాన్ని వణికించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో ఎండ తీవ్రత 42 డిగ్రీల మార్కును దాటేసింది.
దేశవ్యాప్తంగా వడగాలులు బీభత్సం సృష్టిస్తున్న వేళ అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ'కి చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ మన దేశానికి సంబంధించిన ఆందోళకర విషయాలు వెల్లడించింది. తీవ్రమైన ఎండ, వడగాలులు నమోదైన రోజు సగటున సుమారు 3,400 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని వీరి అధ్యయనం చెబుతోంది.వడగాల్పుల తీవ్రత వరుసగా ఐదు రోజుల పాటు కొనసాగితే, ఆ మరణాల సంఖ్య ఏకంగా 30,000 వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. పర్యావరణ మార్పులు దేశంలోని ప్రజల మరణాలకు ఎలా కారణం అవుతున్నాయనేది ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ బృందం దేశంలోని 10 నగరాల్లో తీవ్రమైన ఎండ, వడగాలులకు సంబంధిత మరణాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మించిపోయాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో తీవ్రమైన వడగాలులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంభవించే మొత్తం ఎండ మరణాల్లో సింహభాగం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది.
ఐదు రోజుల వడగాలుల సమయంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 8,100 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పింది. అదే సమయంలో అహ్మదాబాద్, జైపుర్, సూరత్ వంటి జిల్లాల్లో ఒక్కోసారి 250కి పైగా అదనపు మరణాలు సంభవిస్తున్నాయని తమ నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఈ తీవ్రమైన వడగాల్పుల ముప్పు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడగాల్పుల ప్రభావం వల్ల దైనందిన జీవితాల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయని, డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దన్నారు. ఖాళీ దొరికితే కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ప్రజలు తగినంత నీళ్లు తాగుతూ ఉండాలని బయటకు వెళ్లేటప్పుడు తమవెంట నీళ్లు తీసుకెళ్లాలని మోదీ సూచించారు. పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసేవారు తీవ్రమైన వేడికి ముఖ్యంగా గురయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. వడదెబ్బ హెచ్చరిక సంకేతాలను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అది త్వరగా ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు.
మరోవైపు ఈ ఏడాది దేశంలో వర్షపాతం తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ఎల్‌నివో ప్రభావంతో భారత వాతావరణ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. మే నెల చివర్లోనే రావాల్సిన నైరుతి రుతు పవనాలు... జూన్ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలో దీర్ఘకాల సగటులో 94 నుంచి 106 శాతం మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, వాయువ్య భారతదేశం, రుతుపవనాల ప్రధాన సమయంలో ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గుదల అనే వార్తలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పంటల దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం పొంది ఉంది.




